Adipurush Controversy: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ రైటర్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే!-adipurush writer manoj muntashir shukla apologises for hurting people emotion ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Controversy: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ రైటర్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే!

Adipurush Controversy: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ రైటర్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే!

Adipurush Controversy: ఆదిపురుష్ సినిమా రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. చేతులు జోడిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు.

మనోజ్ ముంతాషిర్ శుక్లా (Photo: ANI)

Adipurush Controversy: ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమా తొలుత కలెక్షన్‍లను మెరుగ్గా రాబట్టినా ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది. అయితే, ఆదిపురుష్ మూవీపై మాత్రం విమర్శలు భారీగా వచ్చాయి. మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలోని కొన్ని డైలాగ్‍లు, సీన్‍లపై ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోర్టుల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిపురుష్ మూవీలో హనుమంతుడు చెప్పే కొన్ని డైలాగ్‍ల విషయంలో ప్రజలు ఆగ్రహించారు. ఈ సినిమా రచయిత మనోజ్ మంతాషిర్ శుక్లాపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇంత కాలం సమర్థించుకుంటూ వచ్చిన మనోజ్ శుక్లా ఎట్టకేలకు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నేడు ట్వీట్ చేశారు.

ఆదిపురుష్ సినిమాలో కొన్ని డైలాగ్‍లు మార్చామనటంతో పాటు ఏవోవే వాదనలతో ఇంతకాలం సమర్థించుకుంటూ వచ్చిన రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా నేడు ప్రజలకు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశాడు. “ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను ఒప్పుకుంటున్నాను. చేతులు జోడించి, నేను భేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. బజరంగ్‍బలి అందరినీ ఏకంగా ఉంచుతాడని భావిస్తున్నా. మన సనాతన ధర్మానికి, మహోన్నత దేశానికి సేవ చేసే సామర్థ్యాన్ని ఇస్తాడని ఆశిస్తున్నా” అని మనోజ్ ముంతాషిర్ ట్వీట్ చేశాడు.

అయితే, ముంతాషిర్ క్షమాణలను అంగీకరించబోమని కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంత ఆలస్యంగా చెప్పటంలో అంతరార్థం ఏంటని, థియేటర్లలో నుంచి సినిమా వెళ్లిపోవటంతో ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందుగా విశ్వాసాలను కించపరిచి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కొందరికి అలవాటైందని మరికొందరు కామెంట్లు చేశారు. అయితే, క్షమాపణ అడిగితే అంగీకరించాలని మరికొందరు అంటున్నారు.

ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదల కాగా.. తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్‍లను రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లు మందగించాయి. ఈ చిత్రంలో రాఘవుడిగా స్టార్ హీరో ప్రభాస్, జానకిగా కృతిసనన్, లంకేశ్‍గా సైఫ్ అలీఖాన్, బజరంగ్‍గా దేవ్‍దత్ నాగే నటించారు. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.480 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది.

మరోవైపు, ఆదిపురుష్‍లో వినియోగించి గ్రాఫిక్స్ గురించి కూడా చిత్రయూనిట్‍పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా రావణుడి గెటప్, గ్రాఫిక్స్ పై విమర్శలు వచ్చాయి.

కాగా, ఆదిపురుష్ సినిమా జూలైలోనే ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో ఆదిపురుష్ స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది.