తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Mla Candidates: కొలిక్కి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు.. బెజవాడలో జనసేనకు ఝలక్.. వెస్ట్‌ బీజేపీకే….

BJP Mla Candidates: కొలిక్కి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు.. బెజవాడలో జనసేనకు ఝలక్.. వెస్ట్‌ బీజేపీకే….

Sarath chandra.B HT Telugu

27 March 2024, 11:35 IST

google News
    • BJP Mla Candidates: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా జనసేన తరపున టిక్కెట్ కోసం ఆశలు పెట్టుకున్న అభ్యర్థులకు భంగపాటు తప్పేట్టు లేదు. 
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు

బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు

BJP Mla Candidates: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ BJP అభ్యర్థులు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరినా అభ్యర్థుల ఎంపిక మాత్రం ఖరారు కాలేదు. ఇప్పటికే 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. జనసేన Janasena కూడా 9 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించింది.

మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలను దాదాపుగా ఖరారు చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ నార్త్‌‌తో పాటు శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్‌, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ పోటీ అభ్యర్థులు పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగితే తప్ప ఇవే స్థానాల్లో పోటీ ఖరారు కానుంది.

అభ్యర్ధులు వారేనా…

విశాఖ ఉత్తరం నుంచి బీజేపీ సీనియర్‌ నేత విష్ణుకుమార్‌ రాజుతో పాటు మరొకరి పేరును పరిశీలిస్తున్నారు. విష్ణు కుమార్‌ రాజు 2014లో టీడీపీ-బీజేపీ కూటమి తరపున పోటీ చేసి విజయం సాధించారు.

కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2014లో కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా కామినేని పేరు తెరపైకి వచ్చినా అనూహ్యంగా సోము వీర్రాజు కైకలూు తెరపైకి వచ్చారు.

రాయలసీమలో జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి తర్వాత టీడీపీలోచేరి మంత్రి పదవి చేపట్టారు. తర్వాత పరిణామాల్లో ఆయన బీజేపీలో చేరారు.

బద్వేలు నుంచి సురేష్‌, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ), ఆదోని నుంచి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్రమోహన్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

తెరపైకి విజయవాడ వెస్ట్….

సీట్ల సర్దుబాటులో భాగంగా ఇప్పటి వరకు విజయవాడ పశ్చి మ నియోజక వర్గం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. 2019లో పోటీ చేసి ఓడిపోయిన పోతిన మహేష్‌కు విజయవాడ పశ్చిమ టిక్కెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా చివరి నిమిషంలో విజయవాడ వెస్ట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టు తెలుస్తోంది.

2014 కూడా విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి వెల్లంపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో 3108 ఓట్లతో వెల్లంపల్లి ఓడిపోయారు. అప్పట్లో టీడీపీ రెబల్ అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకోక పోవడంతో వెల్లంపల్లి ఓడిపోయారు. వైసీపీ నుంచి గెలిచిన జలీల్‌ ఖాన్ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో జలీల్‌ఖాన్ కుమార్తె టీడీపీ తరపున పోటీ చేశారు. వైసీపీ తరపున పోటీ చేసిన వెల్లపల్లి విజయం సాధించారు.

తాజాగా పరిణామాల్లో విజయవాడ పశ్చిమ నియోజక వర్గాన్ని బీజేపీకి కేటాయించ నున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన తుళ్లూరు శైవ క్షేత్రం నిర్వాహకుడు శివస్వామి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెరపైకి శివస్వామి….

విజయవాడ పాతబస్తీ వాస్తవ్యుడైన శివస్వామి బీజేపీ తరపున గుంటూరు, విజయవాడ నగరాల్లో ఏదొక నియోజక వర్గంలో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశ్రమ జీవితం ప్రారంభించడానికి ముందు శివస్వామి పాతబస్తీలో వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టాలతో కనిపించకుండా పోయారు. ఆ తర్వాత సన్యాసంలోకి ప్రవేశించినట్టు స్థానికులు చెబుతారు. తాజాగా రాజకీయాల్లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయవాడ సెంట్రల్, వెస్ట్‌ నియోజక వర్గాల్లో ఏదొక స్థానం కోసం బీజేపీ నేతలు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఉండటం, వైసీపీ తరపున వెల్లంపల్లి పోటీలో ఉండటంతో సామాజిక సమీకరణల నేపథ్యంలో బీజేపీ పశ్చిమ నియోజక వర్గంవైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. స్థానికంగా బలమైన అభ్యర్థి బీజేపీకి లేకపోవడంతో ఇతర ప్రాంతాల ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేపథ్యం ఉన్న నాయకుల్ని పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా ఉంది.

తదుపరి వ్యాసం