Geethanjali Malli Vachindi Review: గీతాంజలి మళ్లీ వచ్చింది రివ్యూ - అంజలి హారర్ మూవీ భయపెట్టిందా? లేదా?
Geethanjali Malli Vachindi Review: అంజలి, సునీల్, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ గురువారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Geethanjali Malli Vachindi Review: అంజలి హీరోయిన్‌గా నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. 2014లో వచ్చిన గీతాంజలి మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీనివాసరెడ్డి, సత్య, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సీక్వెల్ మూవీ ఎలా ఉంది? గీతాంజలి తరహాలోనే నవ్విస్తూ భయపెట్టిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
సంగీత్ మహల్ కథ...
శ్రీను (శ్రీనివాసరెడ్డి) వన్ ఫిల్మ్ వండర్ డైరెక్టర్‌గా మిగిలిపోతాడు. శ్రీను సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అతడి పేరు వింటేనే హీరోలు, నిర్మాతలు భయపడిపోతారు. సినిమా ఆశలు వదలుకొని హైదరాబాద్ నుంచి మకాం ఎత్తేయాలని ఫిక్సవుతాడు శ్రీను. అదే టైమ్‌లో ఊటీలోని విష్ణు రిసార్ట్స్ ఓనర్ విష్ణు (రాహుల్ మాధవ్) నుంచి శ్రీనుకు ఓ సినిమా ఆఫర్ వస్తుంది. విష్ణుకు ఓ సినిమా చేసి పెట్టాలని అతడి మేనేజర్ శ్రీనుకు చెబుతాడు.
ఆ మూవీకి విష్ణునే కథను అందిస్తాడు. అంతే కాకుండా ఊటీలోనే కాఫీషాప్ నడిపే అంజలిని (అంజలి) ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి ఒప్పించాలని, , ఆ మూవీ షూటింగ్ కూడా ఊటీలో ఉన్న సంగీత్ మహాల్‌లో జరగాలని విష్ణు కండీషన్స్ పెడతాడు. రాకరాక వచ్చిన సినిమా అవకాశం పోగోట్టుకోవడం ఇష్టం లేక విష్ణు కండీషన్స్ కు శ్రీను ఓకే చెబుతాడు.
అంజలిని ఒప్పించి సినిమా తీసేందుకు తన రైటర్స్ ఆరుద్ర (షకలక శంకర్) ఆత్రేయ(సత్యంరాజేష్)తో పాటు హీరో కావాలని కలలు కనే అయాన్(సత్య) , సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నాని(సునీల్)లతో కలిసి సంగీత్ మహల్‌లో అడుగుపెడతాడు శ్రీను. ఆ సంగీత్ మహల్‌లో ఆత్మలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం నిజమేనా? ఆత్మలుగా మారి ఆ సంగీత్‌మహల్‌లో ఉన్న శాస్త్రి (రవిశంకర్), ఆయన భార్య కథేమిటి? ఆత్మలు ఉన్నాయనే నిజం తెలిసి కూడా శ్రీను అండ్ టీమ్ షూటింగ్‌ను కొనసాగిస్తూ సినిమాను పూర్తిచేశారా?
ఆ సినిమాలో అంజలి హీరోయిన్‌గా నటించాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? సినిమా చేసే అవకాశం శ్రీనుకే అతడు ఎందుకు ఇచ్చాడు? గీతాంజలి చేతిలో కన్నుమూసిన రమేష్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని విష్ణు వేసిన ప్లాన్ ఏమిటి? రమేష్‌కు విష్ణుకు ఎలాంటి సంబంధం ఉంది? అన్నదే గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ కథ.
పదేళ్ల తర్వాత సీక్వెల్...
టాలీవుడ్‌లో హారర్ కామెడీ సినిమాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సినిమాల్లో గీతాంజలి ఒకటి. అంజలి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో 2014లో వచ్చిన గీతాంజలి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను రూపొందించారు కోన వెంకట్ అండ్ టీమ్. గీతాంజలి మూవీ భయపెడుతూనే ప్రేక్షకుల్ని నవ్వించింది. అదే ఫార్ములాను సీక్వెల్‌లో ఫాలో అవుతూ కథను రాసుకున్నారు.
