Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలను రీమేక్ చేసిన స్టార్ హీరోలు.. నాగార్జునవే ఎక్కువ!
Malayalam Remake Movies In Telugu: మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలను ఎన్నో ఏళ్లుగా రీమేక్ చేస్తూ వస్తున్నారు తెలుగు హీరోలు. మరి వారు ఎవరో చూద్దాం.
Mohanlal Remake Movies: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక మోహన్ లాల్ నటించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ కాగా.. వాటిని తెలుగులో రీమేక్ చేశాడు. ఇక తెలుగులో అవి ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. అయితే, మోహన్ లాల్ సినిమాలను ఎన్నో ఏళ్లుగా రీమేక్ చేస్తూ వస్తున్నారు తెలుగు హీరోలు. మరి వారు ఎవరో ఓ లుక్కేద్దాం.
బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమాల్లో అశోక చక్రవర్తి ఒకటి. ఈ సినిమా 1989లో విడుదలైంది. ఎస్ఎస్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్‌గా చేయగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా మోహన్ లాల్ నటించిన ఆర్యన్ అనే మూవీకి రీమేక్. ఆర్యన్ అనే మలయాళ సినిమా 1988లో వచ్చింది.
మోహన్ బాబు
కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు సినీ కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిన సినిమా అల్లుడుగారు. 1990 సంవత్సంలో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా సినిమాలో పాటలు ఎంతోమందిని మెప్పించాయి. అలాంటి ఈ సినిమా మోహన్ లాల్ 1988లో నటించిన చిత్రం అనే సినిమాకు రీమేక్.
నాగార్జున
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లో నిర్ణయం ఒకటి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. నాగార్జున భార్య అమలతో జోడీ కట్టిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాని పాటలు చాట్ బస్టర్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నటుడు మురళి మోహన్ నిర్మించారు. ఈ నిర్ణయం సినిమా మోహన్ లాల్ వందనం మూవీకి రీమేక్‌గా వచ్చింది.
వజ్రం-చంద్రలేఖ
నిర్ణయం మాత్రమే కాకుండా నాగార్జున రీమేక్ చేసిన మోహన్ లాల్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో 1995లో వచ్చిన వజ్రం, 1998 సంవత్సరంలో వచ్చిన చంద్రలేఖ ఉన్నాయి. అయితే వీటిలో వజ్రం సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా మిగలగా చంద్రలేఖ పర్వాలేదనిపించింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చంద్రలేఖ బుల్లితెరపై మాత్రం మంచి హిట్ సాధించిందనే చెప్పాలి. 1997లో మోహన్ లాల్ నటించిన చంద్రలేఖను అదే టైటిల్‌తో రీమేక్ చేయగా.. 1995లోని స్పదికంను వజ్రంగా రీమేక్ చేశారు.
నాగార్జునవే ఎక్కువ
ఇవే కాకుండా నాగార్జున, మోహన్ బాబు కలిసి నటించిన సినిమా అధిపతి. 2001 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో మోహన్ బాబు, నాగార్జున్ మల్టీ స్టారర్ చేశారు. అయితే ఈ సినిమా కూడా మోహన్ లాల్ నటించిన నరసింహం సినిమాకు రీమేక్. మోహన్ లాల్ నరసింహం మూవీ 2000 సంవత్సరంలో రిలీజైంది. ఇలా అందరికంటే ఎక్కువగా మోహన్ లాల్ సినిమాలను నాగార్జునే ఎక్కువగా రీమేక్ చేసినట్లుగా తెలుస్తోంది.
రీమేక్ చేసిన ఇతర హీరోలు
ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ కూడా మోహన్ లాల్ లూసీఫర్‌కు రీమేక్ అని తెలిసిందే. వీరే కాకుండా మోహన్ లాల్ సినిమాలను నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, జగపతి బాబు సైతం రీమేక్ చేశారు. వీరిలో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ముత్తు సినిమా మోహన్ లాల్ నటించిన తెన్మవిన్‌కు రీమేక్.
టాపిక్