YSRCP Sajjala: సజ్జలను సైడ్ చేశారా? ఆయనే పట్టించుకోవడం మానేశారా?
YSRCP Sajjala: ఏపీలో అధికార పార్టీలో ఆయన తిరుగులేని నాయకుడు. పార్టీలో ప్రభుత్వంలో.. ముఖ్యమంత్రి తర్వాతి స్థానం ఎవరిది అంటే వినిపించే పేర్లలో ఆయనొకరు. ముఖ్యమంత్రిగా అత్యంత నమ్మకస్తుడిగా, ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన నాయకుడిని ఓ శాఖ మాత్రం సైలెంట్‌గా సైడ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
YSRCP Sajjala: వైసీపీలో సిఎం తర్వాత ముఖ్యమైన నాయకులు ఎవరు అంటే టక్కున వినిపించే పేర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఆప్తుడిగా, ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి వ్యాపారాల్లో నమ్మకస్తుడిగా ఉన్న సజ్జలకు పార్టీ పెట్టిన తర్వాత, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రాధాన్యత ఇచ్చారు.
పాత్రికేయుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సిఎం సొంత మీడియా వ్యాపారాలను పర్యవేక్షించేవారు. 2014లో వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత అటు పార్టీ వ్యవహారాలు, ఇటు పత్రిక వ్యవహారాలను సమన్వయం చేయడం కష్టం కావడంతో ఆయన పూర్తిగా పార్టీ పనులకు పరిమితం అయ్యారు.
పార్టీలో ట్రబుల్ షూటర్‌గా, ముఖ్యమంత్రి తరపున ఆయన ఆలోచనలు, ఆదేశాలను అమలు చేయడం, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో సజ్జల సక్సెస్ అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వైసీపీలో కీలక నాయకుడిగా గుర్తింపు ఉన్నా, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం వరకే పరిమతం అయ్యారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి క్యాబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ సలహాదారు పదవి వరించింది. వైసీపీ సర్కారులో చాలామంది క్యాబినెట్ ర్యాంకు ఉన్నా సలహాదారులు ఉన్నా వారెవ్వరికి లేని గుర్తింపు, ప్రాధాన్యత సజ్జలకు మాత్రమే దక్కింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని మభ్యపెట్టారో, మాయ చేశారో కానీ ఓ శాఖలో మాత్రం సైలెంట్‌గా సైడ్ చేసేశారనే ప్రచారం జరుగుతోంది.
పబ్లిసిటీ బాధ్యత ఆయనదే….
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన కొన్ని వ్యవహారాలపై పర్యవేక్షణ బాధ్యతను సజ్జలకు అప్పగించారు. అందులో మీడియా వ్యవహారాలు ఒకటి. అధికారికంగా మీడియా కమ్యూనికేషన్స్ విభాగానికి సలహాదారు మరొకరు ఉన్నా, మీడియా ప్రచారం, ప్రకటనల వంటి బాధ్యత మాత్రం ఆయనే చూసేవారు.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు ఒకటి రెండు కార్యక్రమాలకు మాత్రమే ప్రకటన బాధ్యతను కమ్యూనికేషన్స్ వ్యవహారాల విభాగం పర్యవేక్షించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏ వ్యవహారాలను ఎవరు పర్యవేక్షించాలనే దానిపై స్పష్టత రావడంతో ప్రకటనల డిజైనింగ్ నుంచి ,వాటిని ఎవరికి కేటాయించాలనే విషయంలో కీలక బాధ్యతల్ని సజ్జలకు కట్టబెట్టారు. మొదట్లో ఇది సజావుగానే సాగినా క్రమేణా ఇతర పనుల ఒత్తిడితో సజ్జల బిజీ కావడం వాటిని పర్యవేక్షించడం సన్నగిల్లింది.
ఇప్పటికీ ఏపీలో మీడియా వ్యవహారాలను పర్యవేక్షించడం, మీడియా యాజమాన్యాలతో సంప్రదింపులు చేయడం వంటి వ్యవహారాల్లో సజ్జల నేరుగానే వ్యవహరిస్తుంటారు. అయితే ఆయన దృష్టికి వచ్చిన వాటిలోనో, ఆయన గమనించిన విషయాలకు మాత్రమే అది పరిమితం అయ్యింది. పత్రికల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి, మీడియా మేనేజ్‌మెంట్, వ్యాపారాల్లో కూడా దశాబ్దాల అనుభవం ఉంది. కింది స్థాయి ఉద్యోగుల విధుల నుంచి మేనేజ్మెంట్ పాలసీల వరకు ప్రతి వ్యవహారంలో పట్టుంది.
