తెలుగు న్యూస్  /  Lifestyle  /  Alia Bhatt Says First Weeks Of Pregnancy Were Difficult With Exhaustion Nausea

Alia Bhatt on pregnancy: ప్రెగ్నెన్సీ తొలి వారాల్లో ఆ కష్టం ఉండేదంటున్న ఆలియా

HT Telugu Desk HT Telugu

02 January 2023, 10:06 IST

    • Alia Bhatt on pregnancy: బాలీవుడ్ స్టార్ ఆలియా తన ప్రెగ్నెన్సీ ముచ్చట్లను పంచుకుంది.
హార్ట్ స్టోన్ నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్
హార్ట్ స్టోన్ నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్

హార్ట్ స్టోన్ నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్

తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వర్క్ చేయాల్సి వచ్చిందని బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గుర్తు చేసింది. నవంబరు 2022లో ఆలియా, రణ్‌బీర్ కపూర్ జంట రాహా కపూర్ అనే పాపకు జన్మనిచ్చారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆలియా తన సినిమాలు డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో పాల్గొనాల్సి వచ్చింది. అంతే కాదు హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ యాక్షన్ మూవీలో నటించాల్సి వచ్చింది. ఆమెకు హాలివుడ్‌లో ఇదే తొలి చిత్రంగా నిలవనుంది. అది యాక్షన్ మూవీ కూడా.

తన ప్రెగ్నెన్సీ గురించి తొలి 12 వారాల పాటు ఎవరికీ షేర్ చేయొద్దని అనుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో ఆలియా భట్ చెప్పింది. ముందస్తుగా కమిట్‌మెంట్స్ ఉండడంతో ప్రెగ్నెన్సీలోనూ వర్క్ చేయకతప్పలేదని, తన శరీరాన్ని, తనలో ఉన్న బేబీని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగానని చెప్పింది. ఆలియా, రణ్‌బీర్ 2022 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. జూన్ చివరలో ఆలియా తన ప్రెగ్నెన్సీ న్యూస్ అనౌన్స్ చేసింది.

తను బేబీ బంప్‌తోనే రాత్రి పగలూ పనిచేసినట్టు బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలియా చెప్పారు. ‘ఏవైనా శారీరకంగా పరిమితులు ఉంటే తప్ప.. పరిమితులు గీసుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రెగ్నెన్సీ సమయాన్ని ఊహించలేం.. అందువల్ల ప్రెగ్నెంట్‌గా ఉన్నానంటే కొన్ని పరిమితులు ఉంటాయని తెలుసు.. రోజూ శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వ్యవహరించాలని అనుకున్నా. పని చాలా ముఖ్యమే అయినప్పటికీ ఆ సమయంలో నాకు బేబీ, నా ఆరోగ్యం ప్రాధాన్యమైన అంశాలు. నాకు సౌకర్యంగా ఉంటేనే ముందుకు సాగాలని మొదటి నుంచీ అనుకున్నాను. అదృష్టంకొద్దీ నాకు శారీరకంగా ఇబ్బందులేవీ తలెత్తలేదు. అయితే ప్రెగ్నెన్సీలో తొలుత కొన్ని వారాలు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఆ సమయంలో తీవ్రమైన అలసట, వికారం ఉండేది. అయితే నేను దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే తొలి 12 వారాలు ఎవరికీ చెప్పొద్దంటారు కదా..? అదే అందరూ చెబుతారు. అందువల్లే నేను ఆ విషయం నాలోనే దాచుకున్నాను. కానీ నా శరీరంలో మార్పులను గమనిస్తున్నా.. అది చెబుతున్నది వింటున్నా..’ 

‘షూటింగ్ మధ్యలో పడుకోవాల్సి వస్తే నేను వ్యాన్‌లో నిద్ర పోయేదాన్ని. సాధ్యమైనంతగా విశ్రాంతి పొందేందుకు ప్రయత్నించేదాన్ని. అయితే మన వర్క్ కమిట్‌మెంట్స్ కూడా తీర్చాలి కదా. హార్ట్ ఆఫ్ స్టోన్ నా ఫస్ట్ హాలీవుడ్ మూవీ. జనవరి 2022లో సైన్ చేశాను. షెడ్యూలు ప్రకారం షూటింగ్‌లో పాల్గొనేందుకు బాగా ప్రయత్నించాను. నేను వెనక్కి తగ్గలేదు. నా టీమ్‌తో మాట్లాడాను. నన్ను బాగా చూసుకుంటానని చెప్పారు. నేను ప్రెగ్నెంట్‌గా ఉండగానే నా తొలి యాక్షన్ మూవీ షూటింగ్‌ మేనేజ్ చేయగలిగాను. మీ మనస్సును మీ శరీరంపై ఉంచితే దాని సామర్థ్యం మీకు అర్థమవుతుంది..’ అని ఆలియా చెప్పింది. 

నవంబరులో ఆలియా రణ‌్‌బీర్‌లకు పుట్టిన పాపకు నీతూకపూర్ రాహా కపూర్ అని పేరు పెట్టింది. పాపతో ఆలియా దంపతులు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.

ఆలియా కరణ్ జోహార్ తదుపరి చిత్రం రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్, ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా ఆజ్మీ తదితరులు నటిస్తున్నారు.

టాపిక్