తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sardar Movie Review In Telugu: సర్దార్ మెప్పించిందా? కార్తి కనికట్టు పనిచేసిందా?

Sardar Movie Review in Telugu: సర్దార్ మెప్పించిందా? కార్తి కనికట్టు పనిచేసిందా?

22 October 2022, 16:11 IST

google News
    • Sardar Review: కార్తి హీరోగా.. రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అక్టోబరు 21న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
సర్దార్ రివ్యూ
సర్దార్ రివ్యూ

సర్దార్ రివ్యూ

Sardar Review: కోలీవుడ్ స్టార్ సూర్యకు తమ్ముడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన కార్తి.. అతి తక్కువ కాలంలోనే ఆ ముద్రను చెరిపేసుకుని తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే విరుమాన్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో మెరిసిన కార్తి.. మరోసారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను పలకరించాడు. అదే సర్దార్. విశాల్‌తో అభిమన్యుడు లాంటి వినూత్న సినిమాను తీసిన పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారుడు. రైటర్ కమ్ డైరెక్టర్‌గా సామాజిక స్పృహతో పాటు కమర్షియల్ హంగులను మేళవిస్తూ మిత్రన్ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. మరి స్పై థ్రిల్లర్ జోనర్‌లో అతడు తెరకెక్కించిన సర్దార్ చిత్రం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ..

పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయిన విజయ్ ప్రకాష్(కార్తి) ఓ అనాథ. చిన్నప్పుడే తండ్రిపై దేశద్రోహి ముద్ర పడటంతో అతడి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. అతడొక్కడే మిగులుతాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్ అతడిని చేరదీసి పెద్దవాడిని చేస్తాడు. ఎస్ఐగా విజయ్ ప్రకాష్ మంచి పేరు సంపాదించిన.. దేశద్రోహి ముద్ర మాత్రం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. ఇదే సమయంలో వన్ ఇండియా వన్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన మంగ (లైలా) అనే మహిళ కేసును విచారించడం మొదలుపెడతాడు. అయితే ఆమెది హత్య కాదని, ఎవరో చంపేశారని దీని వెనక ఏదో పెద్ద కుట్రదాగుందని గుర్తిస్తాడు. మంగ ఓ సీక్రెట్ నెట్వర్క్‌తో పనిచేస్తుందని, వీరంతా సర్దార్ అనే వ్యక్తి కోసం వెతుకుతున్నారని తెలుసుకుంటాడు. మరి ఈ సర్దార్ ఎవరు? మంగను చంపేసింది ఎవరు? వన్ పైప్ లైన్ ప్రాజెక్టును వెనుకున్న కథేంటి లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

దర్శకుడు పీఎస్ మిత్రన్ అభిమన్యుడు సినిమాతో టెక్నాలజీతో ఎంత మోసపోతున్నామనే విషయంతో పాటు వ్యక్తిగత సమాచారం ఎలా దొంగిలిస్తున్నారనే అంశాన్ని ఉత్కంఠభరితంగా తెరకెక్కించి మంచి మార్కులు వేయించుకున్నాడు. సామాజిక స్పృహతో పాటు కమర్షియల్ హంగులను కూడా జోడిస్తూ సక్సెస్ అయ్యాడు. తాజాగా మరోసారి సర్దార్ చిత్రంలోనూ ఇదే విధంగా ఆకట్టుకున్నాడు. కార్తి లాంటి మంచి నటుడు దొరకడంతో మిత్రన్ ఈ సారి అద్భుతమైన సినిమాను తెరకెక్కించాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆద్యంతం ఆసక్తి రేకెత్తించేలా స్క్రీన్ ప్లే‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

మొదట్లో కాస్త తమిళ సినిమాల్లో కనిపించే కాస్త మాస్ మసాలా అతి కనిపించినప్పటికీ.. విలన్ ఎంట్రీతో ప్రేక్షకులు కథలో లీనమైపోతారుడు. నీటి వనరులన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోడానికి చేసే ప్రయత్నం, వాటర్ బాటిళ్ల వల్ల తలెత్తే దుష్ప్రభావాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. కథ పరంగా ఎంతో పరిశోధించాడని సినిమా చూస్తేనే అర్థమవుతుంది. వాటర్ మాఫియా గురించి చెప్పడం, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల దుష్ప్రభావం ఇదంతా చూస్తుంటే ఏదో సామాజిక చైతన్యాన్ని కలిగించే సినిమా అనుకుంటే పొరపాటే.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠను రేకెత్తించే స్క్రీన్‌ప్లేతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.

