Kantara Telugu Collections: తెలుగులో కాంతారా కొత్త రికార్డ్ - కేజీఎఫ్ 2 తర్వాత రెండో సినిమా ఇదే
22 October 2022, 13:56 IST
Kantara Telugu Collections: రిషబ్ శెట్టి (Rishab shetty)హీరోగా నటించిన కాంతారా సినిమా తెలుగులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా తెలుగులో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్‌ను నెలకొల్పింది. ఆ రికార్డ్ ఏదంటే...
కాంతారా
Kantara Telugu Collections: రిషబ్ శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రం కాంతారా తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తొలి వారంలోనే ఈ సినిమా దాదాపు ముప్పై కోట్ల గ్రాస్‌ను రాబట్టి నిర్మాతలకు భారీగా లాభాలను మిగిల్చింది. ఈ సినిమా విడుదలై వారం దాటినా వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. తెలుగులో కలెక్షన్స్ పరంగా కాంతారా కొత్త రికార్డ్ నెలకొల్పింది.
వరుసగా వారం రోజుల పాటు కోటి రూపాయల షేర్‌ను రాబట్టిన రెండో డబ్బింగ్ సినిమాగా నిలిచింది. ఆ జాబితాలో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 మొదటి స్థానంలో ఉంది. కేజీఎఫ్ 2 (KGF 2) దాదాపు పన్నెండు రోజుల పాటు తెలుగులో కోటి రూపాయల షేర్‌ను రాబట్టింది.
ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో కాంతారా నిలిచింది. ఈ ఘనతను సాధించిన రెండు సినిమాలు కన్నడ డబ్బింగ్‌వే కావడం గమనార్హం. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కాంతారా సినిమాను తెరకెక్కించాడు.
ఇందులో శివ అనే యువకుడిగా రిషబ్ శెట్టి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 200 కోట్లకు చేరువలో ఉంది. ఈ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
కర్ణాటక కరావళి ప్రాంతంలోని ప్రాచీన కళ భూతకోల గురించి ఈ సినిమాలో చూపించిన విధానం బాగుందని ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించాడు. సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.