Wardhanapet : ఎన్ కౌంటర్లతో రక్త చరిత్ర సృష్టించాడు - కాంగ్రెస్ అభ్యర్థిపై ఎమ్మెల్యే అరూరి సీరియస్ కామెంట్స్-wardhannapet election news in telugu brs mla aroori ramesh comments on congress candidate nagaraju ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Wardhanapet : ఎన్ కౌంటర్లతో రక్త చరిత్ర సృష్టించాడు - కాంగ్రెస్ అభ్యర్థిపై ఎమ్మెల్యే అరూరి సీరియస్ కామెంట్స్

Wardhanapet : ఎన్ కౌంటర్లతో రక్త చరిత్ర సృష్టించాడు - కాంగ్రెస్ అభ్యర్థిపై ఎమ్మెల్యే అరూరి సీరియస్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

Telangana Assembly Elections 2023: వర్ధన్నపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజును టార్గెట్ చేస్తూ… ఆయన ఎన్ కౌంటర్ లతో రక్త చరిత్ర సృష్టించాడని ఎమ్మెల్యే ఆరూరి సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

కేఆర్ నాగరాజుపై వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సీరియస్ కామెంట్స్

Wardhanapet Assembly constituency: ఎలక్షన్లు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని కొంకపాక, గోపనపల్లి, అనంతారం గ్రామాల్లో గురువారం రాత్రి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నాగరాజును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వడంటూ కాంగ్రెస్ వాళ్లు తిరుగుతున్నారని మండిపడ్డారు.

‘కాంగ్రెస్ అభ్యర్థి ఏనాడైనా మన ఊరికి వచ్చాడా.. మన ఆపతిసంపతికి వచ్చాడా.. పెండ్లిళ్లు, పేరంటాల్లో పాలుపంచుకున్నడా.. మన బాగోగుల్లో భాగం పంచుకున్నడా’ అని ప్రశ్నించారు. ‘ఉద్యోగంలో ఉండి వరంగల్ జిల్లాలో ఉన్న విప్లవ కారులను ఎన్ కౌంటర్ల పేరున కాల్చి రక్తపు మరకలతో రక్త చరిత్ర సృష్టించాడు.. అందరివాడుగా ఉన్న అరూరి కావాలో.. రక్త చరిత్ర కావాలో ఆలోచించండి’ అంటూ నాగరాజుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ కౌంటర్ల పేరున విప్లవకారులను చంపాడంటూ అరూరి వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో కాంగ్రెస్ నేతలు అరూరి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేఆర్ నాగరాజు పోలీసు డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి కాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ స్థాయుల్లో విధులు నిర్వర్తించాడు. 1990లో వర్ధన్నపేటలోనే ఎస్సైగా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరిన ఆయన నెక్కొండ, కాకతీయ యూనివర్సిటీ, మొగుళ్లపల్లి, స్పెషల్ పార్టీ, మిల్స్ కాలనీ, పరకాలలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేశారు. ఆ తరువాత ప్రమోషన్ పొంది ములుగు, సుబేదారి, పాలకుర్తి, సీఐడీ విభాగంలో సీఐగా విధులు నిర్వర్తించారు. మళ్లీ పదోన్నతి సాధించిన ఆయన వరంగల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ గా పని చేశారు. ఆ తరువాత హైదరాబాద్ కు బదిలీ అయి అక్కడ వివిధ హోదాల్లో తన కేరీర్ కొనసాగించారు. అక్కడి నుంచి మళ్లీ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా కొంతకాలం పని చేసి ఈ ఏడాది మార్చి 31న ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి వర్ధన్నపేట అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో నిలిచారు.

రిపోర్టింగ్ :హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)