Telugu Web Series: రొమాన్స్ నుంచి కామెడీ వరకు - తెలుగులో రాబోతున్న వెబ్‌సిరీస్‌లు ఇవే - లీడ్ రోల్స్‌లోస్టార్స్!
23 December 2024, 15:00 IST
Telugu Web Series: ఈ ఏడాది తెలుగులో వచ్చిన హరికథ, బహిష్కరణతో పాలు పలు వెబ్‌సిరీస్‌లు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాయి. వచ్చే ఏడాది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. స్టార్స్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లు ఏవంటే?
తెలుగు వెబ్‌సిరీస్
Telugu Web Series: ప్రస్తుతం సినిమాలతో సమానంగా వెబ్‌సిరీస్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. టేకింగ్ మేకింగ్‌తో పాటు కాన్సెప్ట్‌ల పరంగా మూవీస్‌కు ధీటుగా సిరీస్‌లు తెరకెక్కుతోన్నాయి. వెబ్‌సిరీస్‌లకు నానాటికి క్రేజ్ పెరుగుతుండటంతో వీటిలో నటించడానికి స్టార్స్ సైతం ఆసక్తిని చూపుతోన్నారు.
తెలుగులో ట్రెండ్...
ఇదివరకటితో పోలిస్తే తెలుగులో వెబ్‌సిరీస్ ట్రెండ్ పెరిగింది. అగ్ర దర్శకులు, నిర్మాణ సంస్థలతో స్టార్స్ సైతం వెబ్‌సిరీస్‌లలో భాగం అవుతూ టాలీవుడ్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తోన్నారు. తెలుగులో ఈ ఏడాది వచ్చిన బృందా, పరువు, వికటకవి, బహిష్కరణ, హరికథతో పాటు పలు వెబ్‌సిరీస్‌లు చక్కటి ఆదరణను దక్కించుకున్నాయి. వచ్చే ఏడాది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన కొన్ని వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.
ఉప్పుకప్పురంబు
కీర్తి సురేష్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఫస్ట్ టైమ్ తెలుగులో ఉప్పుకప్పురంబు పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సిరీస్ షూటింగ్ తుది దశకు చేరకున్నట్లు తెలిసింది.
రాజ్ తరుణ్ చిరంజీవ
ఓ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌తో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రాజ్ తరుణ్. చిరంజీవ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌తో జబర్ధస్థ్ కమెడియన్ అదిరే అభి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. జనవరిలో ఆహా ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఎయిర్...
కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఎయిర్ వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఐఐటీ సీట్ కోసం విద్యార్థులపై ఉండే ఒత్తిడి, వారు ఎదుర్కొనే సంఘర్షణను వినోదాత్మక కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ వెబ్‌సిరీస్‌కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. జనవరిలో ఎయిర్ సిరీస్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రానా నాయుడు సీజన్ 2...
వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. వచ్చే ఏడాది వేసవి తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బోల్డ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించి షూటింగ్ పూర్తయినట్లు తెలిసింది. రానా నాయుడుతో పాటు ఆహా ఓటీటీలో రిలీజైన రొమాంటిక్ సిరీస్ త్రీ రోజెస్ సెకండ్ సీజన్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ తెలుగుసిరీస్‌లో పాయల్ రాజ్‌పుత్, ఈషారెబ్బా, పూర్ణ కీలక పాత్రల్లో కనిపించారు.
డీజే టిల్లు స్క్వేర్...
సందీప్ కిషన్ తెలుగులో బోల్డ్ కాన్సెప్ట్‌తో ఓ వెబ్‌సిరీస్ చేస్తోన్నాడు. ఈ సిరీస్‌కు డీజే టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్‌రామ్ దర్శకత్వం వహించనున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుదలకానుంది.