Egg For Hair: నీసు వాసనకు భయపడి తలకు గుడ్డు రాసుకోవడం లేదా..? ఈ సారి ఇలా ట్రే చేయండి.. వాసన రానే రాదు
20 December 2024, 13:30 IST
Egg For Hair: గుడ్డు జుట్టుకు ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దాని వాసన కారణంగా కొంతమంది దీన్ని పెట్టుకోవడానికి ఇష్టపడరు. మీకు ఇదే సమస్య అయితే ఇక్కడ మీకు ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుంది. తలకు గుడ్డు రాసుకునేటప్పుడు ఇలా చేశారంటే నీసు వాసన రానే రాదు.
తలకు గుడ్డు రాసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి
జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా, మృదువుగా మార్చడంలో ఎగ్ హెయిర్ మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అయినప్పటికీ, జుట్టుకు గుడ్లు రాసుకునేటప్పుడు సంభవించే అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి దాని నీసు వాసన. కొంతమంది అమ్మాయిలు కూడా తమ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్లు రాసుకోవాలని కోరుకుంటారు. కాని దాని నుంచి వచ్చే నీసు వాసనకు భయపడి దూరంగా ఉంటారు. ఎగ్ ప్యాక్ వేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కూడా గుడ్డులోని ఆ వాసన చాలా రోజుల పాటు ఉంటుంది. ఇది చాలా మందికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వారికి ఇబ్బంది లేకపోయినా పక్కవారు వారి గురించి ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏదేమైనా వెంట్రుకలకు గుడ్డు రాసుకోవాలనుకేవారికి గుడ్డు నుంచి వచ్చే దుర్వాసనే అయితే ఇక్కడ మీ కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. గుడ్లలో కొన్ని పదార్థాలను కలపడం వల్ల నీచు వాసన రాకుండా ఉండటమే కాకుండా.. .వెంట్రుకలు మరింత అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. ఆలస్యం చేయకుండా ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా మరి..
ఆలివ్ నూనె:
జుట్టుకు గుడ్డు మాస్క్ అప్లై చేసేటప్పుడు వచ్చే ఘాటైన నీసు వాసనను నివారించడానికి ఈ హెయిర్ మాస్క్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఇది గుడ్ల నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడమే కాకుండా మీ వెంట్రుకలు చక్కడా హైడ్రేట్ చేస్తుంది. గుడ్లలో ఆలివ్ నూనె కలిపి తలకు బాగా పట్టించడం వల్ల జుట్టుకు మంచి మాయిశ్చరైజ్ అవుతుంది.
నారింజ:
నారింజ బలమైన, తాజా సువాసన కలిగిన పండు. గుడ్ల నుంచి వచ్చే నీసు వాసన నుంచి ఇది మిమ్మల్ని కాపాడతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా జుట్టుకు ఎగ్ మాస్క్ అప్లై చేసినప్పుడల్లా అందులో కొద్దిగా కాస్త నారింజ రసం లేదా నారింజ పొడిని మిక్స్ చేయాలి. ఇది గుడ్డు నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడమే కాకుండా జుట్టు మంచి పోషణను అందిస్తుంది. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును మరింత ఆరోగ్యకరంగా మారుస్తుంది. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
నిమ్మరసం:
గుడ్ల వాసనను నివారించడానికి మీరు నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు. నిమ్మరసం గుడ్ల వాసనను తొలగించడమే కాకుండా, వెంట్రుకలకు లోతైన శుభ్రతను అందిస్తుంది. జుట్టు నుండి గుడ్ల వాసనను తొలగించడానికి, గుడ్డు మాస్క్ అప్లై చేసిన తర్వాత షాంపూతో జుట్టును బాగా కడగాలి. ఆ తర్వాత మగ్ లో కొద్దిగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఇప్పుడు ఈ నీటిని జుట్టుకు బాగా అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత తిరిగి తలస్నానం చేయాలి. ఈ విధంగా గుడ్ల వాసన తొలగిపోవడంతో పాటు జుట్టును డీప్ క్లీనింగ్ అవుతుంది.
పెరుగు:
పెరుగు జుట్టుకు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. పెరుగు అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది. ఇది తల లోతుల్లో నుంచి శుభ్రతకు సహాయపడుతుంది. అంతేకాదు చుండ్రు సమస్య నుండి కూడా చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు నుండి గుడ్ల వాసనను తొలగించడానికి పెరుగును కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఎగ్ మాస్క్ అప్లై చేసిన తర్వాత జుట్టును షాంపూతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత అరకప్పు పెరుగులో రెండు టీస్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి తలంతా అప్లై చేయాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో తిరిగి తలస్నానం చేయాలి. ఇది గుడ్ల వాసనను తొలగించి జుట్టును బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది.
సువాసన కలిగిన నూనె:
జుట్టు నుండి గుడ్ల వాసనను తొలగించడానికి మీరు ఏదైనా సువాసన జుట్టు నూనెను ఉపయోగించవచ్చు. కొన్ని చుక్కల కొబ్బరి, బాదం లేదా ఉసిరి నూనె గుడ్ల వాసనను తొలగిస్తుంది. దీని కోసం, మీరు గుడ్డు హెయిర్ మాస్క్ తయారు చేసినప్పుడల్లా అందులో 8 నుండి 10 చుక్కల సుగంధ హెయిర్ ఆయిల్ కలపండి. ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.