తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Aruri Ramesh Issue: మళ్లీ యూటర్న్ తీసుకున్న అరూరి, రోజంతా రమేశ్ చుట్టే తిరిగిన రాజకీయం

Aruri Ramesh Issue: మళ్లీ యూటర్న్ తీసుకున్న అరూరి, రోజంతా రమేశ్ చుట్టే తిరిగిన రాజకీయం

HT Telugu Desk HT Telugu

27 March 2024, 11:35 IST

google News
    • Aruri Ramesh Issue: బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మరోసారి యూ టర్న్ తీసుకున్నాడు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో అరూరి రమేశ్
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో అరూరి రమేశ్

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో అరూరి రమేశ్

Aruri Ramesh Issue: వరంగల్‌  Warangal రాజకీయాలు రోజంతా అరూరి రమేష్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. 10 రోజుల క్రితమే అరూరి రమేష్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయం కాగా.. బీఆర్ఎస్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR కలగజేసుకుని నచ్చజెప్పారు.

ఆ తరువాత యూ టర్న్ తీసుకున్న అరూరి.. వారం రోజుల పాటు బీఆర్ఎస్ లోనే కొనసాగారు. అనంతరం బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amith Shah ఆధ్వర్యంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేసిన ఆయన, ఉదయం హనుమకొండలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి దిల్లీ ప్రయాణమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అరూరి ఇంటికి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి Errabelli దయాకర్రావు, ఎమ్మెల్సీ బస్వరాజు Basvaraju Sarayya సారయ్య ఇద్దరూ వచ్చి బుజ్జగించడం, అక్కడి నుంచి అరూరిని హైజాక్ చేసి, పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు బయలుదేరడం, మధ్యలో బీజేపీ నేతలు అడ్డుకోవడం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ, మళ్లీ పార్టీ మారడం లేదని అరూరి ప్రకటన చేయడం.. ఇలా రోజు మొత్తం అరూరి రమేశ్ చుట్టే రాజకీయం తిరిగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అరూరి హైడ్రామా నడిపించారనే అభిప్రాయాలు వినిపించాయి.

ఉదయం నుంచే హై డ్రామా

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఎంపీగా బరిలో నిలిచేందుకే ఆయన బీజేపీ వైపు అడుగులు వేయగా.. ఆ పార్టీ నేతలు కూడా ఆయనను చేర్చుకోవడానికి సుముఖంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం బీఆర్ఎస్ రాజీనామా చేసి, బీజేపీలో చేరబోతున్నట్టు తన క్యాడర్ కు ముందస్తుగానే సమాచారం ఇచ్చిన అరూరి రమేశ్.. ఉదయం హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధపడ్డారు.

విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అరూరి రమేశ్ ఇంటికి చేరుకుని ఆయనను మరోసారి బుజ్జగించే పనిలో పడ్డారు. ఆ తరువాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఇంకొందరు నేతలు కూడా తరలివచ్చి అరూరితో మాట్లాడారు.

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు వారు అరూరి రమేశ్ ను బుజ్జగించే ప్రయత్నం చేయగా.. కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఎటువైపూ సంపూర్ణ అంగీకారం తెలియజేయకపోవడంతో రమేశ్ ను అప్పటికప్పుడు హైదరాబాద్ తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు.

కొద్దిసేపు చర్చలు జరపగా.. గందరగోళం లో పడిన అరూరి రమేష్ కంటతడి కూడా పెట్టుకున్నారు. చివరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి కారులో రమేశ్ ను ఎక్కించుకోగా.. అక్కడున్న అరూరి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై అరూరి అంటూ నినదిస్తూ.. కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని తప్పించుకుని మాజీ మంత్రి దయాకర్రావు వెహికిల్ హైదరాబాద్ వైపు పరుగులు తీసింది.

జనగామ పెంబర్తి వద్ద ఉద్రిక్తత

అరూరి రమేశ్ ను హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ నేతలు వారి వాహనాలను అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కారులో కూర్చుని ఉన్న అరూరి రమేశ్ బయటకు తీసుకొచ్చి, తమ కారులో రావాల్సిందిగా కోరారు.

ఎర్రబెల్లి వాహనంలో వెళ్లొద్దని, బీజేపీలో చేరాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపుల తోపులాట జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడగా.. తోపులాటలో అరూరి రమేశ్ చొక్కా కూడా చినిగింది. అనంతరం బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి, అరూరితో మాట్లాడించారు.

అనంతరం తమ కారులో రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అక్కడున్న బీఆర్ఎస్ నేతలు ప్రతిఘటించడంతో చివరకు రమేశ్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కారులోనే హైదరాబాద్ కు చేరుకున్నారు. కాగా అరూరి రమేశ్ ను కిడ్నాప్ చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో అరూరి వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది.

బీజేపీ నేతలను కలిశాను.. క బీఆర్ఎస్ లోనే ఉన్నా...: అరూరి రమేశ్

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను తన ఇష్టంతోనే బీఆర్ఎస్ లో కొనసాగుతున్నట్లు అరూరి రమేశ్ ప్రకటించారు. మాజీ మంత్రి దయాకర్రావు ఇతర నేతలు ఆయనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లగా.. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, తమ పార్టీ నేతలు తనను తీసుకొస్తే కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

తాను అమిత్ షాను కలిసి విషయం వాస్తవం కాదని, కొంతమంది బీజేపీ నేతలను మాత్రమే కలిశానన్నారు. కానీ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, మీడియా సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ చేరడానికి మాత్రం కాదని అరూరి రమేశ్ స్పష్టం చేశారు. ఆ తరువాత మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన భేటీకి అరూరి రమేశ్ హాజరయ్యారు.

అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ నిర్వహించిన మీటింగ్ లో పాల్గొన్నారు. అదే సమయంలో ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలో కూడా అరూరి రమేశ్ టికెట్ నిరాకరించినట్లు తెలిసింది. దీంతోనే ఆ స్థానాన్ని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

రెండోసారి అదే తీరు

ఇప్పటికే ఈ నెల 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ టూర్ సందర్భంగా అరూరి రమేశ్ బీజేపీలో చేరతాడనే ప్రచారం జరగగా.. అప్పుడు అనూహ్యం నిర్ణయం మార్చుకుని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకటన చేశారు. ఇప్పుడు రెండో సారీ కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది.

రెండుసార్లు అదే తీరుగా ప్రచారం జరగడం, చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు అరూరి ప్రకటించడంతో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ శ్రేణుల్లో కూడా గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు మాట మార్చుకున్న అరూరి.. మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

(

తదుపరి వ్యాసం