Adilabad Lok Sabha : ఆదిలాబాద్ లో ఆసక్తికర పోరు, ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య పోటీ
07 April 2024, 17:57 IST
- Adilabad Lok Sabha : ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు ఆదివాసీ అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. వీరు ముగ్గురూ గతంలో ఉపాధ్యాయులుగా పనిచేసినవాళ్లే.
ఆదిలాబాద్ లో ఆసక్తికర పోరు
Adilabad Lok Sabha : ఆదిలాబాద్ లోక్ సభ బరిలో ఈసారి ముగ్గురు ఆదివాసీ అభ్యర్థుల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఎస్టీ రిజర్వ్(SC Reserved) పార్లమెంటు నియోజక వర్గంలో ప్రధాన పార్టీలైన బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) లు ఈసారి ఆదివాసులకే అభ్యర్థిత్వాలు ఖరారు చేయడం ఒక ఎత్తైతే పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల వైపు రావడం ఆసక్తికర పరిణామం. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు, ప్రత్యర్థి మాజీ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్ పై 58 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్ మూడోస్థానంలో నిలిచారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎన్నికలకు ముందుగానే సభల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆదివాసీకే సీటు ఖరారు చేయడంతో ముగ్గురు ఆదివాసీ గోండు తెగకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
సిట్టింగ్ ఎంపీ స్థానం చేజారకుండా
ఆదిలాబాద్(Adilabad) సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని చేజారనివ్వకుండా బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్ కు టికెట్టు ఖరారు చేయడంతో పాటు ఆదివాసీల ఓట్లపైనే పూర్తిగా గురిపెట్టిన పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఒక్కో పోలింగ్ బూత్ కు 370 ఓట్లు తగ్గకుండా
ప్రణాళికలు రచిస్తుంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2111 పోలింగ్ బూత్ లు ఉండగా బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ మూడు ఎస్టీ నియోజక వర్గాల్లో పట్టుసాధించేందుకు ఇప్పటి నుంచే పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. మిగతా పార్టీల కంటే గోడం నగేష్(Godam Nagesh) ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఇదే నియోజక వర్గం నుంచి ముధోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ టి సెగ్మెంట్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు(BJP Mlas) నలుగురు గెలుపొందడంతో విజయం ఖాయమనే ధీమావ్యక్తమవుతుంది.
అయితే పార్టీ టికెట్టు దక్కక నైరాశ్యంలో ఉన్న ఎంపీ సోయం బాపురావు(Soyam Bapurao)హైకమాండ్ నేతలతో టచ్ లోనే ఉన్నా పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. గత పది రోజులుగా దిల్లీలోనే మకాం వేసిన సోయం బాపురావు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. తనకు కేంద్రంలో నామినేటెడ్ పదవి ఇస్తానంటేనే గోడం నగేష్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటానని తేల్చి చెప్పడం గమనార్హం. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కూడా పార్టీకి దూరంగానే ఉండటంతో లంబాడల ఓట్లు ఈసారి ఎటువైపు దారిమళ్లుతాయో అనే అనుమానం కలుగుతోంది.
కాంగ్రెస్ నుంచి సుగుణ
ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి నేరుగా కాంగ్రెస్ లో చేరిన ఆత్రం సుగుణపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. గతంలో ప్రగతి శీల ఉద్యమాల్లో, ఆదివాసీ ఉద్యమ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆత్రం సుగుణకు(Atram Suguna) ఆదివాసుల ఓట్లు దండిగా పడతాయని పార్టీ అధిష్టానం అంచనా వేస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఒకే ఒక కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మబొజ్జు, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్క(Minister Seethakka) పట్టుబట్టి ఆత్రం సుగుణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావ డం సీఎం రేవంత్ రెడ్డి... ఇంద్రవెల్లి సభ విజయవంతం కావడం పార్టీలో ఉత్తేజాన్ని నింపింది. పైగా రాజకీయ ఉద్దండులైన మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డితోపాటు డీసీసీబీ ఛైర్మన్ అడ్డి బోజారెడ్డి, జడ్పీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావుతో సహా ద్వితీయ శ్రేణి క్యాడర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడం ఆత్రం సుగుణకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. తొలిసారిగా కాంగ్రెస్ మహిళా అభ్యర్థిని పోటీలో దించడంతో మహిళల ఓట్లు పడతాయని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.
బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు
తొలిసారి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(Atram Sakku) వ్యూహాత్మకంగా ఆదివాసులు ఓట్లపైనే భారం వేసుకుని ప్రచారం ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి లంబాడాల మెజార్టీ ఓట్లు పడుతాయన్న ధీమాతో లంబాడ తండాల్లో ప్రచారం ముమ్మరం చేస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2008లో కాంగ్రెస్ లో చేరిన ఆత్రం సక్కు అంతకు ముందు ఉపాధ్యాయుడిగానే పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సక్కు 2014లో ఓటమి చవిచూశారు. 2018లో కాంగ్రెస్(Congress) నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కు గిరిజనులు, గిరిజనేతరుల ఓట్లపై భారం వేసుకుని ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ముగ్గురు ఆదివాసీ అభ్యర్థుల మధ్య ఆసక్తికర పోరు నెలకొనగా, గెలుపు ఓటములను నిర్ణయించే గిరిజనేతరుల ఓట్లే ఇక్కడ కీలకంగా మారనున్నాయి.
గిరిజనేతరులే కీలకం
ఇదిలా ఉంటే ఆదిలాబాద్(Adilabad) నుంచి ప్రధాన పార్టీలు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివాసీలు కావడంతో మరోవైపు గిరిజనేతర్ల ఓట్లు గెలుపోటములపై కీలక ప్రభావం చూపనున్నాయి. గతంలో ఆదివాసులకు లంబాడీలకు అనేక పోరాటాలు జరిగాయి. ఈ సందర్భంలో లంబాడ ఓట్లు(Lambada Votes) ఆదివాసులకు ఏ విధంగా అనుకూలిస్తాయో వేచి చూడాలి.