Kitchen Gardening | వంటిగది వద్దనే కూరగాయల మొక్కల పెంపకం.. ఇప్పుడిదో ట్రెండ్!
31 March 2022, 19:04 IST
- మీకోసం పండించుకోండి.. మీరే వండుకొని తినండి.
- వంట చేసేటపుడు అలా చెట్టు నుంచి తెంపుకొచ్చి ఇలా కూరల్లో వేసి వండుకుంటే ఇంతకంటే తాజా, ఇంతకంటే ఆరోగ్యకరమైన వంట ఇంకోటి ఉంటుందా? కిచెన్ గార్డెన్ ఇప్పుడు ఇండియాలో సరికొత్త ట్రెండ్ గా విస్తరిస్తోంది.
Kitchen Gardening Ideas
ఈ రోజుల్లో ఆరోగ్యానికి దాదాపు అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. కూరగాయలు ఒకేసారి తెచ్చుకోకుండా అప్పటికప్పుడే తాజాగా తెచ్చుకొని వండుకుంటున్నారు. అందులోనూ సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్ నుంచి అన్నీ తెచ్చుకున్నా వంట చేసే సమయానికి మళ్లీ ఏదో ఒక ఆకుకూర, కాయగూర మరిచిపోతారు. అయితే ఇటువంటి సమస్యలు లేకుండా ఇప్పుడు చాలా మంది 'కిచెన్ గార్డెన్' కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కిచెన్ గార్డెన్ అంటే మరేంటో కాదు.. మన ఇంట్లో వంటగదికి దగ్గరగా మనకు నిత్యం అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల మొక్కలను పెంచుకోవడం. హోమ్ గార్డెన్, న్యూట్రిషన్ గార్డెన్, కిచెన్ గార్డెన్ లేదా వెజిటబుల్ గార్డెన్ ఇలా వివిధ పేర్లతో ఇంటి వద్దనే కూరగాయలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారుతోంది. దీనివల్ల మన స్వంతంగా పరిశుభ్రమైన వాతావరణంలో పండించటమే కాకుండా ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతుంది. అన్నింటికీ మించి ఆరోగ్యం, ఆత్మసంతృప్తి మన సొంతం అవుతుంది. అందుకే ఒక్క ఇండియాలోనే కాదు ఇలాంటి కిచెన్ గార్డెన్ ఐడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.
కిచెన్ గార్డెన్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి?
కిచెన్ గార్డెన్ కోసం ఎక్కువ స్థలం అవసరం లేదు. ఇది బయటకు అమ్మడానికి కాకుండా మన అవసరాల కోసం మనమే మనకు కావాల్సిన మొక్కలను పెంచుకోవడం. మీ ఇంటి వద్ద ఉన్న కొద్దిపాటి స్థలం సరిపోతుంది, కాకపోతే మొక్కలు పెరగడానికి ఆ ప్రదేశంలో తగినంత సూర్యరశ్మి ఉండాలి. కనీసం రోజుకి 4 నుండి 5 గంటల పాటు తగినంత సూర్యకాంతి ఆ ప్రదేశంలో ఉండేలా చూసుకోండి.
గతంలో ఇంటి నిర్మాణం చేసేటపుడు ఇంటి వెనకాల మొక్కల కోసం పెరటిని ఏర్పాటు చేసుకునే వారు, కానీ ఇప్పుడు నగరాల్లో భూమి విలువ పెరిగిపోయింది. కాబట్టి స్థలం ఎక్కువగా ఉండటం లేదు.
టెర్రేస్- మీ ఇంటి పైభాగాన టెర్రేస్ మీకు అందుబాటులో ఉంటే అక్కడ పెంచుకోవచ్చు. లేదా మెట్ల ఉంటే పూలకుండీలు ఏర్పాటు చేసుకోవచ్చు, కిటికీల వద్ద కూడా చిన్నచిన్న కుండీలు ఏర్పాటు చేసుకొని అక్కడ పెంచుకోవచ్చు.
ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు?
తక్కువ స్థలంలో, సులభంగా పెరిగే మొక్కలను ఎంచుకోవాలి. ఈ జాబితాలో టొమాటో, వంకాయలు, మిరపకాయలు, బెండకాయలు, కాకరకాయలు, ఉల్లిగడ్డలు, క్యారెట్, కొత్తిమీర, పుదీన, లెమన్ గ్రాస్ మొక్కలను పెంచుకోవచ్చు.
ప్రామాణికంగా 1:1:1 నిష్పత్తిలో కంపోస్ట్, కోకోపీట్, తోట మట్టి కలిగిన మిశ్రమం అయితే మొక్కలు సులభంగా పెరుగుతాయి. అలాగే కూరగాయలు తరిగగా మిగిలిన వ్యర్థాలను ఎరువుగా ఉపయోగించుకోవచ్చు.
ఈ కిచెన్ గార్డెన్ తో ఇంటికి మంచి అలంకరణ రావడంతో పాటు కొన్ని అవసరాలు తీరుతాయి, ఆరోగ్యమైన ఆహారం తినగలుగుతాము.
టాపిక్