Lord Shiva: శివుడి పర్మిషన్ కోసం ఆగా.. ప్రతి సోమవారం కన్నప్ప అప్డేట్: మంచు విష్ణు
15 June 2024, 13:04 IST
Manchu Vishnu About Kannappa Movie In Teaser Launch: మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప టీజర్ జూన్ 14న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ మూవీ టీజర్ లాంచ్‌లో శివుడి పర్మిషన్ ఇస్తే తీయడానికి రెడీగా ఉండాలనే సెట్ చేసి పెట్టుకున్నానని మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
శివుడి పర్మిషన్ కోసం ఆగా.. ప్రతి సోమవారం కన్నప్ప అప్డేట్: మంచు విష్ణు
Manchu Vishnu About Kannappa Movie: మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత భారీ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోంది కన్నప్ప మూవీ. అనౌన్స్‌మెంట్ నుంచే క్రేజీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాలో మంచు విష్ణుతోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి అగ్ర నటీనటులు యాక్ట్ చేస్తున్నారు.
కన్నప్ప సినిమాతో మోడల్ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 14న విడుదలైన కన్నప్ప మూవీ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇందులో అగ్ర నటీనటులందరూ కనిపించడంతో ఎగ్జైట్ అవుతున్నారు. కాగా ఈ కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. "కన్నప్ప చిత్రాన్ని ప్రతీ ఒక్క ఆడియెన్ భుజానికి ఎత్తుకుని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి వస్తున్న సపోర్ట్‌ని చూస్తూనే ఉన్నాను. అందుకే వాళ్లలోంచి కొంత మందిని ఇక్కడకు పిలిచాను. 2014లో కన్నప్ప జర్నీ ప్రారంభమైంది. 2015లో నేను కన్నప్పని డెవలప్ చేస్తూ వెళ్తుంటే.. తణికెళ్ల భరణి గారు పూర్తిగా నాకే అప్పగించారు" అని మంచు విష్ణు తెలిపారు.
"నా దైవం, నా తండ్రి మోహన్ బాబు గారు, విన్ని, వినయ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కన్నప్పను తెరపైకి తీసుకు రాగలిగాను. టీం సెట్ కాలేదు కానీ.. లొకేషన్ల కోసం వేట ప్రారంభించాను. శివుడు పర్మిషన్ ఇస్తే తీయడానికి రెడీగా ఉండాలనే అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. గత ఏడాది ఆ శివుడు పర్మిషన్ ఇచ్చారు. మేం సినిమాను తీశాం. ఆయన ఆశీస్సుల వల్లే సినిమాను తీయగలిగాం" అని మంచు విష్ణు శివుడి అనుమతి కోసం ఆగినట్లు చెప్పారు.
"కన్నప్ప మైథాలజీ కాదు. కన్నప్ప మన చరిత్ర. కట్టు కథ అంటే నమ్మకండి. రెండో శతాబ్దంలో జరిగిన కథ. చోళ రాజుల టైంలో జరిగింది. ఏడో శతాబ్దంలోనూ కన్నప్ప గురించి శంకరాచార్యులవారు చెప్పారు. 14వ శతాబ్దంలో నాయనార్ల గురించి ధూర్జటి రాశారు. అందులో 9వ నాయనార్ కన్నప్ప. 18వ శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లు ఇంగ్లీష్‌లో ప్రింట్ చేశారు. బికనీర్ యూనివర్సిటీలో ఆ పుస్తకం చూశాం. ఆ పుస్తకాన్ని చదివి.. ఎంతో జాగ్రత్తగా తీసి ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాం" అని మంచు విష్ణు వెల్లడించారు.
"కన్నప్ప నా బిడ్డలాంటిది. ఈ కన్నప్ప కోసం ఇంత మంది ఆర్టిస్టులని ఎందుకు తీసుకున్నామనేది సినిమా చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపై ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇది నా వర్షెన్‌లో రాసుకున్న కన్నప్ప. అందుకే వరల్డ్ ఆఫ్ కన్నప్ప అని అందరినీ ఆహ్వానించాం" అని మంచు విష్ణు అన్నారు.
"నేను రెండో శతాబ్దం కథను చెబుతున్నాను. దానికి తగ్గట్టుగా ఉండాలనే న్యూజిలాండ్ లొకేషన్‌లో సినిమాను తీశాం. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తున్నామని ముందుకు వెళ్లాం. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ అద్భుతంగా నటించారు. ఈ కన్నప్ప మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. హర హర మహదేవ్" అంటూ మంచు విష్ణు తన స్పీచ్ ముగించారు.
టాపిక్