MLA Tellam Venkat Rao : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ - కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే
07 April 2024, 12:57 IST
- Bhadrachalam MLA Tellam Venkat Rao: బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే
Bhadrachalam BRS MLA Tellam Venkat Rao: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ తో చేరికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ పార్టీ…. స్పీడ్ పెంచే పనిలో పడింది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోగా… తాజాగా మరో ఎమ్మెల్యేని చేర్చుకుంది. ఆదివారం పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు(Bhadrachalam BRS MLA Tellam Venkat Rao) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
జన జాతర సభలో తెెల్లం…
గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు. మిగిలిన 8 స్థానాల్లోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. అయితే తెల్లం వెంకట్రావ్(BRS MLA Tellam Venkat Rao) కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన… ఇటీవలే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఇల్లెందులో జరిగిన ఈ సమావేశంలో తెల్లం వెంకట్రావ్ కూడా కనిపించారు. దీంతో ఆయన హస్తం కండువా కప్పుకోవటం ఖరారే అన్న టాక్ వినిపిస్తోంది. ఇదే కాకుండా… తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభలోనూ తెల్లం వెంకట్రావ్ కనిపించారు.
ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇందులో దానం నాగేందర్… సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. ఇక కడియం శ్రీహరి కుమార్తె… కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది. తాజాగా తెల్లం వెంకట్రావ్ చేరికతో… బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా… కారు దిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నట్లు సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు 64 సీట్లు దక్కగా… బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. సీపీఐ ఒక్క స్థానంలో గెలిచింది. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…. తెలంగాణలో దూకుడు మీద ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇందులో భాగంగా… పలు పార్టీలకు చెందిన నేతలతో పాటు ఘర్ వాపసీ అంటోంది. కేకే వంటి సీనియర్ నేతలు కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.