Khammam BRS : ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాళీ, నెరవేరిన పొంగులేటి శపథం!-khammam only one brs mla tellam venkatrao joined congress minister ponguleti challenge fulfilled ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Brs : ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాళీ, నెరవేరిన పొంగులేటి శపథం!

Khammam BRS : ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాళీ, నెరవేరిన పొంగులేటి శపథం!

HT Telugu Desk HT Telugu

Khammam BRS : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఆయన ఎన్నికల సమయంలో అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ లో చేరారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాళీ

Khammam BRS : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ(BRS Party) ఖాళీ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkatrao) ఆ పార్టీని వీడటంతో బీఆర్ఎస్(BRS) క్లీన్ స్వీప్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే జారిపోయినట్లయింది.

పదికి పది స్థానాల్లో కాంగ్రెస్

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) గత ఎన్నికలకు ముందు నాటి సీఎం కేసీఆర్(KCR) కు చేసిన సవాల్ పూర్తి స్థాయిలో నెగ్గింది. "ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క టీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనివ్వను" అని పొంగులేటి చేసిన శపథం నెరవేరింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో కైవసం చేసుకోగా పొత్తు నేపథ్యంలో సీపీఐ(CPI)కి కేటాయించిన కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ కూటమి నెగ్గింది. దీంతో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది. కాగా భద్రాచలం స్థానంలో ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన విజయం సాధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది.

ఈ క్రమంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సైతం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొనడం తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే శనివారం సాయంత్రం పార్టీ అగ్రనేత రాహుల్ నేతృత్వంలో హైదరాబాద్ లోని తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభలోనూ వెంకట్రావు పాల్గొనడంతో కాంగ్రెస్ (Congress)లో ఆయన చేరిక ఖాయంగానే స్పష్టమైంది. తాజాగా ఆదివారం ఎమ్మెల్యే వెంకట్రావు(Tellam Venkatrao Joins Congress) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అందరి అనుమానాలను నివృత్తి చేసింది. ఎమ్మెల్యే చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. అలాగే కాంగ్రెస్ పార్టీ పదికి పది స్థానాల్లో తమ ఎమ్మెల్యేలను పదిలం చేసుకొని పూర్తిస్థాయి మెజారిటీని నిలుపుకుంది.

గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జారిపోయే

ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)ప్రజలు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని, ఆ పార్టీ అధినేత కేసిఆర్ ను విశ్వసించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్(TRS) తరఫున కొత్తగూడెం స్థానం నుంచి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. అలాగే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖమ్మం స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే విజయం సాధించారు. గత చరిత్రను పునరావృతం చేస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకైక స్థానం మాత్రమే బీఆర్ఎస్(BRS) పార్టీకి దక్కింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన కూడా తాజాగా కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాలో కుప్పకూలినట్లయింది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి

సంబంధిత కథనం