తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Health In Winter | చలికి ఆల్కాహాల్ తీసుకుంటున్నారా? గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ!

Heart Health in Winter | చలికి ఆల్కాహాల్ తీసుకుంటున్నారా? గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ!

HT Telugu Desk HT Telugu

10 January 2023, 13:04 IST

google News
    • Heart Health in Winter: ఈ చలికాలంలో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. అధిక ఆల్కాహాల్, ధూమపానం, ఉప్పు చక్కెర వినియోగాలు గుండె వైఫల్యానికి దారితీస్తాయి. ఇక్కడ సూచించిన మార్పులు చేసుకోండి.
Heart Health in Winter
Heart Health in Winter (Pixabay)

Heart Health in Winter

ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలం బయట విహారయాత్రలు చేయటానికి, విందులు వినోదాల్లో పాల్గొనడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితుల విషయంలో ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన సీజన్.

చల్లని వాతావరణం ధమనుల సంకోచించానికి కారణమవుతుంది. దీనివల్ల గుండెకు రక్తం, ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయి. రక్తం గడ్డకట్టే అవకాశం పెరుగుతుంది, ఈ సీజన్‌లో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి మన గుండె ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

చలికాలంలో చాలా మంది తమని తాము వెచ్చగా ఉంచుకోవటానికి అల్కాహాల్ సేవిస్తారు. వ్యాయామాలు అతిగా చేస్తారు. అంతేకాకుండా ఈ చలికాలంలో ఆహార కోరికలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్రజలు వేడివేడి చిరుతిళ్లు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, గులాబ్ జామూన్, హల్వా మొదలైన రుచికరమైన ఆహారాలను తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ అలవాట్లన్నీ గుండెపోటుకు కలిగించే ప్రమాద కారకాలే.

Heart Health in Winter- శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం చర్యలు

ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ అపర్ణ జస్వాల్ ఈ శీతాకాలంలో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మీరు మీ రోజూవారీ జీవనశైలిలో తీసుకోవాల్సిన కొన్ని మార్పులను సూచించారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

మద్యానికి నో చెప్పండి

ఇది వేడుకల సమయం, ఈ చలికాలంలో పార్టీలు ఎక్కువ ఉంటాయి. చలిని సాకుగా చూపుతూ కూడా మద్యం సేవించేవారు ఎందరో ఉంటారు. అయితే ఈ కాలంలో ఆల్కాహాల్ తీసుకునే మోతాదు చాలా తగ్గించాలి, పూర్తిగా మానేస్తే చాలా మంచిది. అధిక ఆల్కహాల్ గుండెను బలహీనపరచడానికి దారితీస్తుంది. గుండె కండరాలపై ఆల్కహాల్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా, గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేదు, ఇది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఆల్కహాలిక్ కార్డియోమయోపతి ACM అనేది ఆల్కహాల్ దీర్ఘకాలిక వినియోగం వల్ల వస్తుంది. ఇది ప్రాణాంతకం కావొచ్చు. కాబట్టి మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి.

ఉప్పు తక్కువ తినండి

ఉప్పు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. చలికాలంలో వివిధ రకాల ఆహారాలు తీసుకోవడం వలన శరీరంలో ఉప్పు మోతాదులు పెరిగిపోతాయి. అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. కాబట్టి, మీరు తీసుకునే ఉప్పు పరిమాణాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం.తద్వారా మన రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.

చక్కెర తక్కువ తినండి

ఉప్పుతో పాటు చక్కెర వినియోగం కూడా గణనీయంగా తగ్గించాలి. స్వీట్లు ఎక్కువగా తినడం, అధిక చక్కెర వినియోగం మధుమేహాం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యకు కారణం అవుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి ఉప్పు, చక్కెరలు ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం, వాటిని తగ్గించాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం

చలికాలంలో మనం అలవర్చుకోవలసిన జీవనశైలి మార్పులలో ముఖ్యమైనది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. మనం మన రోజువారీ వ్యాయామాన్ని కొనసాగించాలి. అయితే, వ్యాయామం ఉదయాన్నే చేయకూడదు, కానీ సూర్యుడు ఉన్నప్పుడు కొంచెం ఆలస్యంగా చేయాలి. మీరు మీ వ్యాయామం ఇంటి లోపల వెచ్చని గదిలో చేయడానికి కూడా ఎంచుకోవచ్చు. తీవ్రమైన వ్యాయామాలు కాకుండా మితమైన వ్యాయామాలు చేయాలి. యోగా ఈ చలికాలంలో చేయదగిన ఒక మంచి ఇండోర్ వ్యాయామం అనిపించుకుంటుంది. మీరు నడకకు వెళ్లవచ్చు.

ఈ రకమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం వలన మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చలికాలంలో గుండెపోటును నివారించవచ్చు.

తదుపరి వ్యాసం