‍NDA Alliance: ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మైనార్టీ సంఘాల సోషల్ మీడియా ప్రచారం.. టీడీపీ ఓట్లకు గండిపడే అవకాశం!-social media campaign of minority communities against nda alliance chance of losing tdp votes ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  ‍Nda Alliance: ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మైనార్టీ సంఘాల సోషల్ మీడియా ప్రచారం.. టీడీపీ ఓట్లకు గండిపడే అవకాశం!

‍NDA Alliance: ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మైనార్టీ సంఘాల సోషల్ మీడియా ప్రచారం.. టీడీపీ ఓట్లకు గండిపడే అవకాశం!

Sarath chandra.B HT Telugu
Apr 04, 2024 01:49 PM IST

NDA Alliance: ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడంతో ఆ కూటమికి ఓట్లు వేయొద్దంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మైనార్టీ ఓటర్లను హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం సంఘాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి.

ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయొద్దని ముస్లిం సంఘాల ప్రచారం
ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయొద్దని ముస్లిం సంఘాల ప్రచారం

NDA Alliance: జనసేన Janasena, భారతీయ జనతా పార్టీ తో ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్డీఏ గూటికి చేరిన చంద్రబాబుకు వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీలు Muslim Minorities ప్రచారం ప్రారంభించారు. మే 13 న జరిగే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయొద్దని ఏపీ ముస్లిం పరిరక్షణ సమితి నేతలు పిలుపునిచ్చారు.

సుదీర్ఘ కసరత్తు తర్వాత మార్చి 9న బీజేపీBJP తో పొత్తు కుదుర్చుకుని సీట్ల పంపకాలపై మూడు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా 25 లోక్ సభ స్థానాలకు గాను ఆరు, 175 అసెంబ్లీ స్థానాలకు గాను 10 సీట్లను బీజేపీకి కేటాయించారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఓటేయొద్దని హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం సంఘాలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. మార్చి 31న ఆంధ్రప్రదేశ్ ముస్లిం పరిరక్షణ సమితి (ఆంధ్రప్రదేశ్ ముస్లిం పరిరక్షణ కమిటీ) విజయవాడ సమీపంలో సమావేశం నిర్వహించి రాష్ట్రంలోని ముస్లింలందరూ ఎన్డీయే మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

మతం పేరుతో బీజేపీ దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని మైనార్టీ నేతలు ఆరోపించారు.. బీజేపీతో చేతులు కలిపిన ఏ పార్టీనైనా ముస్లిం వ్యతిరేకులుగా పరిగణిస్తామని సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాల్ అహ్మద్ గౌస్ తెలిపారు.

రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని బీజేపీకి టీడీపీ ఊపిరి పోసిందని ఆయన ఆరోపించారు. హలాల్, గోరక్షణ, ఎన్ఆర్సీ, సీఏఏ పేరుతో దేశంలో ముస్లింలను వేటాడి మైనారిటీలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న బీజేపీతో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు.

బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా ఇన్నాళ్లూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూడా ముస్లిం హక్కల పరిరక్షణ సమితి మండిపడింది.

టీడీపీతో చేతులు కలిపి పునరుజ్జీవం పొందేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ముస్లిం మేధావుల సంఘం పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ రాష్ట్రంలోని ముస్లింలందరికీ సందేశాలు పంపుతోంది.

'ముస్లిం సోదరులను నిద్రలేపండి! వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేనల అపవిత్ర మత కూటమికి ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. టీడీపీకి ఏ ఓటు వేసినా మతతత్వ బీజేపీకి వేసినట్లే' అంటూ ఓ కరపత్రం వాట్సప్ గ్రూపులో చక్కర్లు కొడుతోంది.

కూటమి అధికారంలోకి వచ్చి కేంద్రంలో బీజేపీకి టీడీపీ మద్దతిస్తే సీఏఏ, ఉమ్మడి పౌరస్మృతి, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వంటి ప్రమాదకరమైన కార్యక్రమాలను అమలు చేస్తారని ముస్లింలను హెచ్చరించింది.

రాష్ట్రంలో మొత్తం జనాభాలో 7 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా ఏకం కాలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని టీడీపీ సీనియర్ మైనారిటీ నేత ఒకరు అన్నారు. 2014 వరకు వారికి మిశ్రమ విధేయత ఉండేదని, ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ కు, మరికొందరు టీడీపీకి మద్దతిచ్చారన్నారు.

2014 తర్వాత టీడీపీ బీజేపీతో చేతులు కలపడంతో మెజారిటీ ముస్లింలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. 2019 తర్వాత జగన్ అధికారంలోకి వచ్చి బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించడంతో ముస్లింలలో ఒక వర్గం టీడీపీ వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. ఇప్పుడు టీడీపీ బహిరంగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయంగా ఎటువైపు వెళ్లాలనే దానిపై సందిగ్ధ స్థితిని ఎదుర్కొంటున్నారు.

పార్లమెంటులో సీఏఏకు అనుకూలంగా ఓటు వేయడం సహా పలు అంశాల్లో మోదీ ప్రభుత్వానికి మద్దతిచ్చినందున ముస్లింలు కూడా జగన్ పై అనుమానంతో ఉన్నారు. ఈ విమర్శలపై పలుమార్లు వైసీపీ వివరణ ఇచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తాము కేవలం అంశాల వారీగా మద్దతు మాత్రమే ఇచ్చామని వైసీపీ చెబుతోంది.

కుల, మత ప్రాతిపదికన వివక్షకు తాను వ్యతిరేకమని జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. అందువల్ల, సిఎఎ నిబంధనలను ప్రస్తుత ఫార్మాట్లో వైఎస్సార్సీపీ అంగీకరించడం లేదని, ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చట్టానికి సవరణలు చేయాలని కోరామని వైఎస్సార్సీపీ సభ్యుడు మహ్మద్ హఫీజ్ ఖాన్ తెలిపారు.

గత వారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన టీడీపీ అధినేత రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని వివరణ ఇచ్చారు. బీజేపీతో పొత్తుపై ఆందొోళన అవసరం లేదని, ముస్లింల హక్కులను కాపాడతామని ప్రకటించారు.

ఎన్డీయే ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు మోసపోవద్దని, ముస్లిం మైనార్టీల జీవితాల్లో అన్ని రంగాల్లో పురోగతి, అభివృద్ధి జరగాలన్నదే తమ లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో వివరణ ఇస్తున్నారు.

ఓట్ల కోసం వైసీపీ ముస్లింలను రెచ్చగొడుతోందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మోదీ పాలనలో ముస్లింల హక్కులను పూర్తిగా పరిరక్షిస్తామని చెప్పారు.

WhatsApp channel

సంబంధిత కథనం