Congress MP Ticket: కాంగ్రెస్‌ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఢిల్లీలో మకాం.. వరంగల్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు…-former mla rajaiah is staying in delhi for congress ticket efforts are being made for warangal ticket ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Congress Mp Ticket: కాంగ్రెస్‌ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఢిల్లీలో మకాం.. వరంగల్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు…

Congress MP Ticket: కాంగ్రెస్‌ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఢిల్లీలో మకాం.. వరంగల్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు…

HT Telugu Desk HT Telugu
Mar 27, 2024 11:27 AM IST

Congress MP Ticket: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో వరంగల్‌‌లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌కు డిమాండ్ పెరిగింది. బిఆర్‌ఎస్‌ను వీడిన రాజయ్య Rajaiah కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఢిల్లీలో మకాం వేశారు.

వరంగల్ టిక్కెట్ కోసం రాజయ్య జోరుగా ప్రయత్నాలు
వరంగల్ టిక్కెట్ కోసం రాజయ్య జోరుగా ప్రయత్నాలు

Congress MP Ticket: పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనుండగా.. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి.

వరంగల్ Warangal పార్లమెంట్ స్థానంలో మాత్రం కేవలం బీఆర్ఎస్  BRS తప్ప, మిగతా కాంగ్రెస్, బీజేపీ  BJPమాత్రం క్యాండిడేట్లను ప్రకటించలేదు. దీంతో ఆశావహులు ఆ రెండు పార్టీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

ఇదిలాఉంటే అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ మైలేజ్ బాగా పెరిగిపోగా.. చాలా మంది హస్తం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేందుకు తమ గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఇందులో ప్రధానంగా స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య Rajaiah వరంగల్ పార్లమెంట్ Warangal MP స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా దిల్లీలోనే ఉంటూ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

టికెట్ దక్కలేదని బీఆర్ఎస్ కు రాజీనామా

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ SC Reserved కాగా.. 2009 నుంచి 2018 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో డాక్టర్ తాటికొండ రాజయ్య విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు.

కానీ పార్టీ అధిష్ఠానం ఆయనకు మొండిచేయి చూపించింది. ఆ స్థానాన్ని కడియం శ్రీహరికి కట్టబెట్టింది. కాగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి బరిలో దిగి విజయం సాధించగా.. కొద్దిరోజుల పాటు తాటికొండ రాజయ్య తెరమరుగయ్యారు. చివరకు పార్టీలో కొనసాగడం ఇష్టం లేక ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కూడా పంపించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. కానీ హస్తం పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.

ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య విషయంలో తాటికొండ రాజయ్యపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తగా.. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే తాము పార్టీలో ఉండబోమని స్పష్టం చేశారు. దీంతో రాజయ్యను పార్టీలో చేర్చుకునేందుకు హస్తం నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఇన్ని రోజులు సంయమనం పాటించిన తాటికొండ రాజయ్య ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ కావడంతో టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కొద్దిరోజులుగా దిల్లీలోనే

ఇప్పటికే వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ను స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్యకు పార్టీ కేటాయించిన విషయం తెలిసిందే. బీజేపీ టికెట్ తాజాగా ‘కారు’ దిగి కాషాయ కండువా కప్పుకున్న అరూరి రమేశ్ కే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ టికెట్ పెండింగ్ లో ఉండగా.. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజయ్య ఉవ్విల్లూరుతున్నారు. తనకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కకుండా చేశాడనే కోపం కడియం శ్రీహరిపై ఉండగా.. ఎలాగైనా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, కడియం కావ్యపై గెలుపొంది తన సత్తా చాటాలని ఆరాట పడుతున్నాడు.

ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు స్థానాల్లో.. ఆరు చోట్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉండగా.. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమనే భావనలో ఉన్నారాయన. దీంతోనే కొద్దిరోజులుగా దిల్లీలోనే మకాం వేసి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఓ కీలక నేత సపోర్టుతో..

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత మద్దతుతోనే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మకాం వేసి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఒకేపార్టీలో పని చేసిన నేతలు కావడంతో ఆయన మద్దతుతోనే రాజయ్య అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఫుల్ కాంపిటీషన్ ఉండగా.. ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు తాటికొండ రాజయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాజయ్య ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం