Ajay Devgn On Oscars: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ నా వల్లే వచ్చింది- అజయ్ దేవ్‌గణ్ కామెంట్స్ వైరల్
Ajay Devgn On Oscars: ఆర్ఆర్ఆర్ సినిమాకు తన వల్లే ఆస్కార్ వచ్చిందంటూ కపిల్ శర్మ షోలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Ajay Devgn On Oscars: ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు తన వల్లే ఆస్కార్ వచ్చిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు (Naatu Naatu) పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకొని ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో ఆర్ఆర్ఆర్ చాటిచెప్పింది.
అంతే కాకుండా నాటు నాటు పాట ను ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో లైవ్‌లో కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా ఫారిన్స్ డ్యాన్సర్స్ ఈ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకోవడంతో చిత్ర యూనిట్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తోన్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ గెలుచుకోవడంపై బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఈ సినిమాలో అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్ర పోషించారు. రామ్‌చరణ్ తండ్రిగా కనిపించాడు. ప్రస్తుతం భోళా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న అజయ్ దేవ్‌గణ్ కపిల్ శర్మ షోకు హాజరయ్యాడు. మీరు నటించిన సినిమాకు ఆస్కార్ రావడం ఎలా అనిపించిందని కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు తనవల్లే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్‌ను గెలుచుకుందని అజయ్ దేవ్‌గణ్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
నాటు నాటు పాటలో తాను డ్యాన్స్ చేసి ఉంటే ఆస్కార్ వచ్చేది కాదని అజయ్ దేవ్‌గణ్ అన్నాడు. తన డ్యాన్స్ చూసి అకాడెమీ జ్యూరీ మెంబర్స్ ఆస్కార్ ఇచ్చేవారు కాదంటూ ఫన్నీగా అజయ్ దేవ్‌గణ్ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డ్యాన్స్‌లో పూర్ అనే విషయాన్ని తనపై తానే సెటైర్ వేసుకుంటూ సరదాగా కపిల్ శర్మ ప్రశ్నకు అజయ్ దేవ్‌గణ్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భోలా సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది. తమిళంలో విజయవంతమైన ఖైదీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అజయ్ దేవ్‌గణ్ స్వయంగా దర్శకత్వం వహించాడు.