Astram Movie: పాకిస్తానీలు మెచ్చిన యాంటీ పాకిస్తాన్ మూవీ.. తెలుగులో రీమేక్ చేసి చెడగొట్టిన మంచు విష్ణు
Anti Pakistan Indian Movie Sarfarosh Telugu Remake Astram: పాకిస్తాన్ ప్రేక్షకులు నచ్చిన యాంటీ పాకిస్తాన్ సినిమా సర్ఫరోష్. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో మంచు విష్ణు అస్త్రం టైటిల్‌తో రీమేక్ చేశారు. కానీ, తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
Aamir Khan Sarfarosh Manchu Vishnu Astram: సాధారణంగా ఇండియన్ సినిమాలను పాకిస్తాన్ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కామన్‌గానే వాళ్లకు భారతీయ చిత్రాలపై ఒకరకమైన విముఖత ఉంటుంది. అలాంటిది ఓ ఇండియన్ మూవీని సైతం పాకిస్తానీలు ఇష్టపడ్డారు. అది కూడా యాంటీ పాకిస్తాన్ సినిమా. అంటే పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించిన భారతీయ చిత్రాన్ని పాకిస్తాన్ ప్రజలు ఇష్టపడటం విశేషంగా మారింది.
ఆ సినిమానే సర్ఫరోష్. 1999లో హిందీలో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) హీరోగా చేశారు. ఆయనకు జోడీగా మురారి ఫేమ్ సోనాలి బింద్రే (Sonali Bendre) హీరోయిన్‌గా నటించింది. నసీరుద్ధీన్ షా, సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, ముఖేష్ రిషి, మకరంద్ దేశ్‌పాండే వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు. వీరితోపాటు రాజేష్ జోషి, స్మిత జయకర్, ఉపాసన సింగ్, మనోజ్ జోషి, ఆకాష్ ఖురానా ఇతరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
సర్ఫరోష్ మూవీకి జాన్ మాథ్యూ మత్తన్ (John Matthew Matthan) కథ, దర్శకత్వం వహించారు. అలాగే ఆయనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. వికాస్ శివరామన్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీ ఎరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్‌పై ఏప్రిల్ 30, 1999న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
సుమారు రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సర్ఫరోష్ మూవీ రూ. 33.46 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. దాంతో ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు దక్కింది. ఇందులో అమీర్ ఖాన్ ఏసీపీగా నటించారు. మూవీలో క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఏసీపీ ఎలా ఎదుర్కొంటాడు? ఈ క్రమంలో ఆయన ఫ్యామిలీకి జరిగిన నష్టమేంటీ..? ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటీ? అనే అంశాలతో తెరెక్కింది. సర్ఫరోష్ అంటే ఒక కారణం కోసం ప్రాణత్యాగం చేసేవాడు అనే అర్థం వస్తుంది.
ఇండియాలో చాలా ఫేమస్ అయి, ఎంతోమంది భక్తులు విశ్వాసంగా కొలిచే బాబా ముసుగులో ఉన్న వ్యక్తి ఇండియాలోకి దొంగతనంగా ఆయుధాలు తీసుకురావడం, ఆ దొంగబాబాను ఏసీపీ ఎదుర్కోవడం కాన్సెప్ట్ అప్పట్లో చాలా యూనిక్‌గా ఉండి హిట్ కొట్టింది. 1992 నుంచి ఏడేళ్లు రీసెర్చ్ చేసిన తర్వాత సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ జాన్ మాథ్యూ. ఇందులో ఇండియాలో పోలీస్ అధికారులైనప్పటికీ ముస్లింల పట్ల చూపించే వివక్షతను, అప్పటి పరిస్థితులను చాలా రియలిస్ట్‌గా చూపించారు.
అందుకే ఈ సర్ఫరోష్ సినిమాను పాకిస్తాన్ ఆడియెన్స్ ఇష్టపడిటినట్లు తెలుస్తోంది. అక్రమ ఆయుధాల సరఫరాపై తెరకెక్కించినప్పటికీ హ్యూమానిటీ ఎక్కువగా చూపించే ఈ సినిమా పాకిస్తాన్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఇటీవల ఏప్రిల్ 30న ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఇందులో అమీర్ ఖాన్, ముఖేష్ రిషి, నసీర్ షా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే జతిన్-లలిత్ సంగీతం, సంజయ్ చౌదరి బీజీఎమ్ కూడా హైలెట్ అయింది.
అలాంటి అంత గొప్ప సినిమాను తెలుగులో మంచు విష్ణు (Vishnu Manchu) అస్త్రం (Astram Movie) పేరుతో రీమేక్ చేశారు. ఇందులో ఏసీపీ పాత్రలో మంచు విష్ణు చేయగా హీరోయిన్‌గా అనుష్క శెట్టి (Anushka Shetty) నటించింది. 2006 జూన్ 30న విడుదలైన అస్త్రం సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. అయితే ఆ సమయంలో సినిమా కథ బాగున్నప్పటికీ టేకింగ్ పరంగా విమర్శలు ఎదుర్కొంది అస్త్రం మూవీ. ఫలితంగా తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది.
ఒక మంచి సినిమాను చెడగొట్టారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. ఐఎమ్‌డీబీ పదికి 4.5 రేటింగ్ ఇవ్వడంతోనే సినిమా ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. ఇదే కాకుండా 8.1 రేటింగ్ ఉన్న సర్ఫరోష్ మూవీని కన్నడలో కూడా రీమేక్ చేశారు. సత్యమేవ జయతే పేరుతో తెరకెక్కిన ఈ మూవీలో నటుడు దేవరాజ్ హీరోగా చేశారు.