SS Rajamouli: మహేష్ బాబుకి జోడీగా SSMB29లో బ్రిటీష్ భామని సెట్ చేసిన రాజమౌళి? హీరోయిన్‌ని ఫాలో అవుతూ కార్తికేయ హింట్
Naomi Scott In SSMB29: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో బ్రిటీష్ భామ ఓలివియా మోరిస్‌ను తీసుకున్న రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా కోసం మరో బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం బ్రిటీష్ భామని దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసుకురాబోతున్నట్లు వార్త వెలుగులోకి వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఒక భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతుండగా.. ప్రస్తుతం లోకేషన్స్‌ని ఫైనల్ చేసే పనిలో రాజమౌళి ఉన్నారు. ఇటీవల కెన్యాలో చక్కర్లు కొట్టిన రాజమౌళి.. లోకేషన్స్ గురించి హింట్ ఇస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేశారు.
రూ.1000 కోట్ల బడ్జెట్
ఈ ఏడాది గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు.. SSMB29 సినిమా కోసం డేట్స్ అన్నీ రాజమౌళికి ఇచ్చేశారు. కానీ.. నెలలు గడుస్తున్నా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి సంకేతాలు ఇవ్వగా.. సినిమా బడ్జెట్ రూ.1,000 కోట్లు వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ SSMB29 సినిమా కోసం బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్‌ని రాజమౌళి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన చర్చలు నవోమి స్కాట్‌తో ముగిశాయని.. అందుకే ఆమెని ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళి కొడుకు కార్తికేయ ఫాలో అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
భారత్ మూలాలు ఉన్న హీరోయిన్
నవోమి స్కాట్ మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ అమ్మడి తల్లి ఉసా స్కాట్‌ది గుజరాత్‌కాగా.. ఆమె ఇంగ్లాండ్‌కి వలస వెళ్లిందట. దాంతో నవోమి స్కాట్ భారత్ సంతతికి చెందిన అమ్మాయి అనే విషయం బహిర్గతమైంది. ఇప్పటికే నవోమి స్కాట్.. చార్లీస్ ఏంజెల్స్, స్మైల్, అల్లాద్దీన్, విజర్డ్స్ తదితర సినిమాల్లో నటించింది.
ఇప్పటికే బ్రిటీష్ హీరోయిన్‌తో రాజమౌళి ఒక సినిమా చేశారు. బ్రిటీష్ భామ ఓలివియా మోరిస్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన విషయం తెలిసిందే. దాంతో వరుసగా రెండో సినిమాలోనూ బ్రిటీష్ హీరోయిన్‌తో కలిసి రాజమౌళి పనిచేయబోతున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ బ్రిటీష్ ముద్దుగుమ్మ
మార్చి 25, 2022లో విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాని మించి భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టేలా SSMB29 సినిమాని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.