Bahishkarana Web Series: తెలుగులో అంజలి రివేంజ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - బహిష్కరణ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
16 June 2024, 13:47 IST
Bahishkarana Web Series: అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న బహిష్కరణ వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. త్వరలో జీ5 ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
బహిష్కరణ వెబ్‌సిరీస్
Bahishkarana Web Series: ఇటీవలే రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో వేశ్యగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించింది అంజలి. సినిమా ఫ్లాపైనా అంజలి తన యాక్టింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మరోసారి మాస్ రోల్‌లో అభిమానులకు దర్శనమిచ్చేందుకు రెడీ అవుతోంది అంజలి. అయితే సినిమాలో కాదు వెబ్‌సిరీస్‌లో...అంజలి ప్రధాన పాత్రలో బహిష్కరణ పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.
అంజలి బర్త్‌డే...
అంజలి పుట్టినరోజు సందర్భంగా బహిష్కరణ సిరీస్ నుంచి అంజలి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కొడవలి పట్టుకొని రౌద్రంగా అంజలి కనిపిస్తోంది. ఆమె పక్కనే ఛైర్ మంటల్లో తగలపడిపోతున్నట్లుగా మోషన్ పోస్టర్‌లో చూపించారు. బహిష్కరణ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్ రోల్...
బహిష్కరణ వెబ్‌సిరీస్‌లో అంజలి పుష్ప అనే పల్లెటూరి మహిళగా కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో అంజలి లుక్, యాక్టింగ్ గత సినిమాలు, సిరీస్‌లకు పూర్తి భిన్నంగా ఉంటాయని అంటోన్నారు.
బహిష్కరణ వెబ్‌సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహిస్తోన్నాడు. ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో అంజలితో పాటు అనన్య నాగళ్ల,రవీంద్రవిజయ్,శ్రీతేజ్ కీలక పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం.సర్పంచ్‌తో పాటు అతడి అనుచరుల కారణంగా ఓ మహిళ ఎలాంటి అవమానాల్ని ఎదుర్కొన్నది? వారిపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే పాయింట్ తో బహిష్కరణ వెబ్‌సిరీస్ ను తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
జీ5 ఓటీటీలో...
బహిష్కరణ వెబ్‌సిరీస్ జీ5 ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కాబోతున్నట్లు జీ5 ప్రకటించింది. స్ట్రీమింగ్ డేట్‌ను ఈ నెలలోనే రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో కలిపి అంజలి చేస్తోన్న నాలుగో వెబ్‌సిరీస్ ఇది. గతంలో తెలుగులో ఝాన్సీ అనే సిరీస్ చేసింది అంజలి. ఝాన్సీ వెబ్‌సిరీస్ ఫస్ట్ సీజన్ 2022లో, సెకండ్ సీజన్ 2023లో రిలీజైంది. తమిళంలో నవరస, ఫాల్ వెబ్‌సిరీస్‌లు చేసింది అంజలి.
ఫొటోతో ఎంట్రీ...
ఫొటో మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో చాలానే సినిమాలు చేసిన బలుపు, గీతాంజలి మినహా పెద్దగా సక్సెస్‌లు మాత్రం అంజలికి దక్కలేదు.
సరైనోడు, మాచర్ల నియోజకవర్గంతో పాటు మరికొన్ని సినిమాల్లో స్పెషల్స్ సాంగ్స్ చేసింది. పవన్‌కళ్యాణ్ వకీల్‌సాబ్‌లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం రామ్‌చరణ్-శంకర్ కలయికలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది అంజలి. లాంగ్ గ్యాప్ తర్వాత గీతాంజలి మళ్లీ వచ్చిందితో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. గీతాంజలి మూవీకి సీక్వెల్‌గా హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది.
నాచురల్ పర్ఫార్మర్...
తెలుగులో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసిన అంజలి తమిళంతో మాత్రం నాచురల్ ఫర్ఫార్మర్‌గా పేరుతెచ్చుకున్నది. అంగడితెరు, ఎంగేయుమ్ ఎప్పుథుమ్ (తెలుగులో జర్నీ), కలకలప్పుతో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన అంజలి కమర్షియల్ హిట్స్ దక్కించుకున్నది.