BJP's Lok Sabha candidates: మాజీ సీఎంలు, రాజ్య సభ సభ్యులు..; లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ వ్యూహం..
BJP's Lok Sabha candidates: మార్చి 2న 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇద్దరు అభ్యర్థులు తప్పుకున్నారు. మార్చి 13న మరో 72 మంది పేర్లను విడుదల చేసిన బీజేపీ ఇప్పటి వరకు 265 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
BJP's Lok Sabha candidates: మార్చి 13న భారతీయ జనతా పార్టీ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 72 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మార్చి 2న విడుదల చేశారు.
తొలి జాబితాలో ప్రధాని
తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 34 మంది కేంద్రమంత్రులు ఉన్నారు. అయితే, తొలి జాబితాలో 33 మంది సిటింగ్ ఎంపీలకు ఈ సారి అవకాశం ఇవ్వలేదు. రెండో జాబితాలో నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి సహా తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. రెండో జాబితాలో 31 మంది ఎంపీల స్థానంలో కొత్త అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా బీజేపీ ఇప్పటి వరకు 265 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాతో మధ్యప్రదేశ్, ఢిల్లీ, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
రాజ్య సభ సభ్యులు
రెండో జాబితాలో మహారాష్ట్రలోని ముంబై నార్త్ స్థానం నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గోయల్ 2024 లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ముంబైలో పుట్టి పెరిగిన గోయల్ రాష్ట్రం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోయల్ తన మంత్రివర్గ సహచరులు, రాజ్యసభ సభ్యులు మన్సుఖ్ మాండవీయ, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ చంద్రశేఖర్, భూపేందర్ యాదవ్, పురుషోత్తం రూపాలా, వి మురళీధరన్ లతో కలిసి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లోని గర్వాల్ నుంచి పోటీ చేసేందుకు అనిల్ బలూనీని బీజేపీ బరిలోకి దింపింది. బలూనీ పార్టీ మీడియా సెల్ అధిపతిగా, 2018 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
నిబంధనల ప్రకారం కేంద్ర మంత్రి లోక్ సభ లేదా రాజ్యసభలో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాలి. ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తిని మంత్రిని నియమిస్తే, రెండు సభల్లో ఏదో ఒకదానికి ఎన్నికైతే తప్ప ఆరు నెలల తర్వాత మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
మాజీ సీఎంలు
కాషాయ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మాజీ సీఎంలను కూడా బరిలోకి దింపుతోంది. బీజేపీ రెండో జాబితాలో హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కర్నాల్ నుంచి, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైని హవేరి నుంచి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ను హరిద్వార్ నుంచి పోటీకి దింపుతోంది. ఒక రోజు ముందే, ఖట్టర్ స్థానంలో మరో ఓబీసీ నేత నయాబ్ సింగ్ సైనీని హర్యానా ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేబ్, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ మార్చి 2న విడుదల చేసిన బీజేపీ తొలి లోక్ సభ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
కొత్త ముఖాలు..
తొలి రెండు జాబితాల్లో బీజేపీ మొత్తంగా 63 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించింది. ప్రజ్ఞా ఠాకూర్, రమేశ్ బిధురి, మీనాక్షి లేఖి సహా 33 మంది ఎంపీల స్థానంలో తొలి జాబితాలో కొత్త ముఖాలు వచ్చాయి. కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, మాజీ మంత్రులు సదానంద గౌడ, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ సహా మరో 30 మంది ఎంపీలకు ఈ సారి అవకాశం కల్పించలేదు. ఢిల్లీకి చెందిన ఒక్క ఎంపీ మినహా మిగిలిన వారందరినీ మార్చారు. గుజరాత్ లో పది మంది (రెండు జాబితాలు), కర్ణాటకలో తొమ్మిది మంది, మహారాష్ట్రలో ఆరుగురిని తొలగించారు. దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు ఢిల్లీ స్థానం నుంచి తనను మళ్లీ బరిలోకి దింపవద్దని గౌతమ్ గంభీర్ బీజేపీ అధిష్టానాన్ని కోరారు. 2019లో గంభీర్ ఈ స్థానం నుంచి విజయం సాధించారు.
ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం కోసమే..
కొత్త ముఖాలు, మాజీ ముఖ్యమంత్రులను బరిలోకి దింపడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను దూరం పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త ముఖాలు , మాజీ సీఎంలు తమను తాము నిరూపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తారని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్ర లోని బీడ్ నియోజకవర్గంలో ప్రీతమ్ ముండే స్థానంలో ఆమె సోదరి, మాజీ ఎమ్మెల్యే పంకజ ముండేను బీజేపీ రంగంలోకి దింపింది. వీరిద్దరూ మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు దివంగత గోపీనాథ్ ముండే కుమార్తెలు. అదేవిధంగా, కర్ణాటకలోని దావణగెరె నియోజకవర్గంలో 2004 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ పార్టీ నాయకుడు జిఎం సిద్దేశ్వర స్థానంలో అతని భార్య గాయత్రి సిద్దేశ్వరకు బీజేపీ టికెట్ ఇస్తోంది.
370 సీట్లు లక్ష్యం
2024 లోక్ సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 400 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019 లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో జరిగాయి. 2019 మే 23 న వెలువడిన ఫలితాల్లో బీజేపీ 303 స్థానాలు గెలుచుకుంది.