తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pets Illness In Monsoon : వర్షాకాలంలో పెట్స్​కి వచ్చే రోగాలు ఇవే.. ఇలా జాగ్రత్త తీసుకోండి..

Pets Illness in Monsoon : వర్షాకాలంలో పెట్స్​కి వచ్చే రోగాలు ఇవే.. ఇలా జాగ్రత్త తీసుకోండి..

08 July 2022, 13:28 IST

    • Pets Illness in Monsoon : మనలాగే మనం ప్రేమతో పెంచుకునే పెంపుడు జంతువులు కూడా వర్షాకాలంలో ఇబ్బందులు పడతాయి. వాటికి సీజన్ ఇన్​ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా వాటిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఒకవేళ వస్తే వాటిని ఎలా ట్రీట్​ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  
వర్షాకాలంలో పెట్ కేర్
వర్షాకాలంలో పెట్ కేర్

వర్షాకాలంలో పెట్ కేర్

Pets Illness in Monsoon : వర్షాకాలంలో రోగాలు ఎక్కువగా ప్రబలుతాయి. అందుకే ఈ కాలంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ రుతుపవనాలు మనుషులకే కాదు మన పెట్స్​కు కూడా అదే స్థాయిలో అంటువ్యాధులను కలిగిస్తాయి. కాబట్టి వర్షాలు ప్రారంభమైతే.. పెంపుడు తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పెట్స్​ని బాగా కాపాడుకోవాలి. వాటికి కలిగే ఇబ్బందులను అర్థం చేసుకుని.. తగు చికిత్సలు చేసి.. పశువైద్యులను సంప్రదించాలని సూపర్‌టైల్స్ చీఫ్ వెటర్నరీ డాక్టర్ శాంతను సూచించారు. ఇంతకీ పెట్స్​కి వర్షాకాలంలో వచ్చే వ్యాధులేమిటి? వాటికి ఎలాంటి చికిత్సలు అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పేలు, ఈగలు వల్ల వచ్చే వ్యాధులు

పేలు, ఈగలు వెచ్చని, తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో నివసించే అత్యంత ఇబ్బందికరమైన పరాన్నజీవులు. ఇవి పెంపుడు జంతువులలో అనేక రకాల ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతాయి. వీటివల్ల పెట్స్​కి టిక్ ఫీవర్, ఫ్లీ కాటు అలెర్జీలు లేదా ఫ్లీ అలర్జిక్ డెర్మటైటిస్‌ వంటి వాటికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో.. టిక్ జ్వరం మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారి తీస్తుంది.

కాబట్టి పెంపుడు జంతువుల తల్లిదండ్రులు దోమలు, పేలు నుంచి తమ పెంపుడు జంతువులను కాపాడుకోవాలి. వాటిని ఈ వ్యాధులనుంచి రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మీ పెట్ విశ్రాంతి తీసుకునే ప్రదేశాన్ని శుభ్రంగా, చక్కగా ఉంచుకోవాలి. పొడి పరుపులు తప్పనిసరిగా ఉండాలి. వీటిని తరచుగా భర్తీ చేయాలి. పేలు, ఈగలను చంపడంలో ప్రభావవంతమైన యాంటీ-టిక్ స్ప్రేలు, స్పాట్-ఆన్ సొల్యూషన్‌లతో పాటు యాంటీ-టిక్ షాంపూలను తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఫంగల్ ఇన్ఫెక్షన్

సాధారణంగా శరీరంలోని పాదాల కాలి మధ్య తేమను నిలుపుకునే ప్రాంతాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందుతుంది. ఇది చర్మంపై రంగు మారడం, ఉత్సర్గ లేదా దుర్వాసన రావడం ద్వారా మనకు తెలుస్తుంది. ఔషధాలతో స్నానాలు, చికిత్స సహాయంతో వీటిని నయం చేయవచ్చు. కానీ సమస్య తీవ్రమైతే మరింత శ్రద్ధ అవసరం.

వర్షాకాలంలో పెంపుడు జంతువులు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నందున.. వాటిని వీలైనంత పొడిగా ఉంచాలి. పాదాలకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు తగ్గించవచ్చు. ప్రతి నడక తర్వాత వాటి పాదాలను బాగా కడగాలి. అనంతరం అవి డ్రైగా ఉండేలా చూసుకోవాలి.

జీర్ణ సమస్యలు

గియార్డియాసిస్ అనేది మట్టిలో కనిపించే ప్రోటోజోవాన్ వల్ల వస్తుంది. దీనిని మీ పెంపుడు జంతువు తిన్నప్పుడు ప్రేగులలోకి ప్రవేశిస్తుంది. తద్వార వాటికి విరేచనాలు, వాంతులు వంటి జీర్ణ రుగ్మతలు వస్తాయి. పెంపుడు జంతువుల తల్లిదండ్రులు.. పెట్స్ మలంలో పురుగుల ఉనికి ద్వారా లేదా పెంపుడు జంతువు అతిసారం లేదా విపరీతమైన వాంతులతో బాధపడుతున్నట్లయితే ఈ వ్యాధులను గుర్తించవచ్చు. అటువంటి సందర్భాలలో పశువైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అంతే కాకుండా పశువైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా నులిపురుగుల నిర్మూలన చేయాలి.

చెవి ఇన్ఫెక్షన్లు

వర్షాకాలంలో చెవి ఇన్ఫెక్షన్లు చాలా సాధారణం. అటువంటి పరిస్థితిలో పెంపుడు జంతువుల చెవులు, వాటి తల వణుకుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి తల వంచుకుని కూడా నడుస్తుంటాయి. పెంపుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా అలాంటి అలవాట్లను గమనించాలి. చెవిని శుభ్రపరచడం, మందులతో కూడిన చుక్కలు వేయాలి.

వర్షాకాలాన్ని ఎదుర్కోవడం కోసం.. వాటికి అవసరమైన టీకాలు లేదా బూస్టర్ మోతాదులు వేయించాలి. వీటి వల్ల వర్షాకాలంలో అంటువ్యాధులు, వ్యాధులు సులువుగా దరిచేరవు.

టాపిక్