Vellampalli Vs Vysyas: వైసీపీ కొత్త తలనొప్పి.. వెల్లంపల్లి వర్సెస్ వైశ్యుల వివాదం
Vellampalli Vs Vysyas: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు వైశ్యసామాజిక వర్గ నాయకులతో తలెత్తిన వివాదాలు చివరకు వైసీపీని చిక్కుల్లో పడేశాయి. సామాజిక వర్గ కార్యక్రమాలకు మంత్రి అడ్డుపడటం కాస్త రాజకీయ వివాదంగా మారింది.
Vellampalli Vs Vysyas: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సొంత సామాజిక వర్గ నేతలతో తలెత్తిన వివాదాలు వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కృష్ణానదీ తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వెల్లంపల్లి అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల కోసం దరఖాస్తు చేసినా మాజీ మంత్రి అడ్డుపడ్డడటంతో అధికార యంత్రాంగం కార్యక్రామనికి అనుమతులు రద్దు చేసింది.
రాజకీయాలకు అతీతంగా నిర్వహించే కార్యక్రమానికి మంత్రి అడ్డుతగలడంతో అది కాస్త రాజకీయ వివాదంగా మారింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు స్థలంలో ఆర్యవైశ్యులు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతోనే వెల్లంపల్లి ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. కార్తీక పౌర్ణమికి కొద్ది రోజుల ముందు అదే ప్రాంతంలో నిర్వహించిన ఆర్యవైశ్య వనభోజనాలకు మంత్రి కూడా హాజరయ్యారు.
రోజుల వ్యవధిలోనే మరో కార్యక్రమానికి పోలీసులు అనుమతించక పోవడంతో ఆర్యవైశ్య సంఘాలు మాజీ మంత్రిపై మండిపడుతున్నాయి. వెల్లంపల్లి తీరును ఇతర పార్టీల్లో ఉన్న అదే సామాజిక వర్గం నేతలు ఎండగట్టడం ప్రారంభించారు. గతకొద్ది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం, తాజాగా ఆందోళన బాట పట్టింది. విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో వైశ్య సామాజిక వర్గాన్ని వేధించేలా మాజీ మంత్రి వెల్లంపల్లి వ్యవహరిస్తున్నారని నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు.
ఇటీవల విజయవాడ శివార్లలో జరిగిన వనభోజనాల్లో మాజీమంత్రి వెల్లంపల్లి టీడీపీపై విమర్శలు గుప్పించడంతో వెల్లంపల్లి వ్యతిరేక ఆందోళనల్లో టీడీపీ కూడా జత కలిసింది. వెల్లంపల్లికి వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు నిర్వహిస్తున్న ఆందోళనలకు టీడీపీ, జనసేనలు మద్దతు ఇస్తున్నాయి.
భవానీపురం పున్నమిఘాట్ వద్ద ఆర్యవైశ్యులు నిర్వహించాలనుకున్న సత్యనారాయణస్వామి వ్రతం, వన సమారాధన కార్యక్రమాన్ని వెలంపల్లి అడ్డుకోవటంపై ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. పోలీసుల నిబంధనలు ఆర్యవైశ్యులకు మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలు రహదారులపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటికి లేని నిబంధనలు ఆర్యవైశ్యులకు మాత్రమే విధించడానికి వెల్లంపల్లే కారణమని ఆరోపిస్తున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ పెద్దలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనవసర వివాదాలతో పార్టీని రచ్చకీడుస్తున్న మాజీ మంత్రి తీరుపై సొంత పార్టీలో సైతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న సామాజిక వర్గాల్లో వైశ్య వర్గం కూడా ఒకటిగా ఉంది.