Allu Arjun: నా కొడుకు యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్‌లాంటోడే.. చాలా ప్రేమిస్తాడు.. కానీ తేడా వచ్చిందో: అల్లు అర్జున్
15 November 2024, 16:19 IST
- Allu Arjun: అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ను యానిమల్ మూవీ రణ్‌బీర్ కపూర్ తో పోల్చడం విశేషం. తనను చాలా ప్రేమిస్తాడని, అయితే ఏమాత్రం తేడా వచ్చినా ఇక ఊరుకోడంటూ బన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నా కొడుకు యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్‌లాంటోడే.. చాలా ప్రేమిస్తాడు.. కానీ తేడా వచ్చిందో: అల్లు అర్జున్
Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యే బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేకు వచ్చాడు ఈ ఎపిసోడ్ అంతా ఎంతో సరదాగా సాగిపోయింది. అయితే ఇందులో తన కొడుకు గురించి బన్నీ చేసిన కామెంట్స్ మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. తన కొడుకు అయాన్ ను అతడు యానిమల్ మూవీలోని రణ్‌బీర్ కపూర్ పాత్రతో పోల్చడం విశేషం.
అయాన్ యానిమల్‌లో రణ్‌బీర్‌లాంటోడు
బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో నాలుగో సీజన్ నాలుగో ఎపిసోడ్లో అల్లు అర్జున్ స్పెషల్ గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా బాలయ్య తనదైన స్టైల్లో ఎన్నో సరదా ప్రశ్నలు అడిగాడు. వాటికి బన్నీ కూడా అలాగే సమాధానాలు ఇచ్చాడు. వీటిలో ఒక ప్రశ్నకు బదులిస్తూ.. తన కొడును యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ పాత్రతో పోల్చాడు.
పెళ్లికి ముందు ఎవరితో డేటింగ్ చేశావంటూ ఈ షోలో అల్లు అర్జున్ ను బాలయ్య అడిగాడు. దీనికి బన్నీ స్పందిస్తూ.. "ఈ షోని నా పిల్లలు కూడా చూస్తారు. మీ అమ్మను మాత్రమే ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకున్నాను అని నేను నా కొడుకుకు చెప్పాను. అతడు యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ లాంటోడు. తండ్రి కోసం ఏదైనా చేస్తాడు. కానీ తన తల్లి విషయంలో ఏదైనా తప్పు జరిగితే మాత్రం నన్ను కూడా వదిలి పెట్టడు" అని అనడం గమనార్హం.
పెళ్లికి ముందే తన గురించి స్నేహా రెడ్డికి అన్ని విషయాలు చెప్పినట్లు కూడా ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలిపాడు. "ఆమెతో నేను ఏ విషయాన్ని దాచిపెట్టలేదు. గతంలో జరిగిన అన్ని విషయాలకూ పెళ్లి అనేది ఓ రీసెట్ బటన్ లాంటిది. అందువల్ల ఆమెకు అన్నీ తెలుసు" అని తాను డేట్ చేసిన అమ్మాయిల పేర్లు చెప్పకుండా బన్నీ జోక్ చేశాడు.
రణ్‌బీర్ గురించి ఏమన్నాడంటే..
ఈ షోలో బాలకృష్ణ కొందరు ప్రముఖుల ఫొటోలను చూపించి వాళ్లపై అల్లు అర్జున్ అభిప్రాయాలను అడిగాడు. వాళ్లలో చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్లు కూడా ఉన్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఫొటోను కూడా చూపించిన సమయంలో.. "ఈ జనరేషన్ లో బాలీవుడ్ లో అత్యుత్తమ నటుల్లో ఒకడు. అతడు వావ్ అంతే. నా ఫేవరెట్ కూడా. తనంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచోడు" అని బన్నీ అన్నాడు.
మరి ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ చేస్తారా అని అడిగితే.. అది చాలా బాగుంటుందని అల్లు అర్జున్ అన్నాడు. ఒకవేళ మీ ఇద్దరికీ ఎవరూ స్టోరీ ఇవ్వకపోతే నేనే స్టోరీ రాసి అవసరమైతే డైరెక్ట్ చేస్తా అని బాలయ్య జోక్ చేశాడు. అయితే మా నాన్ని ప్రొడ్యూస్ చేస్తాడంటూ బన్నీ అన్నాడు. అల్లు అర్జున్ వచ్చే నెల 5న పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో అల్లు అర్జున్ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
టాపిక్