CM Jagan Pulivendula: నేడు పులివెందులలో పర్యటించనున్న సిఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం-cm jagan will visit pulivendulua today inauguration of many development programs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Pulivendula: నేడు పులివెందులలో పర్యటించనున్న సిఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

CM Jagan Pulivendula: నేడు పులివెందులలో పర్యటించనున్న సిఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

Sarath chandra.B HT Telugu
Published Mar 11, 2024 08:52 AM IST

CM Jagan Pulivendula: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో పలు అభివృద్ధి పనుల్ని సిఎం జగన్ ప్రారంభిస్తారు.

నేడు పులివెందులలో పర్యటించనున్న సిఎం జగన్
నేడు పులివెందులలో పర్యటించనున్న సిఎం జగన్

CM Jagan Pulivendula: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 11వ తేదీన వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. సొంత నియోజక వర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

సీఎం జగన్‌ 11వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల Pulivendulaచేరుకుంటారు. పులివెందులలో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ Govt Hospital ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు.

ఆ తర్వాత డాక్టర్‌ వైఎస్సార్‌ జంక్షన్‌ Ysr Junction కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌ ప్రారంభించిన తర్వాత వైఎస్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు Jayamma Shopping Complex చేరుకుని ప్రారంభిస్తారు.

పులివెందులలో గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌‌ను Lake Front ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్‌-1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పులివెందులలో భద్రత కట్టుదిట్టం చేవారు. దాదాపు రూ.860కోట్ల రుపాయల విలువైన అభివృద్ధి పనుల్ని ఇప్పటికే ప్రారంభోత్సవం కోసం సిద్ధం చేశారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలిచి తీరాలని భావిస్తున్న వైఎస్సార్సీపీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని భావిస్తోంది.

నాలుగున్నరేళ్లలో పులివెందుల రూపురేఖలు మారిపోయేలా పలు అభివృద్ధి పనుల్ని చేపట్టారు. సిఎం సొంత నియోజక వర్గం కావడంతో ఎన్నికల నాటికి పనులు పూర్తి చేసే లక్ష్యంతో కృషి చేవారు.

సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రూ.861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రమైన కడపను మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం చెబుతోంది.

అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆస్పత్రిని తీర్చిదిద్దారు. కడపలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. కడపతో పాటు సొంత నియోజక వర్గమైన పులివెందులలో భారీ ప్రాజెక్టులు చేపట్టారు.

ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) ద్వారా రూ.500కోట్లతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను పులివెందులలో నిర్మించారు.

పార్లమెంట్‌ నియోజక వర్గం పరిధిలో ఒక మెడికల్‌ కళాశాల నిర్మించాలనే ఉద్దేశంతో డిసెంబర్‌ 26, 2019న పులివెందులలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 627 పడకల వసతి గల ఆస్పత్రి నిర్మించారు. ఏడాదికి 150 మెడికల్‌ సీట్లు, 60 నర్సింగ్‌ సీట్లల్లో విద్యార్థులు విద్యను అభ్యసించేలా నెలకొల్పారు. జీ ఫ్లస్‌ 3గా నిర్మించిన ఈ భవనాలు ఒక్కొక్క ఫ్లోర్‌ 37,300 చదరపు అడుగులతో చేపట్టారు. రాబోయే విద్యాసంవత్సరానికి మెడికల్‌ కళాశాల అందుబాటులో రానుంది.

అందుబాటులోకి ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌

పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించిన ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ యూనిట్‌ను సైతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభిస్తారు. 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్‌ 24న శంకుస్థాపన చేశారు.

ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్‌ టెక్స్‌టైల్స్‌, బ్రాండెడ్‌ గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. ఏటా 24లక్షల గార్మెంట్స్‌ తయారీ సామర్థంతో నెలకొల్పిన ఈ యూనిట్‌లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు. తొలిదశగా 500మందికి ఉద్యోగాలు కల్పించారు.

వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌

ఇడుపులపాయ కేంద్రంగా రూ.39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో 48 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహంతోపాటు, అడియో విజువల్‌, ఫొటో గ్యాలరీ, పెవిలియన్‌ బ్లాక్స్‌తోపాటు, రెస్టారెంట్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌, గార్డెన్స్‌ నిర్మించారు.

పులివెందుల సమీపంలో రూ.66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమెల్ల లేక్‌ను ప్రారంభించనున్నారు. మ్యూజికల్‌ లేజర్‌ ఫౌంటేన్‌, కిడ్స్‌ప్లే ఏరియా తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. మరో రూ.20 కోట్లతో నిర్మించిన బ నానా ప్యాక్‌ హౌస్‌ను ప్రారంభించనున్నారు. మొత్తంగా పులివెందుల నియోజకవర్గంలో రూ.861.84కోట్ల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి….

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీ పులివెందుల ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం సిఎం పర్యటించే ప్రాంతాలను జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌,పరిశీలించారు. వైఎస్సార్‌ మెడికల్‌ కళాశాల, కళాశాలలోని భవనాలను పరిశీలించారు. బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌హౌస్‌, మినీ సెక్రటేరియట్‌ భవనాన్ని, వైఎస్సార్‌ సర్కిల్‌ బోలేవార్డు షాపింగ్‌ కాంప్లెక్స్‌ గాంధీ సర్కిల్‌, ఉలిమెల్ల లే క్‌ ఫ్రంట్‌, అక్కడే నూతనంగా నిర్మించిన ఆదిత్యా బిర్లా గార్మెంట్‌ లిమిటెడ్‌ ఇండస్ట్రీని, సంయుగ్లాస్‌ ఇండస్ట్రీని వారు పరిశీలించారు.

Whats_app_banner