Warangal MP Ticket: ఓరుగల్లు కాంగ్రెస్ టికెట్‌పై ఉత్కంఠ.. దయాకర్‌, రాజయ్య, సాంబయ్య మధ్య తీవ్ర పోటీ-fierce competition between three candidates for warangal congress mp ticket ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal Mp Ticket: ఓరుగల్లు కాంగ్రెస్ టికెట్‌పై ఉత్కంఠ.. దయాకర్‌, రాజయ్య, సాంబయ్య మధ్య తీవ్ర పోటీ

Warangal MP Ticket: ఓరుగల్లు కాంగ్రెస్ టికెట్‌పై ఉత్కంఠ.. దయాకర్‌, రాజయ్య, సాంబయ్య మధ్య తీవ్ర పోటీ

HT Telugu Desk HT Telugu
Mar 27, 2024 11:18 AM IST

Warangal MP Ticket: ఓరుగల్లు కాంగ్రెస్ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్ధిత్వం కోసం పసునూరి దయాకర్, డా.తాటికొండ రాజయ్య, దొమ్మటి సాంబయ్యలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

వరంగల్  కాంగ్రెస్ టిక్కెట్ కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ
వరంగల్ కాంగ్రెస్ టిక్కెట్ కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ

Warangal MP Ticket: లోక్ సభ Loksabha ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ 57 మంది అభ్యర్థులతో మూడో లిస్ట్ విడుదల చేసింది. అందులో తెలంగాణకు సంబంధించి ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. మూడో జాబితాలోనైనా క్లారిటీ వస్తుందనుకున్న వరంగల్ స్థానంపై సస్పెన్స్ మాత్రం వీడలేదు. 

దీంతో కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుండగా.. జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. టికెట్ ఎవరికి దక్కుతుందోనని చర్చ జరుగుతుండగా.. ప్రధానంగా ఇద్దరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత నెలలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య Rajaiah వరంగల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాపత్రయ పడుతుండగా.. సిట్టింగ్ ఎంపీ, ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పసునూరి దయాకర్  Dayakar కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు దొమ్మటి సాంబయ్య Sambiah, ఇంకొందరు నేతలు కూడా పోటాపోటీగా తమతమ గాడ్ ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

పోటీకి తహతహలాడుతున్న రాజయ్య

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఆశించి, భంగపడిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య… గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1997లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేసిన రాజయ్య.. మొదటిసారి 2009లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థిగా ఉన్న కడియం శ్రీహరిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆ తరువాత 2012 బై ఎలక్షన్స్ తో పాటు తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ నుంచి 2014 ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. చివరి సారి 2018 ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయాన్నందుకున్నారు. 2023 ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించగా.. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ కడియం శ్రీహరికి కేటాయించడంతో రాజయ్య తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరేందుకు కసరత్తు చేసినా.. ఆ పార్టీలో కొందరు నేతలు అభ్యంతరం తెలపడంతో కొద్దిరోజులు ఆయన సైలెంట్ గా ఉండిపోయారు.

ఎంపీ ఎలక్షన్ హడావుడి మొదలైనప్పటి నుంచి ఆయన దిల్లీలోనే మకాం వేసి, కాంగ్రెస్ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు. తనను కాంగ్రెస్ లోకి చేర్చుకుని వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం కూడా కాంగ్రెస్ వరంగల్ లోక్ సభ స్థానం అభ్యర్థిత్వానికి రాజయ్య పేరును కూడా పరిశీలిస్తోంది.

హ్యట్రిక్ కోసం పార్టీ మారిన పసునూరి

వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్.. గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి కూడా టికెట్ ఆశించిన పసునూరి దయాకర్.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెడతానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా మాటిచ్చారు. కానీ వరంగల్ బీఆర్ ఎస్ టికెట్ ను స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించడంతో మార్చి 16వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక వరంగల్ ఎంపీ టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకుంటుండటంతో పాటు అభ్యర్థిత్వం ప్రకటించేంత వరకు విశ్రమించొద్దనే ఉద్దేశంతో పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దీంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు నేతల మధ్య పోటాపోటీ ప్రయత్నాల వార్ నడుస్తోంది.

అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ వరంగల్ టికెట్ కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుండగా.. పార్టీ సీనియర్ నేతలు కూడా పట్టువిడవకుండా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా పార్టీ సీనియర్ లీడర్ దొమ్మటి సాంబయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

ఎంతోకాలంగా పార్టీకి సేవలందిస్తూ రావడం, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పేరు ఉండటంతో పార్టీ నాయకత్వం దొమ్మటి సాంబయ్య పేరును కూడా పరిశీలిస్తోంది. ఆయనతో పాటు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, రామగళ్ల పరమేశ్వర్, పరంజ్యోతి తదితరులు కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు.

కాంగ్రెస్ గురువారం ప్రకటించిన స్థానాల్లో వరంగల్ లేకపోవడంతో ఇక్కడి జనాల్లో తీవ్ర అసక్తి నెలకొంది. మరి కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్రంలోనే కీలకంగా చెప్పుకునే వరంగల్ అభ్యర్థిత్వాన్ని ఎవరికి కట్టబెడుతుందో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner