తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Herb Garden Ideas | మీ ఇంట్లోనే హెర్బ్ గార్డెన్ సృష్టించండి.. ఇలాంటి మొక్కలు పెంచుకోండి!

Herb Garden Ideas | మీ ఇంట్లోనే హెర్బ్ గార్డెన్ సృష్టించండి.. ఇలాంటి మొక్కలు పెంచుకోండి!

HT Telugu Desk HT Telugu

05 January 2023, 17:17 IST

google News
    • Herb Garden Ideas : మీ వంటగదిలో, ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు, అవి మీరు వంటల్లో వాడేందుకు ఉపయోగపడతాయి.
Herb Garden Ideas
Herb Garden Ideas (Unsplash)

Herb Garden Ideas

ఇంట్లో మొక్కలు ఉంటే ఆ ఇంటికి అందం ఉంటుంది, ప్రయోజనాలు ఉంటాయి. అదే మీ వంటిట్లో మొక్కలు ఉంటే మీ వంటలు ఘుమఘుమలాడతాయి. వంటింట్లో మొక్కలు ఏంటి అనుకుంటున్నారా? కొద్దిపాటి స్థలంలో కూడా మీరు వంటలకు అవసరమయ్యే మొక్కలను నాటుకోవచ్చు. దీనినే కిచెన్ గార్డెన్ లేదా హెర్బ్ గార్డెన్ అని కూడా పిలుస్తారు.

సాధారణంగా మీరు వంటలలో ఉపయోగించే కరివేపాకు, కొత్తిమీర మొదలైన మొక్కలను మీ వంటగదికి దగ్గరగా పెంచుకోవచ్చు. మీకు కావాలసినప్పుడల్లా, మీరు పెంచుకుంటున్న తోట నుంచి అప్పటికప్పుడే తాజా ఆకులను కోసి వంటలో ఉపయోగిస్తే మీ వంట సువాసన పెరుగుతుంది. ఇవి పూర్తిగా మీ కనుసన్నల్లో సేంద్రియ విధానంలో పెరిగేవి కాబట్టి మీ కుటుంబ ఆరోగ్యానికి చాలా మంచిది.

Herb Garden Ideas- హెర్బ్ గార్డెన్ కోసం చిట్కాలు

మీరు హెర్బ్ గార్డెన్ పెంచుకోవడంపై ఆసక్తిగా ఉంటే ప్రాథమిక దశలో కూరగాయల మొక్కలకు బదులుగా రోజ్మేరీ, పుదీనా, కొత్తిమీర, సేజ్, తులసి వంటి మూలికా మొక్కలను పెంచుకోవచ్చు. ఇవి పెరిగేందుకు తక్కువ స్థలం చాలు, చిన్న పూలకుండీలలో పెంచుకోవచ్చు. ఏ మొక్కను ఎలా నాటాలో ఇక్కడ క్లుప్తంగా వివరిస్తున్నాము, తెలుసుకోండి.

కొత్తిమీర

కొన్ని ధనియాలను తీసుకొని ఒక కుండలో నాటండి, వెచ్చని సూర్యకాంతి పడేలా చూడండి. కొద్దిపాటి నీరు చల్లుతుండండి, ఎక్కువ నీరు పోయకుండా జాగ్రత్తపడండి. కొన్నిరోజుల్లో కొత్తిమీర రెమ్మలు మొలవడం ప్రారంభమవుతాయి.

పుదీనా

మీరు ఎప్పుడైనా మార్కెట్ నుంచి పుదీనా కొనుగోలు చేస్తే వాటి ఆకులు వాడిన తర్వాత వేర్లు కలిగిన వాటి కాండాలను ఏదైనా ఒక కుండలో నాటవచ్చు. ఇది చాలా సులభంగా పెరిగే మొక్క, నేల తడిగా ఉంటే చాలు. తొందరగానే మొలకెత్తడం ప్రారంభం అవుతుంది.

లెమన్‌గ్రాస్‌

లెమన్‌గ్రాస్‌ వేరు కాండం ముక్కను ముందుగా నీళ్ల పాత్రలో ఉంచాలి. నిమ్మగడ్డి 2 అంగుళాల పొడవు పెరిగే వరకు ప్రతిరోజూ నీటిని మార్చండి, పొడవు పెరిగిన తర్వాత అప్పుడు దానిని కుండీలోకి మార్చండి, కుండీ ఎప్పుడూ తేమగా ఉండేలా చూడండి, ఎండ తగిలేలా ఉంచండి.

అజ్వైన్

అజ్వైన్ లేదా వాము మొక్కను పెంచడం సులభం. దీనికి ఎక్కువ సూర్యకాంతి లేదా నీరు అవసరం లేదు. అజ్వైన్ ఆకులతో ఉన్న వాము మొక్క కాండంను నేరుగా కుండీలో నాటి, రోజూ కొన్ని నీళ్లు చల్లుతూ ఉండండి. కొద్దిరోజుల్లో ఆ మొక్క పెద్దగా పెరగడం చూడవచ్చు. ఈ మొక్క ఆకులు తినదగినవి, కడుపు నొప్పికి సులభమైన ఇంటి నివారణ. దీన్ని రైతాలో, సలాడ్‌లలో చల్లుకోండి. దీని ఆకులు సహజమైన మౌత్ ఫ్రెషనర్. వాస్తు ప్రకారం కూడా అజ్వైన్ మొక్క ఉండటం అదృష్టం.

మిరపకాయ

ఎండు మిరపకాయను తొలిచి అందులోని విత్తనాలను సేకరించి చిన్న ట్రేలో నాటండి, అవి మొలకెత్తి కొన్ని ఆకులు వచ్చాక ఆపై పెద్ద కుండీలోకి మార్చండి. మిరప మొక్కలకు వేడి, నీరు సమానంగా అవసరం. సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రదేశంలో అవి మంచిగా పెరుగుతాయి.

సోయాకూర

సోయాకూర ఆకు విత్తనాలు తీసుకొని చిన్న కుండీలో చల్లండి, నాటవద్దు. కొన్ని నీరు పోస్తే చాలు. సోయాకూర ఆకు గాలి, ఎండ సమృద్ధిగా లభించే చోట పెరుగుతుంది. వీటి ఆకులను చేపలు, సూప్‌లు, సలాడ్‌లు, మాంసం, పౌల్ట్రీ, ఆమ్‌లెట్‌లు, బంగాళదుంపలలో వేస్తే కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం