తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Nannapuneni Narender : బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్?- వరంగల్ లో ఉత్కంఠ రేపుతున్న జంపింగ్ లు

Nannapuneni Narender : బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్?- వరంగల్ లో ఉత్కంఠ రేపుతున్న జంపింగ్ లు

HT Telugu Desk HT Telugu

12 April 2024, 12:26 IST

google News
    • Nannapuneni Narender : వరంగల్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ ను వీడారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆ పార్టీని బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

Nannapuneni Narender : ఓరుగల్లు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. జిల్లాలోని బీఆర్ఎస్(BRS) బడా లీడర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి చేరుతుండగా.. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్(Nannapuneni Narender) మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూడగా.. కొద్దిరోజులుగా ఆయన సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మారుమోగింది. ఆయనతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు, మరికొందరు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. దీంతో జిల్లాలోని కొందరు పార్టీ పెద్దలు నన్నపనేనికి ఫోన్ చేసి మరీ ఆరా తీయగా.. అదంతా ఏమీ లేదని నరేందర్ కొట్టి పారేస్తుండటం గమనార్హం.

ఓటమి తరువాత సైలెంట్

2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్నపనేని నరేందర్ బరిలో నిలిచారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు(Errabelli Pradeeprao) పోటీ చేశారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao)కు నన్నపనేని నరేందర్ సన్నిహితుడిగా పేరుండగా.. ఆ ప్రభావంతో కొండా సురేఖ, మురళీ కూడా నరేందర్ ను శత్రువుగానే భావించారు. సందర్భం వచ్చినప్పుడల్లా కొండా దంపతులు, నన్నపనేని నరేందర్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్(Warangal) తూర్పు నియోజకవర్గంలో ట్రయాంగిల్ వార్ నడిచింది. పోలింగ్ జరిగే రోజు కూడా ఈ నియోజకవర్గంలో నాటకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఓటర్లు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇల్లు కదలకుండా ఉండి, సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీని వెనుక నానా రకాల కారణాలు వినిపించాయి. డబ్బుల కోసం ఎదురుచూసి చాలామంది ఓటేయడానికి వెనుకడుగు వేయగా.. చివరి నిమిషంలో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు పెరిగాయి. ఈ క్రమంలో కొండా సురేఖకు కాస్త ఎడ్జ్ ఉందనే ప్రచారం జరగగా.. బీఆర్ఎస్ క్యాండిడేట్ నన్నపనేని నరేందర్ కాస్త సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఓట్లు భారీగా పెరిగిపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ 67,757 ఓట్లు సాధించగా.. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు 52,105, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ కు 42,783 ఓట్లు వచ్చాయి. దీంతో కొండా సురేఖ 15,652 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, మంత్రి పదవి దక్కించుకోగా.. నన్నపనేని నరేందర్ మాత్రం మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఎలక్షన్ తరువాత వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా మురళి, కొండా సురేఖ ప్రాబల్యం పెరిగిపోవడంతో నన్నపనేని సైలెంట్ గా ఉండిపోవాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్లారిటీ ఇచ్చిన నన్నపనేని

నన్నపనేని నరేందర్ బీజేపీ(BJP)లో చేరుతున్నాడంటూ గురువారం పెద్ద ఎత్తున ప్రచారం జరగగా.. సాయంత్రం ఆయన పార్టీ మారే విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్నదంతా కేవలం ప్రచారం మాత్రమేనని, అందులో వాస్తవం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తనంటే పడని కొంతమంది తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని నన్నపనేని నరేందర్(Nannapuneni Narender) కొట్టి పారేశారు. నియోజకవర్గంలో తనకు శత్రువులు ఎక్కువగా తయారయ్యారని, తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అదంతా ఎవరూ నమ్మవద్దని నన్నపనేని కోరారు. దీంతో నన్నపనేని విషయంలో జరిగిన ప్రచారానికి తెరపడినట్లయ్యింది.

ఆరూరి, కడియం కూడా ఇలాగే

వరంగల్ రాజకీయాల్లో(Warangal Politics) పార్టీ జంపింగ్ లు తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. పార్టీ మారుతున్న విషయం బయటకు లీక్ కావడం, ఆ తరువాత అదంతా ఏమీ లేదంటూ కొట్టి పారేసి, సమయం చూసి పక్క పార్టీలోకి జంప్ కావడం వరంగల్ లో పరిపాటిగా మారింది. ఇటీవల వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో కూడా ఇలాగే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆరూరి రమేశ్(Aroori Ramesh) పార్లమెంట్ టికెట్(MP Ticket) కోసం బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. నాలుగైదు సార్లు ఇలాగే ప్రచారం జరగగా.. ఆయన ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చారు. చివరకు నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ అభ్యర్థిగా టికెట్ సంపాదించారు. తాజాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) కూడా పార్టీ మారబోతున్నారని కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆ ప్రచారాలను ఖండించారు. చివరకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్(BRS MP Ticket) తన కూతురుకు కన్ఫామ్ అయిన తరువాత అందరికీ షాక్ ఇచ్చి, తండ్రీకూతుళ్లిద్దరూ కాంగ్రెస్(Congress) కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా.. ఇలాగే కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ విషయంలో ప్రచారం జరుగుతుండగా.. ఆయన కూడా అందరిలాగే తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేస్తున్నారు. కానీ ఆరూరి, కడియం, పసునూరి దయాకర్ లాగే నన్నపనేని కూడా సమయం చూసి జంప్ అవుతారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కాగా నన్నపనేని ఎటు వైపు ఆలోచిస్తున్నారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం