Warangal BRS MP Ticket : పసునూరి సీటుకు 'అరూరి' ఎసరు!
Warangal BRS MP Ticket 2024: పార్లమెంట్ ఎన్నికలకు టైం దగ్గరపడుతున్న వేళ ఎంపీ టికెట్ ఆశిస్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఈ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ సీటుపై ఆరూరి రమేశ్ గురి పెట్టారు.
Warangal BRS MP Ticket 2024: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ కు వచ్చిన హైప్ తో గెలిచే అవకాశం ఉన్న లీడర్లు కూడా ఓటమి చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఇక అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా వరంగల్ ఎంపీ సీటుపై కొందరు నేతలు కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలతో పాటు ఓటమి పాలైన నేతలు, సిట్టింగులు, కొత్తగా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనుకునే నేతలంతా లోక్ సభ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు వర్ధన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మధ్య పోటాపోటీ నడుస్తోంది. ఇప్పటికే అరూరి రమేశ్ కార్యకర్తల మీటింగులతో బిజీగా ఉండగా.. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉండిపోయిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా మరోసారి రంగంలోకి దిగారు. దీంతో ఇద్దరి మధ్య టికెట్ వార్ నడుస్తోంది.
ఇన్నిరోజులు సైలెంట్
వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి నియోజకవర్గాలు ఉండగా.. గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ గెలిచారు. తెలంగాణ తల్లి విగ్రహ సృష్టి కర్తగా, ఉద్యమకారుడిగా ఆయనకు పేరుంది. కాగా పార్టీ ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ లో ఉన్న ఆయన 2001 నుంచి 2009 వరకు పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009 నుంచి 2011 వరకు అప్పటి టీఆర్ఎస్ వీ జిల్లా అధ్యక్షుడిగా, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొనసాగారు. ఆ తరువాత అరూరి రమేశ్ బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. పసునూరి దయాకర్ కు ఆ నియోజకవర్గ బాధ్యతలు కట్ చేశారు. ఇదిలాఉంటే తెలంగాణ ఏర్పడిన తరువాత 2015లో తొలిసారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన 6,15,403 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,315 ఓట్లకే పరిమితం అయ్యారు. ఇక రెండోసారి 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో దయాకర్ 6,12,498 ఓట్లు సాధించగా.. సమీప ప్రత్యర్థి దొమ్మాటి సాంబయ్యకు 2,62,200 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండు సార్లు భారీ మెజారిటీ అందుకున్న తిరుగులేని నేతగా పేరున్న దయాకర్ ఎన్నడూ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. దీంతోనే జనాల్లో ఆయనకు పెద్దగా గుర్తింపు లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడటంతో మళ్లీ తెరమీదకు వచ్చారు. తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తరచూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ చర్చల్లో నిలుస్తున్నారు.
పట్టుబడుతున్న అరూరి
ఇప్పటికే రెండు సార్లు ఎంపీ టికెట్ ను అధిష్ఠానం పసునూరి దయాకర్కు కట్టబెట్టగా.. ఈసారి టికెట్ తనకే కేటాయించాలని అరూరి రమేశ్ పట్టుబడుతున్నట్లు తెలిసింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. ఎలాగైన పవర్ లో ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ అగ్ర నేతల ప్రసన్నం కోసం ప్రయత్నాలు చేస్తున్న అరూరి.. టికెట్ తనదేననే ధీమాతో ఉన్నారు. తన కార్యకర్తలకూ అదే విషయం చెబుతూ పోటీ కోసం సన్నద్ధమవుతున్నారు. తరచూ నియోజకవర్గ కార్యక్తలతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా.. నిత్యం పార్టీ శ్రేణులకు టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
ఇద్దరి మధ్య ఇంటర్నల్ వార్
ఎమ్మెల్యే గా అరూరి రమేశ్, ఎంపీగా పసునూరి దయాకర్ ఉన్నసమయంలో ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉండేది. దీంతోనే అరూరి రమేశ్ తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కార్యక్రమాలకు అడపాదడపా పసునూరి దయాకర్ ను ఆహ్వానించేవారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య సీన్ మారిపోయింది. ఇద్దరు నేతల మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా హ్యాట్రిక్ టికెట్ కోసం పసునూరి ప్రయత్నాలు చేస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన నిరాశను పోగొట్టుకునేందుకు లోకసభ టికెట్ తనకు కేటాయించాలని అరూరి రమేశ్ పట్టుబడుతున్నారు. దీంతో పసునూరికి అది మింగుడు పడటం లేదు. పార్టీలో పోటీ లేదనుకున్న తనకు అరూరి రూపంలోనే ప్రత్యర్థి తయారవడంతో ఇద్దరి మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తోంది. దీంతోనే ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉంటూ పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. మరికొద్దిరోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. అధిష్టానం ఇద్దరిలో టికెట్ ఎవరికి కేటాయిస్తుందో చూడాలి.