నవ్వించడమే ధ్యేయం…
దయ్యాలు ఉన్న పాడుబడ్డ బంగళాలోకి షూటింగ్ కోసం ఓ మూవీ టీమ్ రావడం, ఆ ఆత్మల కారణంగా వారు ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి కావాల్సినంత కామెడీని రాబట్టుకుంటూ ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను తెరకెక్కించారు దర్శకరచయితలు. కామెడీకి హారర్ ఎలిమెంట్‌తో కూడిన రివేంజ్ డ్రామా అల్లుకున్నారు. గీతాంజలిలో హారర్, కామెడీ సమపాళ్లలో కుదరడంతో సినిమా పాసయ్యింది. కానీ సీక్వెల్‌లో మాత్రం హారర్‌ను కామెడీ డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సంగీత్ మహల్ కథ...
ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీనుతో పాటు రైటర్స్ ఆరుద్ర, ఆత్రేయ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే సీన్స్‌తో నడిపించారు డైరెక్టర్. తమ అవసరాల కోసం హీరోను చేస్తామని చెప్పి అయాన్‌ను మోసం చేస్తూ పబ్బం గడుపుకునే సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. శ్రీనుకు విష్ణుకు డైరెక్షన్ ఆఫర్ ఇవ్వడం నుంచే కథ ఆసక్తికరంగా మారుతుంది.
షూటింగ్ కోసం సంగీత్‌మహల్‌లో శ్రీను అండ్ గ్యాంగ్ అడుగుపెట్టినప్పటి నుంచి కామెడీ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యింది. అయాన్ క్యారెక్టర్‌లో సత్య తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సునీల్, సత్య కాంబోలో వచ్చిన సీన్స్ సినిమాకు బిగ్గెస్ట్ రిలీఫ్‌గా నిలిచాయి.
ఫస్ట్ పార్ట్‌లోని గీతాంజలి, రమేష్ ఆత్మలను తెరపైకి తీసుకొచ్చి దయ్యాలు వర్సెస్ దయ్యాలు గొడవతో చివరలో భయపెట్టేందుకు దర్శకుడు ప్రయత్నించారు. ఆ సీన్స్‌లోని ఎమోషన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు.
సీక్వెల్ కోసం దర్శకరచయితలు ఎంచుకున్న పాయింట్‌లో కొత్తదనం లేదు. హారర్ ఎలిమెంట్స్ కోసం గతంలో వచ్చిన పాత సినిమాల్ని ఫాలో అయ్యారు. అవేవి పెద్దగా మెప్పించవు.
కిల్లర్ నానిగా సునీల్...
గీతాంజలి తర్వాత హారర్, కామెడీ సినిమాలు చాలానే చేసింది అంజలి. అందుకే గీతాంజలి మళ్లీ వచ్చిందిలో అంజలి పాత్రను ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయింది. కిల్లర్ నానిగా సునీల్, అయాన్‌గా సత్య కామెడీనే సినిమాలో ఎక్కువగా వర్కవుట్ అయ్యింది. వారు కనిపించిన ప్రతి సీన్ నవ్విస్తుంది.సెకండ్ ఇన్నింగ్స్‌లో కమెడియన్‌గా సునీల్ బాగా నవ్వించిన సినిమా ఇదే. శ్రీనివా సరెడ్డి, షకలకశంకర్, సత్యం రాజేష్ అక్కడక్కడ కామెడీని పండించారు.
టైమ్ పాస్ కామెడీ…
లాజిక్‌లను పక్కనపెట్టి చూస్తే గీతాంజలి మళ్లీ వచ్చింది టైమ్‌పాస్ చేస్తుంది. సునీల్, సత్య కామెడీని ఎంజాయ్ చేయచ్చు.
రేటింగ్:2.5/5
టాపిక్