Moringa Leaves: వందల వ్యాధులకు ఒక్కటే మందు.. మునగాకు! ఆహారంలో ఇలా చేర్చుకోండి-know different benefits of moringa leaves and how to use them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moringa Leaves: వందల వ్యాధులకు ఒక్కటే మందు.. మునగాకు! ఆహారంలో ఇలా చేర్చుకోండి

Moringa Leaves: వందల వ్యాధులకు ఒక్కటే మందు.. మునగాకు! ఆహారంలో ఇలా చేర్చుకోండి

Koutik Pranaya Sree HT Telugu
Oct 04, 2023 01:30 PM IST

Moringa Leaves: మునగ చెట్టు వేరు నుంచి పువ్వు దాకా బోలెడు పోషకాల గని. అయితే మునగాకును ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి లాభాలుంటాయో చూసేయండి.

మునగాకుతో ప్రయోజనాలు
మునగాకుతో ప్రయోజనాలు

పూర్వకాలం నుంచి మునగాకును మన ఆహారాల్లో భాగంగా తీసుకునే అలవాటు ఉంది. ముఖ్యంగా తెలుగువారు ఆచారాల పేరుతో ఆషాఢ మాసంలో దీన్ని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తారు. మిగిలిన కాలాల్లో దీన్ని తినేందుకు పెద్దగా శ్రద్ధ చూపించరు. మునగాకు ఎన్నో జబ్బులను తగ్గించే సంజీవనిగా ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మనకు దొరికే అన్ని ఆకు కూరల్లో కంటే దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకనే దీన్ని దొరికినంత కాలం చక్కగా వారానికి ఒకసారైనా తినేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మనకు వచ్చే అవకాశాలున్న రోగాలు కూడా 90 శాతం వరకు తగ్గుముఖం పడతాయని అంటున్నారు.

మునగాకును ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు?

తాజా మునగాకు దొరికే సీజన్ లో నేరుగా కూరలు వండుకోవచ్చు. సాంబర్ లో వేసుకోవచ్చు. మునగాకుతో పచ్చడి చేసుకోవచ్చు. సీజన్ కానప్పుడు.. ముందుగానే ఆకును ఎండబెట్టుకోవాలి. ఆకును ఎండలో కాకుండా నీడలోనే గాలితో ఆరేలా చూసుకోవాలి. తడి ఆరాక ఈ ఆకులను పొడి చేసుకుని గానీ, లేదంటే అలాగే గాలి చొరవని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కూడా సాంబార్, కూరల్లో వేసుకోవచ్చు. ఉదయం తాగే స్మూతీల్లో వేసుకోవచ్చు. సూప్స్, సలాడ్లలో పొడి చల్లుకోవచ్చు. కుకీలు చేసే పిండిలో వేయొచ్చు. వేడి నీటిలో ఈ పొడిని మరిగించి కాస్త పంచదార వేసుకుని టీ లాగా తాగేయొచ్చు.

మునగాకు లాభాలు:

ఎముకల అరుగుదల ఉన్న వారికి :

కాల్షియం లోపం ఉన్న వారు మునగాకును ఎక్కువగా తినేందుకు ప్రయత్నించాలి. ఎముకల అరుగుదల, ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఇది చక్కగా ఉపకరిస్తుంది. పాలలో కంటే 17 రెట్లు ఎక్కువగా కాల్షియం ఇందులో ఉంటుంది. అలాగే పెరుగులో కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రొటీన్‌ ఉంటుంది. ఇంకా అరటిపండులో కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఇందులో లభిస్తుంది. ఎదిగే పిల్లలకు మునగాకు రసాన్ని పాలల్లో కలిపి తాగించడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.

క్యాన్సర్లకు చెక్‌ :

మునగాకులో యాంటీ క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నాయి. అందుకనే ఇది కొన్ని రకాల క్యాన్సర్లను రానీయకుండా చేస్తుంది. ఇది కొన్ని క్యాన్సర్‌ కణాలను సమర్థవంతంగా చంపివేస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.

జీర్ణ శక్తికి :

కొందరికి తిన్న ఆహారం సరిగ్గా ఒంటపట్టదు. అరుగుదల సమస్యలు ఉంటాయి. ఇలా అజీర్ణం, మూత్ర విసర్జనలో మంట, మలబద్ధకం, మూత్ర పిండాల వ్యాధులు.. తదితరాలు ఉన్న వారు వీటిని వాడుకోవచ్చు. ఒక గ్లాసు క్యారెట్‌ జ్యూస్‌ ఒక చెంచా మునగాకు రసం కలుపుకుని తాగడం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

చర్మ వ్యాధులకు :

నువ్వుల నూనెలో మునగాకు రసాన్ని పోసి మరగనివ్వాలి. దీన్ని గజ్జి, తామర, దురదల్లాంటి వాటికి పైపూత మందులా వాడుకోవచ్చు.

ఆస్తమా, టీబీలకు ఔషధం :

ఓ గ్లాసుడు నీళ్లలో గుప్పెడు మునగాకుల్ని వేసి మరగనివ్వాలి. వాటిని వడగట్టి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం చేర్చి కలపాలి. ఈ నీటిని తాగడం వల్ల ఆస్తమా, టీబీ, దగ్గు తగ్గుముఖం పడతాయి. ఇంతే కాదండీ శరీరంలో ప్రతి అవయవానికీ వచ్చే ఇబ్బందికీ ఇది పరిష్కారం చూపుతుంది. అందుకనే కనీసం వారానికి ఒకసారైనా దీన్ని తప్పకుండా తినాలి.

Whats_app_banner