మీడియా సంస్థలతో సంప్రదించే సమయంలో విషయంలో సజ్జల హుందాగానే ప్రవర్తిస్తారని, పార్టీ విధి విధానాలను, ప్రాధాన్యతలను వివరిస్తారు తప్ప ఖచ్చితంగా ఇలాగే పని చేయాలనే ఒత్తిడి మాత్రం తీసుకురారని ఆయనతో ప్రత్యక్ష అనుభవం ఉన్నవారు చెబుతారు. ప్రభుత్వం నుంచి ప్రకటనల రూపంలో సహకారం అందించే విషయంలో తొలినాళ్లలో సజ్జలదే కీలక నిర్ణయంగా ఉండేది. ఇక ప్రకటనల డిజైన్లను ఖరారు చేయడం, వాటి నాణ్యతను పరిశీలించడం వంటి పనులు కూడా ఆయన పరిశీలించే వారు.
తొలినాళ్లలో ప్రభుత్వ ప్రకటనలు, పబ్లిసిటీ వ్యవహారాల్లో సజ్జల కీలక పాత్ర పోషించినా క్రమంగా ఆయన పాత్రను నామమాత్రం చేయడంలో కొందరు అధికారులు సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కోట్లాది రుపాయలు ప్రకటనల కోసం ఖర్చు పెడుతున్నా అవి ప్రజల్లోకి వెళ్లకపోవడానికి కొందరి నిర్వాకమే కారణంగా తెలుస్తోంది. ఇతర పనులతో సజ్జల బిజీ అయిపోవడాన్ని కొందరు తమకు అనుకూలం మలచుకున్నారు.
ఈ ఏడాది మొదట్లో ఏపీ ప్రభుత్వం విశాఖలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో భారీ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రకటనల తయారీని ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. ప్రకటనల రూపకల్పనలో క్రియేటివిటీ కంటే అధికారుల జోక్యం ఎక్కువ పోవడంతో, అలా తాము చేయలేమని చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
ఫక్కున నవ్వుకునేలా ప్రకటనలు…
ఏపీలో ఎన్నికలు మరో 9నెలల దూరంలోకి వచ్చేయడంతో పబ్లిసిటీపై ప్రభుత్వ ఫోకస్ పెరిగింది. చివరి ఏడాది దాాదాపు రూ.650కోట్ల రుపాయలు పబ్లిసిటీకి ఖర్చు చేయడానికి ఆర్ధిక శాఖ అమోదానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధమైన సమయంలో దానిపై పర్యవేక్షణ గాలికొదిలేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వ అనుకూల ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఫుల్ పేజీ ప్రకటనల మాదిరే, వార్తల తరహా వీడియో ప్రకటనలు కూడా టీవీల్లో మొదలయ్యాయి. ఈ ప్రకటనల నాణ్యత మాత్రం లోకల్ కేబుల్ ఛానళ్లలో వచ్చే ప్రకటనల కంటే దారుణంగా ఉంటున్నాయి. చిత్రవిచిత్రమైన ఫాంట్లు, రకరకాల రంగులతో క్రియేటివిటీని కలగాపులగం చేసేశారు.
ఈ తరహా వీడియోల తయారీ కోసమే లక్షల్లో చెల్లిస్తున్నట్లు సమాచారం. గత రెండు మూడు రోజులుగా టీవీల్లో వస్తున్న ప్రకటనల నాణ్యత చూసి మీడియా సంస్థలు ముక్కున వేలేసుకుంటున్నాయి. అవి ప్రభుత్వ ప్రకటనలు కాబట్టి వాటి నాణ్యత అంతే ఉంటుందని సరిపెట్టుకుంటున్నారు. డబ్బు చెల్లించి టీవీల్లో ప్రసారం చేయించడం కోసం వార్తల తరహాలో సుదీర్ఘ ఆడియో విజువల్స్ తయారు చేయిస్తున్నారు. వాటిలో కనీస స్థాయి నాణ్యత కూడా కొరవడింది. ఫాంట్లు, గ్రాఫిక్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.
ప్రకటనల తయారీ, రూపకల్పన మొత్తం నలుగురైదుగురు అధికారులకు వదిలి పెట్టడం.., మీడియా వ్యాపారాలు, వ్యవహారాలతో అనుభవం ఉన్న సజ్జల, జివిడి వంటి ప్రభుత్వ సలహాదారుల ప్రమేయం లేకపోవడం, ఎవరి సలహాలు, సూచనలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో అధికారులు ఆడింది ఆటగా సాగుతోందనే గుసగుసలున్నాయి. ఎన్నికల ఏడాది ప్రచారం ప్రభుత్వానికి, పార్టీకి కీలకం అయినందున ప్రకటనల తీరు తెన్నుల మీద ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరుస్తారో లేదో చూడాలి. అయితే పబ్లిసిటీ వ్యవహారాలపై ఆ విభాగానికి ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడం లేదనే నిస్పృహ కూడా పెద్దలకు ఉందని టాక్. ఇప్పుడు వందలకోట్ల బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్న వేళైనా జాగ్రత్త పడతారో లేదో చూడాలి.