తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chilly Paneer | ఈ చిరుతిండి తింటే.. బరువు కూడా తగ్గుతారు

Chilly Paneer | ఈ చిరుతిండి తింటే.. బరువు కూడా తగ్గుతారు

19 March 2022, 14:33 IST

    • నోటికి ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుందా? కానీ వంట గదిలో ఎక్కువ సమయం గడిపే ఇంట్రెస్ట్ కూడా లేదా? అయితే మీరు కచ్చితంగా దీనిని ట్రై చేయాల్సిందే. దీనిని వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కూడా ఇష్టంగా లాగించేయవచ్చు. 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. దీనిని ప్రధాన వంటకంగా తినొచ్చు లేదా చిరు తిండిగాను లాగించేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూసేద్దాం.
చిల్లీ పనీర్
చిల్లీ పనీర్

చిల్లీ పనీర్

అప్పుడప్పుడు మన ఆత్మారాముడు ఏదైనా కొత్త టేస్ట్​ని కోరుకుంటూ ఉంటాడు. మనం కూడా ఏదోరకంగా తనని సంతోషపెడతాము. బయట రెస్టారెంట్లకి వెళ్లి, లేదా ఇంట్లో తయారు చేసుకుని హ్యాపీగా లాగించేస్తాం. కానీ గంటల కొద్ది వంటగదిలో గడపడం మనకే ఒక్కోసారి నచ్చదు. కానీ 15 నిమిషాలలో.. పనీర్​తో ఓ చక్కటి డిష్ తయారు చేవచ్చు. పైగా పనీర్‌లో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ వంటకం బరువు తగ్గడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వంటకం గొప్పదనం ఏమిటంటే, కూరగాయలను ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. డిష్ మరింత పోషకమైనదిగా చేయడానికి మీరు గ్రీన్ బీన్స్, క్యారెట్, క్యాబేజీ, మొక్కజొన్నలను కూడా జోడించవచ్చు. ఈ పనీర్ చిల్లీని సోయా సాస్, కెచప్ లేదా షెజ్వాన్ సాస్ వంటి సాస్‌లను లేకుండా తయారు చేసినా.. అదే రుచిని మాత్రం ఇస్తుంది.

కావాల్సిన పదార్థాలు

* పనీర్- 200 గ్రా

* ఎండు ఎర్ర మిరపకాయ- 2

* ఉల్లిపాయ- 1

* క్యాప్సికమ్- 1

* వెల్లుల్లి- 5 రెబ్బలు

* మిరప పొడి- 1 టీస్పూన్

* కొత్తిమీర పొడి- 1 టీస్పూన్

* మామిడి పొడి-1 టీస్పూన్

* ఉప్పు తగినంత

* టమోటా- 1

* గరం మసాలా పొడి- 1/4 టీస్పూన్

* జీలకర్ర- 1/4 టీస్పూన్

* ఇంగువ- 1/4 టీస్పూన్

* పచ్చి ఆలివ్ నూనె- 1 టేబుల్ స్పూన్

* స్ప్రింగ్ ఆనియన్స్- 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి.. బాణలిలో ఆలివ్ నూనె వేసి వేడిచేయాలి. ఇంగువ, జీలకర్ర, మెత్తగా తరిగిన వెల్లుల్లి, ఎండు మిరపకాయలను జోడించాలి. వాటిని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.

అనంతరం టమోటాలు, క్యాప్సికమ్ వేయాలి. వాటిని మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, ఎర్ర కారం, ధనియాల పొడి, డ్రై మ్యాంగో పౌడర్, గరం మసాలా జోడించాలి. మంచిగా కలిపి మసాలాను రెండు నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు పనీర్ క్యూబ్స్ వేసి వాటిని మసాలాతో కోట్ చేయడానికి బాగా కలపండి. ఆవిరిని ఏర్పరచడానికి 2-3 టేబుల్ స్పూన్ల నీటిని జోడించండి. మీడియం మంట మీద 5 నిమిషాలు ఉడికించండి. అనంతరం తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్​తో డిష్ గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చూశారా సింపుల్​గా ఉండే పనీర్ చిల్లీని తయారు చేయడం. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ పట్టు పట్టేయండి.