Warangal MP Ticket 2024 : ఒక్క ఛాన్స్ ప్లీజ్..! ఎంపీ టికెట్ కోసం 'హస్తం' నేతల ఆరాటం
27 March 2024, 10:39 IST
- Warangal Congress MP Ticket 2024 : వరంగల్ ఎంపీ సీటు కోసం పలువురు హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి పార్టీకి రాజీనామా చేయటంతో…. ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ ఎంపీ సీటు
Warangal Congress MP Ticket 2024 : అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో సీన్ మారిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించగా ఇప్పుడు ఎంపీ సీట్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కొల్లగొట్టగా.. వరంగల్ ఎంపీ టికెట్ కోసం ఆ పార్టీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారిలో వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులతో పాటు మరికొంతమంది పార్టీ సెకండ్ క్యాడర్ గా చెప్పుకునే నేతలు కూడా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకో మూడు నెలలు ఉండగా.. ఇప్పటినుంచే తమతమ గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు.
మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్సే
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పసునూరి దయాకర్ ఉండగా.. ఆయనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కూతురు కడియం కావ్య, కొంతమంది ఉద్యమకారులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలాఉంటే వరంగల్ లోక సభ నియోజకవర్గంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో ఒక్క స్టేషన్ ఘన్ పూర్ మినహా మిగతా ఆరు చోట్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు చోట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ మేరకు ఎంపీగా పోటీ చేస్తే సులువుగా విజయం దక్కే అవకాశం ఉందనే భావనలో పడ్డారు.
టికెట్ కోసం పోటాపోటీ
కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ ను బరిలో నిలిపే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత పార్టీ అధిష్ఠానం ఆ నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది. కొద్దిరోజులుగా స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారనే ప్రచారం జోరందుకుంది. కానీ కొంతమంది నేతలు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ టికెట్ కోసం ఇదివరకు ఎంపీగా పని చేసిన సిరిసిల్ల రాజయ్య టికెట్ ఆశిస్తుండగా.. దొమ్మటి సాంబయ్య కూడా పోటీలో ఉన్నారు. ఈ మేరకు వీరిద్దరూ పార్టీ ఎమ్మెల్యేలు, అగ్ర నేతలకు టచ్ లో ఉంటూ టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకు ఎంపీగా చేసిన అనుభవంతో పాటు తనకంటూ ప్రత్యేకమైన క్యాడర్ ఉందంటూ సిరిసిల్ల రాజయ్య అధిష్ఠానం వద్ద మొరపెట్టుకుంటుండగా.. దొమ్మటి సాంబయ్య కూడా ఇదే తీరుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేసిన ఆయన.. కొంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ తో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు లీడర్లు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తుండటం గమనార్హం.
తెరమీదకు మరికొందరు
అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఎంపీ టికెట్లకు డిమాండ్ పెరిగిపోవడంతో కొంతమంది కొత్త అభ్యర్థులు కూడా తెరమీదకు వస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న హరికోట్ల రవి ఎంపీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న రామసహాయం సురేందర్ రెడ్డితో పాటు కొంతమంది పార్టీ సీనియర్ నేతల టచ్ లోకి వెళ్లిన ఆయన టికెట్ కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దల మద్దతు కోసం అక్కడే మకాం వేసి మరీ ఉంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు సోనియాగాంధీని కలిసిన ఆయన టికెట్ పై ధీమాతో ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్ నుంచి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గా ఎదిగిన ఆయన మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువ కాలం పని చేశారు. ఆ తరువాత జిల్లా రిజిస్ట్రార్ గా పని చేస్తూ కొంతమంది నేతలకు కూడా ఆయన దగ్గరయ్యారు. ఆయా నేతల సపోర్ట్ తో పాటు పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఒక్క ఛాన్స్ కోసం హరికోట్ల రవి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఈసారైనా అవకాశం కోసం..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన కొంతమంది.. అప్పుడు అవకాశం దక్కకపోవడంతో ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పార్టీ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ పెద్దలకు సన్నిహితంగా మెదిలే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా నుంచి మొదలు రాష్ట్ర, ఢిల్లీ స్థాయి లీడర్లకు కూడా పెరుమాండ్ల రామకృష్ణ తరచూ కలుస్తూ టికెట్ సాధించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కూరాకుల భారతి కూడా వరంగల్ ఎంపీ టికెట్ కోసం బాగానే శ్రమిస్తున్నారు. తనకున్న పరిచయాల మేరకు ప్రొఫెసర్ కోదండరామ్, కొంతమంది ఉద్యమకారులతో కలిసి ఆమె టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక మరో డాక్టర్ పులి అనిల్ కుమార్ కూడా టికెట్ బరిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా టికెట్ కోసం ప్రయత్నాలు చేయగా.. అధిష్టానం నుంచి నిరాశే ఎదురైంది. దీంతో ఈసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఎవరికి వారు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. పార్టీ అధిష్టానం చివరకు ఎవరి వైపు మొగ్గుచూపుతుందో చూడాలి.