Telangana Assembly Election 2023: వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. కొద్దిరోజుల కిందట గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన ఆయనకు నిరసనలు, నిలదీతలు ఎదురవగా.. ఆ వెంటనే కొందరు నేతలు అసమ్మతి రాజేశారు. ఆ తరువాత పార్టీ పెద్దలు కలగజేసుకుని అసమ్మతిని సద్దుమణిగించగా.. ఇప్పుడు ఎమ్మెల్యే అరూరికి మరో టెన్షన్ మొదలైంది. నియోజకవర్గంలో హస్తం గాలి వీస్తుండటం పార్టీ క్యాడర్ కొద్దికొద్దిగా కారు దిగిపోతుండటం ఆయనను కలవరానికి గురి చేస్తోంది.
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గత రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవి రేసులో ఉండాలని ఆశపడ్డారు. కానీ ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. ఆయనపై వ్యతిరేకతకు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక నాయకుల ప్రవర్తన కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని కొందరు భూములు కబ్జా చేస్తుండగా.. ల్యాండ్ మాఫియాను పెంచి పోషిస్తున్నాడని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక నాయకులు కొంతమందికే పరిమితం చేయడం, కొన్నిచోట్ల కమీషన్లు దండుకుని అనర్హులకు కూడా పథకాలు అప్పగించారనే ప్రచారం కూడా ఉంది. దీంతోనే ఆయన ఎక్కడికెళ్లినా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొందరు నేతలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుండటం, ఇంకొందరిని పట్టించుకోకుండా చులకనగా చూస్తుండటం, ఇతర లావాదేవీల కారణాలతో గత జులైలో ఆయనపై కొందరు నేతలు అసమ్మతి రాజేశారు. వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ లలితా యాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, ఇతర నాయకులు బిల్లా ఉదయ్ రెడ్డి, రతన్ రావు, బుద్దె వెంకన్న తదితరులు ప్రత్యేకంగా సమావేశమై ఎమ్మెల్యే అరూరిపై అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ ఇవ్వొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కు వినతిపత్రాలు ఇచ్చారు. కాగా అసమ్మతి తీవ్ర రూపం దాల్చడంతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రంగంలోకి దిగి అందరికీ సర్ది చెప్పారు. దీంతో అప్పటివరకు అసమ్మతి వీగిపోయింది. కానీ ఆ తరువాత ఎమ్మెల్యే అరూరి తనపై అసమ్మతి లేపిన నేతలను మాటలతో ఇబ్బంది పెట్టడంతో పాటు కొన్ని కార్యక్రమాలకు వారిని దూరం ఉంచాడనే ఆరోపణలున్నాయి. దీంతో వారిలో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉండిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచారం జరుగుతుండటంతో అసమ్మతివాదులంతా ఒక్కొక్కరిగా హస్తం పార్టీ వైపు చూస్తున్నారు.
నియోజకవర్గంలో అత్యధికంగా 18 గ్రామాలున్న హసన్ పర్తి మండలం కీలకం కాగా.. ఈ మండలం నుంచి ముఖ్య నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. హసన్ పర్తి పీఏసీఎస్ చైర్మన్ జిల్లా ఉదయ్ రెడ్డి, మండల పరిధిలోని గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఏరుకొండ శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు చింత నవీన్, నాయకులు కస్తూరి రవి, తదితరులు బుధవారం ఉదయం కాంగ్రెస్ లో చేరారు. వారికి కాంగ్రెస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేకు, ఆయన అనుచరులకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వీళ్లంతా పార్టీ మారడంతో ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతోనే ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే కొందరు నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పగా.. తొందర్లోనే మరికొందరు కూడా కారు దిగనున్నట్లు తెలిసింది. ఇటీవల వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయనే పార్టీ మారుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు మూడు నెలల కిందట అసమ్మతి రాజేసిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర నేతలతో పాటు మరికొందరు కార్పొరేటర్లు కూడా పార్టీ మారనున్నట్లు తెలిసింది. అందులో గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎస్టీ రిజర్వ్ అయిన డివిజన్ కార్పొరేటర్ తో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో కార్పొరేటర్, మరో కీలక నేత కూడా పార్టీ మారనున్నట్లు సమాచారం. వీరితో పాటు ఎమ్మెల్యే కు షాడోలా తిరిగిన ఇంకొందరు నేతలు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే అరూరికి కంటిమీద కునుకు ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికే నియోజకవర్గంలో ఏ రోజుకారోజు పార్టీ పరిస్థితులు మారిపోతుండగా.. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి…!