Chevella Congress MP Ticket 2024 : రేసులోకి కొత్త పేరు..! చేవెళ్ల ఎంపీ టికెట్ వారికే ఖరారైందా..?-patnam family likely to contest the chevella seat as the congress mp candidate in 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Chevella Congress Mp Ticket 2024 : రేసులోకి కొత్త పేరు..! చేవెళ్ల ఎంపీ టికెట్ వారికే ఖరారైందా..?

Chevella Congress MP Ticket 2024 : రేసులోకి కొత్త పేరు..! చేవెళ్ల ఎంపీ టికెట్ వారికే ఖరారైందా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 09, 2024 03:12 PM IST

Chevella LokSabha constituency News: లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కీలకమైన చెవేళ్ల స్థానం నుంచి బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు చేస్తోంది. అయితే అందుకు తగ్గట్టే ఓ మాజీ మంత్రి ఫ్యామిలీకి టికెట్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చేవెళ్ల బరిలో పట్నం ఫ్యామిలీ...?
చేవెళ్ల బరిలో పట్నం ఫ్యామిలీ...?

Chevella Congress MP Ticket 2024 : వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) విజయం సాధించి అధికారంలోకి రావటంతో సరికొత్త జోష్ తో ఉన్న హస్తం పార్టీ… రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లను గెలవటమే టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తి అయింది. అయితే నగర శివారు ప్రాంతంలో ఉండే కీలకమైన చేవెళ్ల నుంచి ఎవరి టికెట్ ఇవ్వాలనే దానిపై మొన్నటి వరకు తర్జనభర్జన పడింది. అయితే ఇక్కడ్నుంచి ఓ మాజీ మంత్రి ఫ్యామిలీని బరిలో దించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే… తాజగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి కుటుంబం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

తెరపైకి పట్నం ఫ్యామిలీ…!

పట్నం మహేందర్ ఫ్యామిలీ… ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మహేందర్ రెడ్డి… అన్నీతానై చూసేవారు. అప్పట్లో జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గా కూడా ఆయన సతీమణి పట్నం సునీతారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిన మహేందర్ రెడ్డి… తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలి కేబినెట్ లోనే మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మరోసారి కూడా ఆయన సతీమణి జడ్పీ ఛైర్ పర్సన్ గా అవకాశం దక్కించుకున్నారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. ఇక్కడ పైలెట్ రోహిత్ రెడ్డి గెలిచారు. దీంతో పట్నం రాజకీయ భవిష్యత్ డైలమాలో పడిపోయింది. అయితే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది బీఆర్ఎస్. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి… గులాబీ గూటికి చేరారు. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో కొనసాగింది. చివరికి 2023 ఎన్నికల్లో రోహిత్ రెడ్డికే టికెట్ దక్కగా… మహేందర్ రెడ్డి సైలెన్స్ అయిపోయారు. ఈ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి ఓడిపోగా… ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ… ఏ క్షణమైనా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైంది.

సీఎంతో భేటీ….

పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిలు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో వీరు కాంగ్రెస్ లో చేరటం దాదాపు ఖరారైపోయింది. ఇందులో భాగంగా వీరు ఇవాళో, రేపో ఢిల్లీకి వెళ్లి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరికి చేవెళ్ల ఎంపీ టికెట్ పై హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌ గా సునీతారెడ్డి పదవీ కాలం కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఆమెనే చేవెళ్ల పార్లమెంట్‌ బరిలో ఉంటారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

అయితే పార్లమెంట్ స్థానల నుంచి పోటీ చేసేందుకు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపుతున్నారు.చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి తమ అభ్యర్థనలను ఉంచినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ టికెట్ తమకే కేటాయిస్తారన్న నమ్మకంతో పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు వాల్ పోస్టర్స్ సైతం వేసే పనిలో పడ్డారు. వారిలో ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్కె లక్ష్మారెడ్డి, టిపిసిసి ప్రతినిధి సత్యంరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.అయితే ఇటీవల జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో సత్యం రావును చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నిలపాలని ప్రతిపాదిస్తూ జిల్లా నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సత్యంరావు అయితే అన్ని రకాలుగా బాగుంటుందని ,గత మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ప్రజలకు,కేడర్ కు అందుబాటులో ఉంటున్నారని అయన అనుచరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం