Serotonin levels: హ్యాపీ హార్మోన్లలో ఒకటైన సెరటోనిన్... సహజంగా మనలో పెరగాలంటే!
Serotonin levels: సెరటోనిన్ స్థాయులు తక్కువగా ఉంటే ఆందోళన, నిరాశ మనల్ని చుట్టు ముట్టేస్తాయి. ఈ హార్మోన్ సహజంగానే పెంచుకోవాలంటే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్లలో సెరటోనిన్ అనేది ఒకటి. ఇది న్యూరో ట్రాన్స్‌మీటర్‌గా పని చేస్తుంది. అంటే మెదడు, నాడీ వ్యవస్థలోని కణాలు ఒకదానితో ఒకటి కమ్యునికేట్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కొన్ని మెదడు పనులనూ రెగ్యులేట్ చేస్తుంది. నైపుణ్యాలు పెంపొందించుకోవడం, నేర్చుకోవడం, నిద్ర, జ్ఞాపకశక్తి.. లాంటి కొన్ని పనులను నిర్వర్తించడంలో దీని పాత్ర ఉంటుంది. మన శరీరంలో ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఆందోళనతో కూడిన మూడ్ ఉంటుంది. అదే దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే మనం ఉత్సాహంగా, ఆనందంగా ఉంటాం. మరి ఈ హార్మోన్‌ని సహజంగా మనలో పెంచుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.
ప్రకృతిలో వ్యాయామం:
మనం ఎక్కువగా ఆరుబయట గడపడం వల్ల మన శరీరంలో ఈ హార్మోన్ విడుదలవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రకృతిలో మమేకమై రోజు వారీ వ్యాయామాలు చేయడం వల్లా ఫలితం ఉంటుంది. వారంలో కనీసం మూడు మార్లైనా రోజుకు 30 నిమిషాల పాటు నడక వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే దీన్ని ఆనందంగా చేయాలి తప్ప.. ఇబ్బందిగా, బాధగా చేయకూడదు.
ఆహారాన్ని సరి చేసుకోండి:
ఆహారాల్లో ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అమైనో యాసిడ్ మెదడుకు చేరిన తర్వాత అది సెరటోనిన్‌గా మార్పు చెందుతుంది. ప్రొటీన్‌లు అధికంగా ఉండే ఆహారాల్లో ఈ ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, గుడ్లు, సోయా ఉత్పత్తులు, చికెన్, టర్కీ కోడి మాంసాలు, జొన్నలు, విత్తనాలు, వాల్‌నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు తదితరాల్లో ఈ ట్రిప్టోఫాన్ఉం టుంది. కాబట్టి ఈ ఆహారాల్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మన మూడ్ బాగుంటుంది.
కాంతి బాగుండేట్లు చూసుకోవాలి:
మనం ఎక్కువగా గడిపే చోట మంచిగా కాంతి ఉండేలా చూసుకోవాలి. చీకటిగా ఉన్న చోటు కంటే వెలుతురుగా ఉన్న చోట మనం రోజంతా గడపడం వల్ల అది ఈ హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఉదయం పూట కాసేపైనా ఎండలో కూర్చునేందుకు ప్రయత్నించాలి.
మసాజ్ థెరపీ:
ఎప్పుడైనా మూడ్ బాగోలేదనుకున్నప్పుడు మసాజ్ థెరపీని ప్రయత్నించి చూడాలి. ఇది సెరెటోనిన్ స్థాయిల్ని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మసాజ్‌కి ముందుతో పోలిస్తే తర్వాత వ్యక్తుల్లో 28 శాతం ఈ హార్మోన్ స్థాయిలు పెరగడాన్ని పరిశోధకులు గుర్తించారు.
ఇక మూడ్ ఎప్పుడూ బాగోవడం లేదు. సమస్య తీవ్రంగా ఉంది అనుకునే వారు డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం. వారు మీ పరిస్థితిని అంచనా వేసి ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ సప్లిమెంట్లను ఇస్తారు. వాటిని తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
టాపిక్