1 Year for Salaar: ప్రభాస్ యాక్షన్ ధమాకా సలార్‌కు ఏడాది.. షారూఖ్ మూవీని ఢీకొట్టి బ్లాక్‍బస్టర్.. ఏ ఓటీటీల్లో చూడొచ్చు?
22 December 2024, 7:01 IST
- 1 Year for Salaar: ప్రభాస్ యాక్షన్ మూవీ సలార్ సినిమాకు ఏడాది పూర్తయింది. దీంతో సోషల్ మీడియాలో మోతెక్కిపోతుంది. అభిమానులు నెట్టింట సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ వివరాలు ఇవే..
1 Year for Salaar: ప్రభాస్ యాక్షన్ ధమాకా సలార్‌కు ఏడాది.. షారూఖ్ మూవీని ఢీకొట్టి బ్లాక్‍బస్టర్.. ఏ ఓటీటీల్లో చూడొచ్చు?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. బాహుబలి 2 తర్వాత వరుసగా మూడు పరాజయాలు ఎదురవగా.. సలార్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు ప్రభాస్. ఈ చిత్రంలో యాక్షన్ విశ్వరూపం చూపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తెలుగు, హిందీ సహా విడుదలైన అన్ని భాషల్లో దుమ్మురేపింది. ఈ సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటితో (డిసెంబర్ 22, 2024) సరిగ్గా సంవత్సరం పూర్తయింది.
సోషల్ మీడియాలో ఫుల్ హంగామా
సలార్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా మోతెక్కిపోతుంది. ఈ సినిమా గురించి వీడియోలు, ఫొటోలు, కామెంట్లను చాలా మంది ఫ్యాన్స్, నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ యాక్షన్ విశ్వరూపాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో హైలైట్ సీన్లను పోస్ట్ చేస్తున్నారు. కాటేరమ్మ ఫైట్ ఎడిట్స్ అదిరిపోతున్నాయి. దీంతో ఎక్స్ (ట్విట్టర్)లో సలార్ నేడు ట్రెండ్ అవుతోంది.
ప్రభాస్‍కు ఎంతో కీలకం
పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ బాహుబలి 2 తర్వాత సాహో, రాధే శ్యాం, ఆదిపురుష్‍తో ప్రభాస్‍కు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ప్రభాస్ పని అయిపోయిందా అనే విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో సలార్ మరోసారి ప్రభాస్ స్టార్‌డమ్‍ను మరోసారి నిరూపించింది. కలెక్షన్ల మోత మోగించింది. హైవోల్టేజ్ యాక్షన్ విశ్వరూపంతో ప్రభాస్ దుమ్మురేపేశారు. అభిమానులు పండగ లాంటి సినిమాను ఇచ్చారు. సలార్ సక్సెస్ ప్రభాస్‍కు ఎంతో కీలకంగా నిలిచింది. బిగ్గెస్ట్ కమ్‍బ్యాక్ ఇచ్చింది. ఈ ఏడాది కల్కి 2898 ఏడీతోనూ ప్రభాస్ మరో బ్లాక్‍బస్టర్ కొట్టారు.
డంకీని ఢీకొట్టి.. గెలిచింది
గతేడాది బాక్సాఫీస్ వద్ద భారీ వార్ జరిగింది. షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ, సలార్ పోటీ పడ్డాయి. డిసెంబర్ 21న డంకీ రిలీజ్ కాగా.. ఆ తర్వాత రోజు సలార్ వచ్చింది. ప్రభాస్ యాక్షన్ ధమాకా ముందు షారుఖ్ మూవీ నిలువలేకపోయింది. హిందీలోనూ డంకీని సలార్ ఫుల్ డామినేట్ చేసింది. హిందీలోనూ సలార్‌దే పైచేయి అయింది. పాన్ ఇండియా రేంజ్‍లో ప్రభాస్ క్రేజ్, స్టార్‌డమ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. డంకీని ఢీకొట్టి క్లియర్ విన్నర్‌గా సలార్ నిలిచింది. ఖాన్సార్‌పై ఆధిపత్యం కోసం పోరాటం, ఫ్రెండ్‍షిప్, హైవోల్టేజ్ యాక్షన్‍లతో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.
సలార్ కలెక్షన్లు
సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా, డంకీ పోటీలో ఉన్నా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.
సీక్వెల్ కోసం వెయిటింగ్
సలార్ మూవీకి సీక్వెల్ రానుంది. సలార్ 2: శౌర్యంగపర్వం పేరుతో ఇది ఉండనుంది. పార్ట్ 1 క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఉండటంతో సీక్వెల్‍పై క్రేజ్ నెక్స్ట్ రేంజ్‍లో నెలకొంది. సలార్ 2 ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే.. రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ సినిమాల తర్వాతే సలార్ 2ను ప్రభాస్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఏ ఓటీటీల్లో చూడొచ్చు!
సలార్ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది.
సలార్ చిత్రంలో ప్రభాస్‍తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ చేశారు. శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, టిన్నూ ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని హొంబాలే ఫిల్మ్స్ నిర్మించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు.