తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  One-sided Relationship | అవతలి వైపు నుంచి స్పందనలు లేవా? అయితే మీ సంబంధం ఏకపక్షమే!

One-sided Relationship | అవతలి వైపు నుంచి స్పందనలు లేవా? అయితే మీ సంబంధం ఏకపక్షమే!

HT Telugu Desk HT Telugu

12 April 2023, 20:20 IST

google News
    • One-sided Relationship: మీరు ఒక సంబంధంలో ఉన్నప్పటికీ మీ మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపించడం లేదా? అయితే మీది ఏకపక్షమైన సంబంధం కావచ్చు. దీని సంకేతాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
One-sided Relationship
One-sided Relationship (Unsplash)

One-sided Relationship

Relations: మన జీవితంలో కొందరితో తొలిచూపులోనే ప్రేమలో పడతాం. వారితో ఒక జీవితాన్ని ఊహించుకుంటాం. వారివైపు నుంచి కూడా అదే తరహా స్పందన ఉంటే ఇద్దరి మధ్య ప్రేమ వికసిస్తుంది. లేదా వన్ సైడ్ లవర్ (One side love) గానే మిగిలిపోవాల్సి వస్తుంది. ప్రేమ ఏకపక్షం అవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కానీ, సంబంధం కూడా ఏకపక్షం అవడం అనేది కొంత మానసిక వ్యాకులతను కలిగిస్తుంది. ఇంతకీ ఈ ఏకపక్ష సంబంధం అంటే ఏమిటి అనుకుంటున్నారా? మనం ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తూ కూడా వారి ప్రేమాభిమానాలను పొందకుండా, వారితో ఎలాంటి సుఖాలు లేకుండా, కేవలం యాంత్రికమైన సహజీవనాన్ని కొనసాగించడమే ఏకపక్ష సంబంధం (one-sided relationship).

ఏకపక్ష సంబంధంలో ఒక వ్యక్తి మరోవ్యక్తిపై ప్రేమను చూపుతారు, వారికి అన్ని రకాల సేవలు చేస్తారు, అవసరానికి ఆదుకుంటారు, తమ జీవితంలో ఆ వ్యక్తి చాలా ముఖ్యమైన వారిగా భావిస్తారు. కానీ అవతలి వ్యక్తి నుంచి మీరు కోరుకునే స్పందన లభించదు. సమాజానికి మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నట్లు భావిస్తారు. కానీ అసలు విషయం ఏమిటో మీకు మాత్రమే తెలుసు. ఈ రకమైన బంధాలు (Fake Relations) ఎక్కువకాలం కొనసాగవు, కలిసి ఉన్నా, కలిసి నడిచినా ప్రయోజనం లేదు.

మీది కూడా ఏకపక్ష సంబంధం భావిస్తున్నారా? కానీ ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారా? అయితే కొన్ని సంకేతాలతో మీ బంధాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆ సంకేతాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

కమ్యూనికేషన్ లేకపోవడం: ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడటానికి, ఏదైనా విషయం చెప్పటానికి ప్రయత్నం చేస్తే, అవతలి వ్యక్తి ఆ మాటలు వినడానికి ఆసక్తి చూపకపోతే లేదా ప్రతిస్పందించకపోతే, అది ఏకపక్ష సంబంధానికి సంకేతం కావచ్చు.

మద్దతు లేకపోవడం: వారికి మీ అవసరం ఉన్నప్పుడు మీరు వారిని అన్ని రకాలుగా ఆదుకుంటారు, వారికోసం మీరు అండగా నిలబడతారు. కానీ, మీకు మద్దతు అవసరమైనప్పుడు అవతలి వ్యక్తి మీ కోసం అక్కడ లేకుంటే, అది ఏకపక్ష సంబంధానికి సంకేతం కావచ్చు.

సమాన ప్రయత్నం లేకపోవడం: ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇద్దరిలో ఒక్కరు మాత్రమే అన్ని పనులు చక్కబెట్టడం, అన్ని సమస్యలు తీర్చడం, ఇద్దరి కోసం అన్నీ ఒకరే చేయడం చేస్తున్నప్పుడు, అవతలి వ్యక్తి ఈ విషయాలపై ఏమాత్రం శ్రద్ధ కనబరచకపోతే వారికి మీ అవసరం లేదు.

విలువ లేకపోవడం: మీరు వారికి చాలా విలువ ఇస్తారు, వారి గురించి గొప్పగా చెప్తారు, మీరు వారికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. కానీ వారు మాత్రం మీకంటే ఎక్కువ మరొకరికి ప్రాధాన్యతను ఇస్తున్నప్పుడు మీకు విలువ లేదు అన్న భావన కలుగుతుంది. ఇది ఏకపక్షమే.

ప్రశంస లేకపోవడం: మీరు మీ ఇద్దరి జీవితాల కోసం ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని రిస్కులు తీసుకున్నప్పటికీ, అవతలి వ్యక్తి అదేమి పట్టనట్లుగా ఉంటే, వారు థాంక్స్ చెప్పకపోయినా, కనీసం వారు కృతజ్ఞతాభావంతో లేకపోతే అది ఏకపక్ష సంబంధానికి సంకేతం కావచ్చు.

ఒంటరితనం: మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నప్పటికీ మీరు ఒంటరి అనే భావన కలగడం, ఒంటరితనంను అనుభవిస్తుంటే, మిమ్మల్ని సరిగ్గా కేర్ చేసేవారు లేరని అర్థం, ఇది ఏకపక్ష సంబంధానికి సంకేతమే.

ప్రతీ సంబంధంలో సమస్యలు ఉంటాయి, కానీ ఈ ఏకపక్ష సంబంధంలో ఇద్దరి మధ్య బంధమే ఒక సమస్యగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎలాంటి భావోద్వేగాలు పంచుకోవడం జరగదు, ఆ అనుబంధం (Emotional Bonding) ఉండదు. చాలాసార్లు ఇలాంటి విషయాలు గుర్తింపులోకి రావు, ఇది నాలుగు గోడల మధ్య నలిగే ఒక సమస్య. ఒకరి మనసులో సాగే మానసిక సంఘర్షణ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక మౌనయుద్ధం.

మీరు కూడా ఇలాంటి ఏకపక్షమైన బంధంలో ఉన్నారని భావిస్తే, మీకు విలువనివ్వని వ్యక్తుల మధ్య ఉండటం కంటే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో ఉండటం మేలు.

తదుపరి వ్యాసం