Adilabad Congress MP Candidate Atram Suguna: ఆత్రం సుగుణ…. మొన్నటి వరకు ప్రభుత్వ టీచర్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. మొదట్నుంచి వామపక్ష భావజాలాని ఆకర్షితులైన సుగుణ… అనేక ప్రజా ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించారు. మలదశ తెలంగాణ ఉద్యమంలోనూ యాక్టివ్ గా పాల్గొన్నారు. సాధారణ టీచర్ అయిన సుగుణకు…. ఎంపీ టికెట్ దక్కటంపై అనేక వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదివాస్ (గోండ్) సామాజికవర్గానికి చెందిన ఆత్రం సుగుణ(Atram Suguna) దంపతులు వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నారు. ఇద్దరూ కూడా ప్రభుత్వ టీచర్లే. 2008లో సుగుణకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఓవైపు ఉపాధ్యాయ బాధ్యతలను నిర్వరిస్తూనే... మరోవైపు మానవ హక్కుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అనేక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉట్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సుగుణ.... ఇటీవలే (మార్చి 12) ఉద్యోగానికి రాజీనామా చేశారు. మార్చి 13వ తేదీనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఆమెకు 13 ఏళ్ల సర్వీస్ ఉండగానే... కొలువును పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక సుగుణ భర్త భుజంగరావ్ కూడా ప్రభుత్వ టీచరే. ఆయన కూడా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. దంపతులు ఇద్దరూ కూడా ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఆదివాసీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఇక తెలంగాణ ఉద్యమంలో… పాటలు పాడుతూ అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. వీరి పిల్లలు ఆత్రం విప్లవ్ కుమార్, సాయుధ కూడా కళాకారులుగా గుర్తింపు పొందారు. విప్లవ్ కుమార్… వైద్య విద్యను కూడా పూర్తి చేశాడు. చిన్న కుమారుడు ఇంజీనిరింగ్ చదువుతున్నాడు.
గత కొంతకాలంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ పలు కార్యక్రమాలను కూడా చేశారు ఆత్రం సుగుణ. పలు గ్రామాల్లో పర్యటిస్తూ….ప్రజలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఏడు నియోజకవర్గ పరిధిలోని హస్తం పార్టీ నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ టికెట్ కోసం మరికొంతమంది అధికారులు కూడా పోటీ పడ్డారు. కానీ చివరి నిమిషంలో… సుగుణ అభ్యర్థితత్వానికే కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదముద్ర వేసింది.
ఇక ఈసారి ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ నగేశ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సుగుణ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన సోయం బాపురావు… బీజేపీ నుంచి గెలిచారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ నుంచి టికెట్ దక్కలేదు. ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.