Nose Picking Habit | ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉందా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా?
27 April 2023, 19:00 IST
- Nose Picking Habit: ముక్కులో వేలుపెట్టుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే మీరు ఎప్పటికీ ఆ పనిచేయరు. తాజా పరిశోధనల్లో ఏం తేలిందో తెలుసుకోండి.
Nose Picking Habit
Nose Picking Habit: కొంతమందికి తరచుగా ముక్కులో వేలు పెట్టుకోవడం అలవాటు. తమ వేలును ముక్కు రంధ్రంలో జొప్పించి పెన్సిల్ చెక్కినట్లు చెక్కుతారు. ఇలా ముక్కులో వేలు పెట్టుకున్నప్పుడు వారికి సౌకర్యంగా ఉంటుందేమో కానీ, అది చూసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా కొంతమందైతే ముక్కులో వేలు పెట్టుకొని ఆ వెంటనే ఆ వేలును నోట్లో పెట్టుకుంటారు, గోర్లు కొరుకుతారు. ఇక ఆ దృశ్యం చూసినపుడు చూసిన వారికి కలిగే అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది. అయితే ముక్కులో వేలు పెట్టుకోవడం అనారోగ్యకరమైన అలవాటు (Unhealthy Habit) అని వైద్యులు అంటున్నారు. అది వారి ఆరోగ్యాన్ని ఊహించని రీతిలో దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక అధ్యయనం ప్రకారం, నాసికా రంధ్రాల్లో వేలుపెట్టి తిప్పడం వల్ల కొన్ని అంతర్గత కణజాలాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా ఇది కొన్ని జాతుల హానికర బ్యాక్టీరియాను మెదడులోకి ప్రవేశించడానికి మార్గం కల్పిస్తుంది. ఈ బ్యాక్టీరియాలు మెదడుకు చేరిన తర్వాత, అవి అల్జీమర్స్ (Alzheimer's) వంటి లక్షణాలను కలిగిస్తాయి. అల్జీమర్స్ అనేది మెదడుకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది తీవ్రమైన మతిమరుపును (Memory Loss) కలిగిస్తుంది. ఈ వ్యాధి నెమ్మదిగా మీ జ్ఞాపకాలను, ఆలోచనా నైపుణ్యాలను నాశనం చేస్తుంది. చివరికి రోజువారీ పనులలో సరళమైన పనులను చేయగల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎలుకలపై నిర్వహించిన అధ్యయనాల ప్రకారం పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ముక్కులో వేలుపెట్టుకోవడం అనేది చాలా మంది పెద్దగా ఆలోచించకుండా చేసే ఒక సాధారణ అలవాటు. అయితే, ఈ అలవాటు మెదడు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో పరిశోధనలు హెచ్చరించాయని న్యూఢిల్లీకి చెందిన న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ " నాసికా కుహరం నేరుగా మెదడుకు ఘ్రాణ నాడి ద్వారా అనుసంధానం చెంది ఉంటుంది, ఇది మన వాసనను గ్రహించే సామర్థ్యానికి సంబంధించిన భాగం. ఘ్రాణ నాడి మెదడులోని హిప్పోకాంపస్‌కు ప్రత్యక్ష మార్గాన్ని కలిగి ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తి ,అభ్యాసానికి కీలకం. నాసికా రంధ్రాలలో వేళ్లు పెట్టడం, నాసికా కుహరంలో కలిగే దీర్ఘకాలిక మంట వల్ల హిప్పోకాంపస్‌లో తాపజనక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది, ఇది మెదడు కణాలను దెబ్బతీస్తుంది." అని డాక్టర్ భరద్వాజ్ చెప్పారు. దీనితో పాటు ఇతర నష్టాలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు.
ముక్కులో వేలుపెట్టుకోవడం వలన కలిగే మరిన్ని నష్టాలను పరిశీలిస్తే, ఇది నాసికా భాగాల నుండి శ్లేష్మంను తొలగించగలదు. అప్పుడప్పుడు ఇది ముక్కు కణజాలానికి హాని కలిగించవచ్చు. సున్నితమైన నాసికా లైనింగ్ దెబ్బతింటుంది. అలాగే కోవిడ్19 సహా ఇతర ఇన్ఫెక్షన్లు సోకడానికి కూడా అవకాశం ఉంటుంది.
కాబట్టి చిన్నదే అయినా, అనారోగ్యకరమైన అలవాట్లు మానుకుంటే ఆరోగ్యానికి మంచిది.