Pawan Kalyan : సజ్జల...నీకు నా సంగతి తెలియదు, మా అన్నయ్య చిరంజీవి జోలికి రాకు - పవన్ కల్యాణ్
21 April 2024, 21:19 IST
- Pawan Kalyan Varahi Yatra Updates: సజ్జలకు వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మా అన్నయ్య చిరంజీవి జోలికి రావొద్దని హెచ్చరించారు.
జనసేన అధినేత పవన్
Pawan Kalyan : వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan). ఆదివారం నర్సాపురంలో తలపెట్టిన వారాహి సభలో మాట్లాడిన ఆయన… తన సోదరుడు చిరంజీవిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నేత సజ్జలను (sajjala ramakrishna reddy)టార్గెట్ చేశారు పవన్. “సజ్జల మా అన్నయ్య చిరంజీవి గారి జోలికి రాకు, మా అన్నయ్య అజాత శత్రువు, ఆయన ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మీ పాలసీలకు మద్దతు ఇచ్చిన రోజు కూడా నేను ఆయనను ప్రశ్నించలేదు, అలాంటి వ్యక్తి జోలికి రాకు, నువ్వు మా అందరి ట్యాక్స్ సొమ్ము తింటున్నావు, ఈ మధ్యే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అంటూ” వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
జగన్ జాగ్రత్తగా మాట్లాడు….
సజ్జల మీరు పులివెందుల నుంచి వచ్చి ఉండొచ్చు కానీ… ఒక విప్లవ నాయకుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో తాను చేసి చూపిస్తానన్నారు పవన్ కల్యాణ్. ఎన్నికల సమయంలో ఎర్రి గొర్రె వేషాలు వేస్తే అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటాం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. “జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు, నువ్వెంత నీ బ్రతుకెంత..? సిఎం కదా అని పొగరెక్కి కొట్టుకుంటున్నావ్, నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకేలా ధైర్యంగా మాట్లాడతా, ఎన్నికల సమయం అని కాదు, జాగ్రత్తగా ఉండు. సజ్జల మీరు సింహాలు కాదు కలుగుల్లో దాక్కున్న పందికొక్కులు, మీది సింహాల సమూహం కాదు, పందికొక్కుల సమూహం, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి.టీవీ డిబెట్లలో ఇష్టమొచ్చినట్లు మా గురించి మాట్లాడుతున్న ప్రతీ ఒక్కరినీ గుర్తుంచుకుంటాం, అధికారంలోకి వచ్చాక ఎవరిని మర్చిపోను” అని అన్నారు పవన్ కల్యాణ్.
నా తెగింపు మీకు తెలియదు…
సమాజంలో స్వేచ్చ రావాలంటే NDA కూటమి(NDA Allaince in AP) రావాలన్నారు పవన్ కల్యాణ్(Pawan Kalyan). మా అన్నయ్య జోలికి కానీ, ప్రజల జోలికి కానీ, శెట్టి బలిజ, మత్స్యకార, కాపు , ఇతర అన్ని వర్గాల జోలికి రావొద్దని వస్తే… చూస్తూ ఊరుకోను అని అన్నారు పవన్. “ఈరోజు NDA కూటమిని బలంగా నిలబెట్టి, మీ ముందు బలంగా నిలబడ్డాను అంటే దానికి కారణం చిరంజీవిగారి పుణ్యం, నరసాపురం కాలేజీలో చదువుకునే అత్యున్నత స్థాయికి వెళ్లిన వ్యక్తి, అలాంటి చిరంజీవి గారి గురించి సజ్జల మాట్లాడుతూ ఎంతమంది వచ్చినా అని తప్పుగా మాట్లాడుతున్నాడు, మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ఇలాంటి మాటలు వస్తున్నాయి.నేను ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయను, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తి చేసే రాజకీయం మీకు చూపిస్తాను.జగన్, నువ్వు శివశివాణి స్కూల్లో 10th పేపర్లు కొట్టేసిన సమయంలో, నేను విప్లవనాయకుడు చే గువేరా గురించి చదువుకున్నాను, నా దగ్గర నీ చిల్లర ఎవారాలు చూపించకు, మీరు నన్ను బూతులు తిట్టినా సరే, నేను తెగిస్తే మీరు ఊహించిన దానికంటే పదింతలు తెగిస్తాను, నా తెగింపు నీకు తెలియదు” అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు ఖచ్చితంగా 10 లక్షల బీమా కల్పిస్తామని హామీనిచ్చారు పవన్. “ఇక్కడ దాదాపు 54 సొసైటీలు ఉన్నాయి, ఒక్క సొసైటీకి కూడా లోన్ రాలేదు, మా NDA ప్రభుత్వం రాగానే లోన్ వచ్చేలా చేస్తాం. జీవో 217 రద్దు కోసం బొమ్మిడి నాయకర్ గారు పాదయాత్ర చేస్తే మేము ఇక్కడ సభ పెట్టి జీవో 217 చింపేసాం, అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తాం” అని Pawan Kalyan హామీనిచ్చారు.