Bhoothakaalam Review: భూతకాలం రివ్యూ - వణుకుపుట్టించే మలయాళం హారర్ మూవీ ఎలా ఉందంటే?
30 March 2024, 10:07 IST
Bhoothakaalam Review: రేవతి షేన్ నిగమ్ ముఖ్య పాత్రల్లో నటించిన హారర్ మూవీ భూతకాలం మలయాళంలో పలు అవార్డులను అందుకున్నది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
భూతకాలం మూవీ రివ్యూ
Bhoothakaalam Review: రేవతి, షేన్ నిగమ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం హారర్ మూవీ భూతకాలం సోనీ లివ్ ఓటీటీలో (Sony liv OTT) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ (Horror) మూవీకి భ్రమయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్న ఈ హారర్ మూవీ ఎలా ఉందంటే?
తల్లీకొడుకుల కథ...
ఆశ (రేవతి) ఓ కిండర్‌గార్డెన్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. భర్త చనిపోవడంతో కొడుకు వినును (షేన్ నిగమ్) కష్టపడి పెంచి పెద్దచేస్తుంది. విను ఎంబీబీఎస్ చదవాలని కలలు కంటాడు. కానీ తల్లి ఆశ బలవంతంగా అతడిని బీఫార్మసీలో చేర్పిస్తుంది. చదువు పూర్తిచేసిన విను రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా కూడా రాదు. సొంత ఊరును వదిలిపెట్టి మరో చోటకు జాబ్‌కు వెళ్లాలని విను అనుకుంటాడు.
కానీ ఆశ అందుకు ఒప్పుకోదు. విను అమ్మమ్మ చనిపోతుంది. ఆమె చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వింత శబ్దాలు, ఆకారాలు విను కంటపడుతుంది. తొలుత విను మాటలను ఆశతో పాటు అతడి బంధువులు నమ్మరు. వంశపారంపర్యంగా విను ఫ్యామిలీని మానసిక సమస్యలు వెంటాడుతుంటాయి. విను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని జార్జ్ అనే డాక్టర్‌తో వినుకు కౌన్సిలింగ్ ఇప్పిస్తుంది ఆశా. వినుతో పాటు ఆశ కూడా ఇంట్లో ఏదో అదృశ్య శక్తి ఉందనే నిజం తెలుస్తుంది.
ఆశ, వినులను భయపెడుతున్న ఆ అదృశ్య శక్తి ఎమిటి? విను, ఆశ కంటే ముందు ఆ ఇంట్లో ఉన్నవాళ్లందరి జీవితాలు ఎలా విషాదాంతంగా ముగిసాయి? ఆ వింత శబ్దాల వల్ల విను ఏ విధంగా డిస్ట్రబ్ అయ్యాడు? విను, ఆశ మధ్య గొడవలకు కారణం ఏమిటి? వారు ఎలా ఒక్కటయ్యారు? ఆ ఇంటి నుంచి విను... ఆశ ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నదే భూతకాలం మూవీ(Bhoothakaalam Review) కథ.
పడికట్టు సూత్రాలకు భిన్నంగా...
హారర్ సినిమాల్లో అనగానే వింత వింత మేకప్‌లతో దయ్యాలు హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రధారులను భయపెట్టడం కామన్‌గా కనిపిస్తుంది. చాలా వరకు హారర్ సినిమాలు పాడబడ్డ బంగళాలు, పెద్ద పెద్ద భవంతుల బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతుంటాయి.
అలాంటి పడికట్టు సూత్రాలను పూర్తి భిన్నంగా భూతకాలం(Bhoothakaalam Review) మూవీ సాగుతుంది. మూడు గదులు ఉన్న సాదాసీదా ఇంట్లో... దయ్యాలను చూపించకుండా కేవలం సౌండ్, విజువల్స్‌తోనే డైరెక్టర్ రాహుల్ సదాశివన్ భూతకాలం సినిమాతో భయపెట్టాడు.
హాలీవుడ్ లెవల్‌లో...
భూతకాలంలో సౌండ్ డిజైనింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. . ట్యాప్ నుంచి పడే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్, హీరో తింటున్నప్పుడు వచ్చే సౌండ్, , వర్షం పడినప్పుడు వచ్చే శబ్ధాలను చాలా నాచురల్‌గా చూపించారు. రెగ్యులర్ హారర్ సినిమాల్లో మాదిరిగా కాకుండా భూతకాలం సినిమాలోని సౌండ్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంది.
రెండు పాత్రల నేపథ్యంలోనే...
తల్లీకొడుకుల ఎమోషన్‌ను చక్కగా చూపించాడు డైరెక్టర్. తన కొడుకును సమస్యల వలయం నుంచి బయటపడేయటానికి తల్లి పడే ఆరాటం, తనకు నచ్చినట్లుగా జీవితాన్ని గడపలేక, ఇంట్లోని ఆత్మల కారణంగా మెంటల్‌గా డిస్ట్రబ్ అయిన ఓ యువకుడి సంఘర్షణను నాచురల్‌గా చూపించారు.
గంట నలభై మూడు నిమిషాల నిడివితో కూడిన ఈ సినిమా చాలా వరకు రేవతి, షేన్ నిగమ్ క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుంది. క్లైమాక్స్ సీన్‌లోని హారర్ సన్నివేశాల్లో దర్శకుడి టాలెంట్ అబ్బురపరుస్తుంది. ఆ సీన్స్ ఆడియెన్స్‌ను వణికిస్తాయి.
లవ్ స్టోరీ అతకలేదు...
ఈ హారర్ సినిమాలో లవ్‌స్టోరీ బలవంతంగా ఇరికిపించిన ఫీలింగ్ కలుగుతుంది. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, మాంటేజ్ సాంగ్ నిడివి పెంచడానికే ఉపయోగపడ్డాయి. ఫస్ట్ హాఫ్ ఎంతకు ముందుకు కదలక ఒకే సీన్ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. అక్కడి నుంచే కథ పరుగులు పెడుతుంది. క్లైమాక్స్‌లో హారర్ సీన్స్ బాగున్నా కథను ముగించిన తీరు అంతగా కన్వీన్సింగ్‌గా అనిపించదు.
రేవతి, షేన్ నిగమ్ పోటాపోటీగా...
ఈ సినిమాలో రేవతి, షేన్ నిగమ్ నటన అన్న అనుభూతి ఎక్కడ కలగదు. నిజమైన తల్లీకొడుకుల్లానే కనిపించారు. మానసిక సమస్యలతో బాధపడే తల్లి పాత్రలో రేవతి నటన ఒక్క వంక కూడా పెట్టలేము. ఎమోషనల్ సీన్స్‌లో జీవించేసింది. విను పాత్రకు షేన్ నిగమ్ పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్‌గా అథిరా పటేల్ ఓ పాట కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితమైంది.
టెక్నికల్‌గా బ్రిలియెంట్ మూవీ...
భూతకాలం వణుకుపుట్టించే వైవిధ్యమైన హారర్ మూవీ. టెక్నికల్‌గా చాలా బ్రిలియెంట్ మూవీగా భూతకాలం నిలుస్తుంది. రేవతి, షేన్ నిగమ్ యాక్టింగ్ కోసం మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.