Errabelli Dayakar Rao : బీజేపీలోకి ఎర్రబెల్లి దయాకర్‌రావు, క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి?
Errabelli Dayakar Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి పేరు వినిపించడంతో... ఆయన బీజేపీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Errabelli Dayakar Rao : బీఆర్ఎస్ కీలకనేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) ఆ పార్టీని వీడనున్నారనే ప్రచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ నువీడి ఇతర పార్టీల వైపు అడుగులు వేయగా.. ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)వ్యవహారంలో దయాకర్ రావు పేరు వినిపిస్తుండటం, ఆ తరువాత ఎర్రబెల్లి పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) ఉమ్మడి వరంగల్జిల్లాలో రాజకీయాలకు పెట్టింది పేరు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్థానం మొదలు పెట్టి, తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ లో చేరారు. తన రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది ఓటమి ఎరుగని నేతగా పేరుగాంచారు. ఇంతవరకు బాగానే ఉండగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS)నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి చేతిలో ఘోరపరాభవం చెందారు. ఓటమి ఎరుగని నేతగా పేరున్న దయాకర్ రావును మొట్టమొదటిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన అత్యంత చిన్న వయస్కురాలు, 26 ఏళ్ల యశస్విని రెడ్డి మట్టికరిపించారు. ఈ ఎన్నికల్లో 47,634 ఓట్ల తేడాతో దయాకర్ రావు కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి దయాకర్‌రావు తీవ్ర నిరాశలో పడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును(Ex DSP Praneeth Rao) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao)పేరు కూడా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వెల్లడించినట్లు ప్రచారంలో ఉంది. ఎర్రబెల్లి సహకారంతోనే ప్రణీత్‌రావు ఎస్ఐబీలో చేరారనే ఆరోపణలు ఉండగా.. దయాకర్ రావుకు సంబంధికుల ఇంటిలోనే ఫోన్‌ట్యాపింగ్ కు సంబంధించిన వార్ రూం ఆపరేట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మాటలు విని, వారిపై దాడులు చేయించడం, డబ్బు పంపిణీ జరగకుండా పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఈ వార్రూమ్నుంచి సమాచారం ఇచ్చేవారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో సిట్ అధికారులు లోతైన విచారణ జరుపుతుండగా.. దయాకర్‌రావుకు దగ్గరగా ఉండే వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలను విచారణ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తరువాత పార్టీ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బీజేపీ వైపు మళ్లడం, తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉచ్చు బిగుస్తుండటంతోనే మాజీ మంత్రి దయాకర్‌రావు బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
క్లారిటీ ఇచ్చిన ఎర్రబెల్లి
తాజా పరిణామాల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, తాను బీజేపీ(BJP)లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేసే దుష్ప్రచారాలని నమ్మవద్దు అని మాజీ మంత్రి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం