తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyanka On Rrr: ఆర్ఆర్ఆర్ ఓ తమిళ సినిమా.. తప్పును సరి చేయబోయి పప్పులో కాలేసిన ప్రియాంక

Priyanka on RRR: ఆర్ఆర్ఆర్ ఓ తమిళ సినిమా.. తప్పును సరి చేయబోయి పప్పులో కాలేసిన ప్రియాంక

Hari Prasad S HT Telugu

29 March 2023, 19:15 IST

google News
  • Priyanka on RRR: ఆర్ఆర్ఆర్ ఓ తమిళ సినిమా అట. తప్పును సరి చేయబోయి పప్పులో కాలేసింది ప్రియాంక చోప్రా. ఆస్కార్ గెలిచిన సినిమా గురించి కూడా తెలియదా అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

రాజమౌళి, కీరవాణిలతో ప్రియాంకా చోప్రా
రాజమౌళి, కీరవాణిలతో ప్రియాంకా చోప్రా

రాజమౌళి, కీరవాణిలతో ప్రియాంకా చోప్రా

Priyanka on RRR: ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలిచింది. అయితే ఆ అవార్డుల సెర్మనీలో హోస్ట్ ఈ మూవీని బాలీవుడ్ సినిమా అని పరిచయం చేసినందుకు అతన్ని అభిమానులు ఓ ఆటాడుకున్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ లో మరో యాంకర్ డ్యాక్స్ షెఫర్డ్ కూడా ఈ ఆర్ఆర్ఆర్ మూవీని బాలీవుడ్ సినిమాగా అభివర్ణించాడు. అయితే అదే షోలో ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా అతన్ని సరిచేయబోయి తానే పప్పులో కాలేసింది.

ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదు.. తమిళ సినిమా అని ఆమె అనడం గమనార్హం. దీంతో నెటిజన్లను ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రియాంకా చేసిన ఈ పొరపాటును ఓ వ్యక్తి బయటపెట్టగా.. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది.

అసలేం జరిగిందంటే..

ఈ షోలో ఇప్పటి బాలీవుడ్ ను 1950ల నాటి హాలీవుడ్ తో డ్యాక్స్ పోల్చాడు. కొందరి చేతుల్లోనే ఇండస్ట్రీ ఉండటాన్ని ఉద్దేశించి అతడు ఇలా పోల్చాడు. దీనికి ప్రియాంకా కూడా అంగీకరించింది. "మీరు చెప్పింది నిజమే. బాలీవుడ్ అలాగే ఉండేది. పెద్ద స్టూడియోలు, ఐదుగురు నటులు.. వాళ్లే పెద్ద సినిమాలు చేయడం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు చాలా మంది కొత్త కంటెంట్ తో వస్తున్నారు" అని ప్రియాంకా చెబుతూ వెళ్లింది.

ఈ సమయంలో డ్యాక్స్ ఆమెను అడ్డుకుంటూ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రస్తావించాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నిజానికి అది తమిళ సినిమా.. అదో పెద్ద, మెగా, బ్లాక్‌బ్లస్టర్ తమిళ సినిమా.. మన అవెంజర్స్ లాగా అని ప్రియాంకా చెప్పింది. ఇదొక్క మాటతో నీ మీద ఉన్న గౌరవం పోయిందంటూ ఓ అభిమాని ఆమెను ట్యాగ్ చేశాడు. అది ఏ భాషకు చెందిన సినిమానో తెలియకుండా మాట్లాడటం సరికాదని మరొకరు అన్నారు.

నార్త్ వాళ్లకు కనీసం తమిళం, తెలుగు మధ్య తేడా తెలియదా అంటూ ఇంకో యూజర్ ఘాటుగా స్పందించాడు. మార్చి 12న జరిగిన ఆస్కార్స్ సెర్మనీలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు ఆస్కార్ గెలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ పశ్చిమ దేశాల్లో ఈ మూవీపై విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే అది తెలుగు సినిమా అన్న విషయం వాళ్లలో ఎవరికీ తెలియకపోవడమే మన దురదృష్టం.

తదుపరి వ్యాసం