ఇంటర్వెల్‌కు ముందు సర్దార్ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కు ఎలివేషన్ అదిరిపోయింది. 50 ఏళ్లకు పైబడిన పాత్రలో కార్తి అదరగొట్టాడు. అయితే ఆ వయస్సులో ఆ ఫైట్లు కొంచెం నమ్మశక్యంగా లేనప్పటికీ.. చూసేటప్పుడు ఆ సందేహం రాకపోవడం దర్శకుడు పాత్రను రాసుకోవడంలో గొప్పతనంగా చెప్పుకోవచ్చు. మాస్ ప్రేక్షకులు మాత్రం సర్దార్ కనిపించే ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తారు. మూడు గంటల సినిమా ఎక్కడా బోర్ కొట్టదంటే అర్థం చేసుకోవచ్చు. నెరేషన్ పరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఫిదా చేయడంలో ఎలాంటి విఫలం కాలేదు.

ఎవరెలా చేశారంటే..

యువకుడు, వృద్ధుడు రెండు పాత్రల్లోనూ కార్తి అదరగొట్టాడు. యువకుడిగా తనదైన కామెడీ టైమింగ్, రొమాన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో కార్తి ఆకట్టుకున్నాడు. అయితే సర్దార్ ముసలి పాత్రలో కార్తి అద్బుతమే చేశాడు. తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్‌లో యువకుడి పాత్ర నుంచి సీక్రెట్ మిషన్లు, వ్యక్తిగత జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేసే సీక్రెట్ స్పై పాత్రలో కార్తి ఆకట్టుకున్నాడు. ఎంతలా అంటే.. ద్వితీయార్థంలో యంగ్ కార్తిని ప్రేక్షకులు మర్చిపోయేంతగా సర్దార్ క్యారెక్టర్‌లో లీనమయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్దార్ కార్తి వన్ మ్యాన్ షో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విలన్ పాత్రలో నటించిన చుంకీ పాండే పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్లలో రజీషా విజయన్ స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నప్పటికీ.. ఆమె గుర్తుండిపోయే పాత్రలో నటించింది. రాశీ ఖన్నా ఫర్వాలేదనిపించింది. లైలా కుమారుడిగా నటించిన చిన్న పిల్లాడు ప్రత్యేకంగా గుర్తుండిపోతాడు. లైలాకు చాన్నాళ్ల తర్వాత మంచి పాత్ర దొరికింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో మెప్పిస్తుంది.

సాంకేతిక వర్గం..

ఈ సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో జీవీ ప్రకాష్ అదరగొట్టాడు. కొన్ని సన్నివేశాల్లో అతడి ఆర్ఆర్.. ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెడుతుంది. సర్దార్‌కు ఇచ్చే ఎలివేషన్ సన్నివేశాల్లో జీవీ తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. ఈ కథకు అతడి సంగీతం అదనపు బలం చేకూర్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నికల్‌గా ఈ సినిమాను ఉన్నత విలువలతో తీశారు నిర్మాతలు. ఖర్చు విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. సినిమాటోగ్రాఫర్‌గా జార్జ్ సీ విలియమ్స్ పనితనం బాగుంది. ఇక దర్శకుడు పీఎస్ మిత్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు ఈ సినిమా కథను ఏదో ఆషామాషీగా రాసుకోలేదని తెలుస్తోంది. అంతర్జాతీయ అంశాలను ముడిపెడుతూ ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేసేందుకు అతడు బాగానే రీసెర్చ్ చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. మరోపక్క సామాజిక స్పృహతో పాటు వాణిజ్యపరమైన హంగులను కూడా స్క్రీన్ ప్లేలో జోడించడంలో అతడు పూర్తిగా సఫలీకృతుడయ్యాడు.

చివరగా- సర్దార్.. అదిరిపోయే స్పై థ్రిల్లర్.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది

రేటింగ్- 3.75/5

గమనిక: ఈ సమీక్ష పూర్తిగా సమీక్షకుడి దృక్కోణానికి సంబంధించింది. సర్దార్.. అదిరిపోయే స్పై థ్రిల్లర్.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది

రేటింగ్- 3.75/5

గమనిక: ఈ సమీక్ష పూర్తిగా సమీక్షకుడి దృక్కోణానికి సంబంధించింది.

తదుపరి వ్యాసం