Sai Pallavi Ramayana: సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ రామాయణ రిలీజ్ డేట్ ఇదే.. రెండు భాగాలుగా.. ఫస్ట్ లుక్ రిలీజ్
Sai Pallavi Ramayana: సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్న రామాయణ మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. అంతేకాదు రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్లను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
Sai Pallavi Ramayana: సాయి పల్లవి సీతగా, రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న మరో భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక మూవీ రామాయణ. నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి బుధవారం (నవంబర్ 6) అధికారిక ప్రకటన వచ్చేసింది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందంటూ వాటి రిలీజ్ డేట్స్ ను కూడా ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా వెల్లడించాడు.
రామాయణ పోస్టర్, రిలీజ్ డేట్
రామాయణం ఇప్పటికే సీరియల్స్ గా, సినిమాలుగా ఎన్నోసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి నితేష్ తివారీ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రామాయణ మూవీ వస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగం 2026లో వచ్చే దీపావళికి, రెండో భాగం 2027లో వచ్చే దీపావళికి రిలీజ్ కానున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.
ఈ సందర్భంగా మూవీ పోస్టర్ కూడా షేర్ చేశాడు. ఇందులో కేవలం ఓ బాణాన్ని మాత్రం ప్రకాశవంతమైన ఆకాశంలోకి సంధించినట్లుగా కనిపిస్తోంది. దానికి అటు ఇటు రెండు భాగాల రిలీజ్ డేట్లను రివీల్ చేశారు. ఈ అప్డేట్ ను నమిత్ మల్హోత్రా ఇస్తూ.. "ఐదు వేల ఏళ్ల కిందటి ఈ ఇతిహాసాన్ని బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడానికి నేను పదేళ్ల కిందటే నా ప్రయణాన్ని మొదలుపెట్టాను.
మొత్తానికి ఇప్పుడు అది ఎంతో అందంగా కార్యరూపం దాల్చుతోంది. మన చరిత్ర, మన నిజం, మన సంస్కృతి, మన రామాయణాన్ని అత్యంత ప్రామాణికంగా, పవిత్రంగా, విజువల్ వండర్ గా ప్రపంచానికి అందించేందుకు మా టీమ్స్ నిరంతరాయంగా కృషి చేస్తున్నాయి" అనే క్యాప్షన్ తో అతడు ఈ పోస్టర్ షేర్ చేశాడు.
రామాయణ మూవీ గురించి..
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రామాయణ గురించి అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఫీలవుతున్నారు. ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడి పాత్రలో కన్నడ రాక్ స్టార్ యశ్ కనిపించబోతున్నాడు.
కైకేయిగా లారా దత్తా, హనుమాన్ గా సన్నీ డియోల్, మంధరగా షీబా చద్దాలాంటి వాళ్లు నటించనున్నారు. ఇప్పటికే రణ్‌బీర్, సాయి పల్లవికి సంబంధించి సెట్స్ లోని ఫొటోలు కూడా లీకైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు యశ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీనిపై అతడు స్పందిస్తూ.. ఈ సినిమా ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తీయలేమని అన్నాడు. ఇంతటి భారీ బడ్జెట్ సినిమా కోసం అలాంటి నటీనటులు కూడా అవసరం అని యశ్ అభిప్రాయపడ్డాడు.
టాపిక్