తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Chilli Vs Red Chilli : పచ్చి మిర్చి వర్సెస్ ఎండు మిర్చి.. వంటలోకి ఏది మంచిది?

Green Chilli Vs Red Chilli : పచ్చి మిర్చి వర్సెస్ ఎండు మిర్చి.. వంటలోకి ఏది మంచిది?

Anand Sai HT Telugu

24 October 2023, 12:30 IST

google News
    • Green Chilli Vs Red Chilli Benefits : మిర్చి రోజువారి ఆహారంలో కచ్చితంగా ఉపయోగిస్తాం. వంటలో మిర్చి కలిపితే బాగుంటుంది. అయితే కొందరు ఎండు మిరపకాయలు లేదా ఎర్ర మిర్చి, మరికొందరు పచ్చిమిర్చి ఉపయోగిస్తారు. ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది.
పచ్చి మిర్చి వర్సెస్ ఎండు మిర్చి
పచ్చి మిర్చి వర్సెస్ ఎండు మిర్చి (unsplash)

పచ్చి మిర్చి వర్సెస్ ఎండు మిర్చి

వంటలో కొందరు పచ్చి మిర్చి, మరికొందరు ఎండు మిర్చి వాడుతారు. ఈ రెండు రకాల్లో విభిన్న గుణాలు ఉంటాయి. అయితే మన ఆరోగ్యానికి ఏ మిరపకాయ ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా? పచ్చి మిరపకాయలను దాదాపు అన్ని వంటలలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొందరు పచ్చిమిర్చిని వేయించి నమిలి తింటారు. పచ్చి మిరపకాయలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా, అనేక లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పచ్చి మిర్చి ప్రయోజనాలు

పచ్చి మిరపకాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా మన జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి మిర్చి పూర్తిగా క్యాలరీలు లేని ఆహారం. ఇది బరువు తగ్గించే ప్రక్రియలో సహాయపడుతుంది.

బీటా-కెరోటిన్ అధికంగా ఉండే పచ్చి మిరపకాయలు హృదయనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

పచ్చి మిర్చిలో కొన్ని సహజ పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, నోరు, పెద్దప్రేగు, గొంతు క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల నుండి మానవ శరీరాన్ని రక్షిస్తాయి.

పచ్చి మిరపకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

ఎండు మిర్చి ప్రయోజనాలు

ఆహారంలో ఎర్ర మిరపకాయలు లేదా కారం పొడిని ఉపయోగించేందుకు ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. అయితే పచ్చి మిర్చి ఎండిపోవడంతో ఎర్రగా మారుతుంది. దీనిని కూడా చాలామంది వంటల్లో ఉపయోగిస్తారు. ఎర్ర మిర్చిని తెచ్చి.. ఎండబెట్టి కారంపొడిగా చేస్తారు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎర్ర మిరపకాయలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఎండు మిరపకాయలు సంతోషకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. మంచి మానసిక స్థితిని నిర్వహించడానికి సహాయపడతాయి.

పొటాషియం పుష్కలంగా ఉండే ఎర్ర మిరపకాయలు రక్తపోటును నియంత్రించడంలో బాగా సహాయపడుతాయి. అంతేకాకుండా, ఎర్ర మిరపకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎర్ర మిరపకాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది రక్తం గడ్డకట్టడం, అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది.

పచ్చి మిరపకాయలు, ఎర్ర మిరపకాయలు రెండూ వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ రెండు రకాల మిరపకాయలను మీరు ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై తేడా ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో విక్రయించే ఎర్ర కారం పొడిలో శరీరానికి చాలా హాని కలిగించే కల్తీ పదార్థాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరే మిర్చిని తీసుకెళ్లి కారంపొడి పట్టించుకుంటే మంచిది.

తదుపరి వ్యాసం