Mansoor Ali Khan: మన్సూర్‌కు మొట్టికాయలు వేసిన హైకోర్టు .. త్రిష, చిరంజీవిపై కేసు విషయంలో..-trisha should have filed case against you madras high court slams mansoor ali khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mansoor Ali Khan: మన్సూర్‌కు మొట్టికాయలు వేసిన హైకోర్టు .. త్రిష, చిరంజీవిపై కేసు విషయంలో..

Mansoor Ali Khan: మన్సూర్‌కు మొట్టికాయలు వేసిన హైకోర్టు .. త్రిష, చిరంజీవిపై కేసు విషయంలో..

Mansoor Ali Khan: త్రిష, చిరంజీవి, కుష్బూపై కేసు వేసిన మన్సూర్ అలీ ఖాన్‍‍పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవర్తన మార్చుకోవాలని మొట్టికాయలు వేసింది. వివరాలివే..

మన్సూర్ అలీ ఖాన్

Mansoor Ali Khan: తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్.. కొంతకాలం క్రితం హీరోయిన్ త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్‍పై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అలనాటి హీరోయిన్ ఖుష్బూ సుందర్ కూడా ఆగ్రహించారు. తీవ్రమైన విమర్శలు రావడంతో త్రిషకు క్షమాపణ చెప్పినట్టే చెప్పి.. మన్సూర్ అలీ ఖాన్ యూటర్న్ తీసుకున్నారు. త్రిషతో పాటు చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం కేసు వేశారు.

త్రిష, చిరంజీవి, కుష్బూపై మన్సూర్ అలీ ఖాన్ వేసిన కేసు నేడు (డిసెంబర్ 11) మద్రాస్ హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా మన్సూర్ అలీ ఖాన్‍పైనే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. “బహిరంగంగా అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసినందుకు మీపై త్రిష కేసు వేయాల్సింది” అని న్యాయమూర్తి అన్నారు. త్రిష, చిరంజీవి, ఖుష్బూపై మన్సూర్ వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అలవాటును మార్చుకోవాలని మొట్టికాయలు వేసింది.

“ఎప్పుడూ వివాదాలు చేయడం.. ఆ తర్వాత అమాయకుడిని అంటూ బుకాయించడం మీకు అలవాటుగా మారింది” అని మన్సూర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దాఖలు చేసిన కేసు చెల్లదని స్పష్టం చేసింది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో మన్సూర్‌కు నేర్పాలని అతడి తరఫు లాయర్‌కు కోర్టు సూచించింది.

లియో సినిమాలో త్రిషతో తనకు రేప్ సీన్ ఉండాల్సిందంటూ మన్సూర్ కామెంట్లు చేశారు. మరిన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే, త్రిషపై అలా అసభ్యంగా మాట్లాడినందుకు మన్సూర్‌పై చిరంజీవి, ఖుష్బూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో చిరూపై కూడా అర్థం లేని ఆరోపణలు చేశారు మన్సూర్. త్రిష, చిరంజీవి, ఖుష్బూపైనే పరువు నష్టం కేసు వేశారు. అయితే, మన్సూర్‌కు మొట్టికాయలు వేసి ఆ కేసును మద్రాస్ హైకోర్టు ఇప్పుడు కొట్టేసింది.